చెరువుల విస్తీర్ణంపై హైడ్రా ఫోకస్.. 136 చెరువుల బౌండరీలు ఫైనల్

చెరువుల విస్తీర్ణంపై హైడ్రా ఫోకస్.. 136 చెరువుల బౌండరీలు ఫైనల్
  • గతంలో, ఇప్పుడున్న స్థితిపై  స్టడీ
  •  హైడ్రా పరిధిలో 565 చెరువులు  
  • నేషనల్​ రిమోట్ ​సెన్సింగ్​ ఏజెన్సీ వద్ద వివరాల సేకరణ  
  •  అన్నింటి హద్దులు ఫైనల్ చేసే పనిలో పడిన కమిషనర్​

 హైదరాబాద్ సిటీ, వెలుగు: చెరువుల విస్తీర్ణంపై హైడ్రా ఫోకస్ పెట్టింది. గతంలో చెరువుల విస్తీర్ణం ఎంత ఉంది?  ప్రస్తుతం ఎంత ఉందన్న దానిపై నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్(ఎన్ఆర్ఎస్ఈ) సాయంతో వివరాలు సేకరిస్తోంది.  హైడ్రా పరిధిలో 565 చెరువులుండగా, ఇప్పటికే 136 చెరువుల ఎఫ్టీఎల్, బఫర్ జోన్ల బౌండరీలను ఫైనల్​చేసింది. మిగతా వాటి ఎఫ్టీఎల్, బఫర్ జోన్ల సరిహద్దులకు సంబంధించి లేక్ ప్రొటెక్షన్ కమిటీ ఇప్పటికే ప్రిలిమినరీ నోటిఫికేషన్ జారీ చేసింది.  కొన్ని చెరువులకి సంబంధించి కోర్టులో కేసులుండగా, ఇంకొన్ని చెరువులకి సంబంధించి బౌండరీలు ఫిక్స్ చేసేందుకు స్థానికుల నుంచి వ్యతిరేకత రావడంతో ఇప్పటివరకు ఫైనల్​కాలేదు. ఈ క్రమంలోనే ఎన్ఆర్ఎస్ఈ వద్ద పాత, కొత్త వివరాలుండడంతో వాటి ఆధారంగా మిగతా చెరువుల బౌండరీలు ఫైనల్ చేసేందుకు సిద్ధమవుతోంది. 

200 లోపు చెరువులకే ఫైనల్​ నోటిఫికేషన్​

చెరువుల రక్షణకు సంబంధించి 2010లో ప్రభుత్వం జీవో ద్వారా లేక్ ప్రొటెక్షన్ కమిటీ ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో 19 డిపార్టుమెంట్ల అధికారులున్నారు. హెచ్ఎండీఏ కమిషనర్​చైర్మన్ గా, సభ్యులుగా మెట్రోవాటర్​బోర్డు, పోలీస్, జీహెచ్​ఎంసీ, పీసీబీ, పంచాయతీరాజ్, ఇరిగేషన్, ఈపీటీఆర్ఐ, ఎన్ జీఆర్ఐ, హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్, నల్గొండ, మహబూబ్​నగర్ జిల్లాల కలెక్టర్లను నియమించారు. 

హెచ్ఎండీఏ పరిధిలో 3,532 చెరువులుండగా, 2012లో 2,641 చెరువులకు సంబంధించి లేక్ ప్రొటెక్షన్ కమిటీ ప్రిలిమినరీ నోటిఫికేషన్ ఇచ్చింది. అయినా 200లోపు చెరువులకు మాత్రమే ఫైనల్ నోటిఫికేషన్ జారీ చేసింది. 10 ఏండ్లు దాటినా ఈ కమిటీ చెరువుల బౌండరీలను ఫైనల్ చేయలేకపోయింది. ఇప్పుడు హైడ్రా రావడంతో తిరిగి ఈ కమిటీ యాక్టివ్ గా పనిచేసే అవకాశముంది. హైడ్రా కమిషనర్ రంగనాథ్ ముందుగా ఈ బౌండరీలు ఫైనల్ పైనే ఫోకస్ పెట్టారు. కమిటీ చైర్మెన్ సహా సభ్యులతో కూడా ఈ అంశంపై పలుమార్లు చర్చించారు.  

లేక్ ప్రొటెక్షన్ కమిటీ చైర్మెన్​గా హైడ్రా కమిషనర్? 

హెచ్‌‌‌‌‌‌‌‌ఎండీఏ పరిధిలోని చెరువుల పరిరక్షణకు లేక్ ప్రొటెక్షన్‌‌‌‌‌‌‌‌ కమిటీ చైర్మెన్ గా హెచ్ఎండీఏ కమిషనర్ చైర్మన్ గా ఉన్నారు. అయితే, ఈ  కమిటీకి చైర్మన్‌‌‌‌‌‌‌‌గా హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్‌‌‌‌‌‌‌‌ను నియమించనున్నట్లు తెలిసింది. చెరువుల పరిరక్షణకు అధిక ప్రాధాన్యం ఇస్తున్న ప్రభుత్వం ఈ బాధ్యతలను రంగనాథ్‌‌‌‌‌‌‌‌కు అప్పగించాలని చూస్తున్నట్లు తెలిసింది. లేక్ ప్రొటెక్షన్ కమిటీతో కలిసి ఎఫ్టీఎల్, బఫర్ జోన్లను ఫైనల్ చేసే విషయంపై హైడ్రా ముందుకెళుతుంది.