ఇక మూసీలో కబ్జాల కూల్చివేత.. వారం, పది రోజుల్లో షురూ.?

ఇక మూసీలో కబ్జాల కూల్చివేత.. వారం, పది రోజుల్లో షురూ.?
  • బాధ్యతలు హైడ్రాకు.. 
  • ముందుగా షెడ్లు, గోదాములపై దృష్టి 
  • నివాసాలు కోల్పోయే వారికి  ఇందిరమ్మ ఇండ్లు లేదా పరిహారం  
  • మూసీ  ‘ప్రాజెక్టు’పై ముందుకు కదలనున్న సర్కారు 


హైదరాబాద్ సిటీ, వెలుగు : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న మూసీ సుందరీకరణ ప్రాజెక్ట్​పనులు ప్రారంభించే ప్రక్రియలో ముందుకు సాగుతున్నట్టు మూసీ రివర్ డెవలప్​మెంట్​కార్పొరేషన్​(ఎంఆర్​డీసీ) అధికారులు తెలిపారు. ఇందులో భాగంగా త్వరలో మూసీలోని ఆక్రమణల తొలగింపు కార్యక్రమాన్ని చేపట్టడానికి సన్నాహాలు చేస్తున్నారు. మూసీ పరీవాహక ప్రాంతంలో అక్రమంగా వెలసిన షెడ్లు, గోదాములను ముందుగా కూల్చివేయాలని నిర్ణయించారు. ఈ కూల్చివేతల పనులను ప్రభుత్వం హైడ్రాకు అప్పగించనున్నట్టు తెలుస్తోంది. దీంతో వారం, పది రోజుల్లోనే కూల్చివేతలు మొదలయ్యే అవకాశం ఉందని కొందరు అధికారులంటున్నారు. తూర్పున ఔటర్ రింగ్ రోడ్డు గౌరెల్లి నుంచి పశ్చిమాన ఔటర్ రింగ్ రోడ్డు నార్సింగి వరకు 55 కిలోమీటర్ల  మేర మూసీని రూ. 60వేల కోట్లతో అభివృద్ధి చేయడానికి మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ ఆధ్వర్యంలో ఇప్పటికే ప్రణాళికలు సిద్ధం చేసిన సంగతి తెలిసిందే.  

12 వేలకు పైగా కబ్జాలు 

మూసీ పొడవునా భారీ సంఖ్యలో కబ్జాలున్నాయి. మూసీ ఎఫ్టీఎల్, బఫర్​జోన్​పరిధిలో పలు చోట్ల తాత్కాలిక, శాశ్వత నిర్మాణాలు వెలిశాయి. అలాగే  బస్తీలు, కాలనీలు కూడా ఉన్నాయి. కొందరు షెడ్లు వేసుకుని వ్యాపారాలు నిర్వహించుకుంటుండగా, మరికొన్ని చోట్ల గోదాములను ఏర్పాటు చేశారు. రెవెన్యూ, హెచ్ఎండీఏ అధికారులు నిర్వహించిన సర్వేలో మూసీ పొడవునా నార్సింగి బ్రిడ్జి వరకూ 25 కిలోమీటర్ల పరిధిలో 12 వేలకు పై చిలుకు కబ్జాలు, నిర్మాణాలున్నట్టు అధికారులు గుర్తించారు. వీటిని తొలగించాలని ఇప్పటికే కొందరికి నోటీసులిచ్చారు. 

అర్హులైన వారికి ఇండ్లు లేదా పరిహారం 

మూసీలో ఉన్న కాలనీలు, బస్తీవాసులను తరలించి..అర్హులైన వారికి ఇందిరమ్మ ఇండ్లు లేకపోతే పరిహారం ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. మూసీ పరిధిలో చాలా వరకు 40, 60 గజాల స్థలాల్లో ఇండ్లు నిర్మించుకున్న వారే ఎక్కువగా ఉన్నారు. ఇప్పటికే ఆయా కుటుంబాల లిస్టును అధికారులు సిద్ధం చేశారు. హైదరాబాద్​పరిధిలో అంబర్​పేట, ఆసిఫ్​నగర్, బహదూర్​పురా, చార్మినార్, హిమాయత్​నగర్, నాంపల్లి, సైదాబాద్​మండల పరిధిలో భారీగా ఆక్రమణలున్నట్టు అధికారులు గుర్తించారు. రంగారెడ్డి జిల్లా పరిధిలో గండిపేట, రాజేంద్ర నగర్, సరూర్​నగర్, మేడ్చల్​జిల్లా పరిధిలోని రామంతాపూర్, ఉప్పల్​మండల పరిధిలో పెద్ద సంఖ్యలో కాలనీలు వెలిసినట్టు తేల్చారు. 

 హైడ్రాకు అప్పగింత  

మూసీ ఎఫ్టీఎల్, బఫర్​జోన్​ పరిధిలో వెలిసిన షెడ్లను, గోదాములను ముందుగా కూల్చివేయాలని నిర్ణయించిన ప్రభుత్వం ఆ బాధ్యతలను హైడ్రాకు అప్పగించనున్నట్టు తెలుస్తోంది. చెరువులు, కుంటల పరిధిలో అక్రమ నిర్మాణాల పని పడుతున్న హైడ్రాకు ప్రభుత్వం చట్టబద్దత కల్పించిన సంగతి తెలిసిందే. దీంతో మూసీలోనూ ఎవరి ఒత్తిళ్లకే లొంగకుండా కూల్చివేస్తుందని అధికారులంటున్నారు. ఇండ్లు, కాలనీల్లో ఉంటున్న వారికి ఇందిరమ్మ ఇండ్లు లేకపోతే నష్టపరిహారం ఇచ్చే అవకాశాలున్నాయని చెప్తున్నారు.