కావూరి హిల్స్‎లోకి హైడ్రా ఎంట్రీ..!

కావూరి హిల్స్‎లోకి హైడ్రా ఎంట్రీ..!

హైదరాబాద్: పేదలు, సంపన్నులు అనే తేడాలేకుండా హైడ్రా ముందుకు సాగుతోంది. ఇవాళ కావూరి హిల్స్‎లోకి ఎంట్రీ ఇచ్చింది హైడ్రా.. కావూరి హిల్స్ పార్కు స్థలంలో నిర్మించిన స్పోర్ట్స్ అకాడమీ షెడ్లను అధికారులు నేలమట్టం చేశారు. కావూరి హిల్స్ అసోసియేషన్ ఫిర్యాదు మేరకు హైడ్రా రంగంలోకి దిగింది. ఇవాళ ఉదయం అకాడమీ నిర్మాణాలను కూల్చేశారు. అనంతరం అక్కడ కావూరిహిల్స్‌ పార్కు అని బోర్డు ఏర్పాటు చేశారు. 

మరోవైపు దీనిపై స్పోర్ట్స్‌ అకాడమీ నిర్వాహకులు స్పందించారు. కావూరి హిల్స్‌ అసోసియేషన్‌ తమకు 25 ఏళ్లకు లీజుకు ఇచ్చిందన్నారు. ఆ గడువు ముగియక ముందే నిర్మాణాలను అన్యాయంగా తొలగిస్తున్నారని ఆరోపించారు. హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ మాట్లాడుతూ.. కోర్టు ఆదేశాలతో అక్రమ నిర్మాణాలను కూల్చివేసినట్లు స్పష్టం చేశారు. 

అమీన్ పూర్‎లో అర్ధరాత్రి వరకు..


మరోవైపు సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు అమీన్పూర్ మున్సిపాలిటీ కిష్టారెడ్డిపేట సర్వే నంబర్ 164 లోని ప్రభుత్వ భూమిలో అర్ధరాత్రి వరకు హైడ్రా కూల్చివేతలు కొనసాగాయి. జంబో మిషన్‎తో పాటు 3 జేసీబీలతో అక్రమ కట్టడాలను తొలగించారు. మొత్తం మూడో భవనాలు నేలమట్టం‌ కావడంతో హైడ్రా, రెవెన్యూ, మున్సిపల్ శాఖల అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.