హైడ్రా ఎఫెక్ట్.. ఆరుగురు అధికారులపై కేసులు నమోదు

హైడ్రా ఎఫెక్ట్.. ఆరుగురు అధికారులపై కేసులు నమోదు

హైదరాబాద్: హైడ్రా అన్నంత పని చేసింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని చెరువుల్లో అక్రమ కట్టడాలకు అనుమతి ఇచ్చిన అధికారులపై చర్యలు తీసుకోవడంలో సక్సెస్ అయ్యింది. ఎఫ్టీఎల్ పరిధిలో కట్టడాలకు పర్మిషన్ ఇచ్చిన ఆఫీసర్లపై యాక్షన్ తీసుకోవాలని హైడ్రా ఇటీవల సైబరామిషనర్‎కు సిఫారసు చేసింది. హైడ్రా సిఫారసు మేరకు ఆరుగురు అధికారులపై సైబరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. బాచుపల్లి ఎమ్మార్వో పూల్ సింగ్, మేడ్చల్ మల్కాజిగిరి ల్యాండ్ రికార్డ్స్ అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీనివాసులు, హెచ్ఎండీఏ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ సుధీర్ కుమార్, హెచ్ఎండీఏ సిటీ ప్లానర్ రాజ్ కుమార్, నిజాంపేట మున్సిపల్ కమిషనర్ రామకృష్ణ, చందానగర్ జీహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్ సుదామ్ష్ పై పోలీసులు కేసు ఫైల్ చేశారు. 

ఎకానమిక్ అఫెన్స్ కింద ఈ ఆరుగురి అధికారులపై కేసు నమోదైంది. అధికారులపై కేసులు నమోదు కావడంతో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. తాజా పరిణామంతో ఎఫ్టీఎల్ పరిధిలో నిర్మాణాలకు పర్మిషన్లు ఇచ్చిన మరికొందరు అధికారుల్లో దడ మొదలైంది. కాగా, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ప్రభుత్వ ఆస్తులు, చెరువులు, కుంటలు, నాళాలు పరిరక్షణ కోసం ప్రభుత్వం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా హైడ్రా అనే ఒక కొత్త వ్యవస్థను తీసుకొచ్చింది. ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా పని చేసుకుంటూ వెళ్తోన్న హైడ్రా.. అక్రమ కట్టడాలను ఎక్కడికక్కడ నేలమట్టం చేస్తోంది. 

Also Read:- YS జగన్‎కు హైడ్రా నోటీసులు

అయితే, కూల్చివేతల సమయంలో హైడ్రా అధికారులు, సిబ్బందికి కొన్ని సమస్యలు ఎదురవుతున్నాయి. సంబంధిత అధికారులు పర్మిషన్ ఇవ్వడంతోనే తాము కట్టడాలు నిర్మించారని.. ఇప్పుడు మీరు ఎలా కూల్చివేస్తారని నిర్మాణదారులు అధికారులతో వాగ్వాదానికి దిగుతున్నారు. దీనిపై ఫోకస్ పెట్టిన హైడ్రా.. ఎఫ్టీఎల్, బఫర్ జోన్ అని తెలిసి కూడా కట్టడాలకు అనుమతులు ఇచ్చిన అధికారులపై చర్యలు తీసుకుంటామని చెప్పింది. చెప్పినట్లుగానే తాజాగా ఆరుగురు అధికారులపై కేసులు నమోదు చేయించింది.