- ఫ్యాక్టరీల నుంచి వచ్చి కలుస్తున్న రసాయనాలు
- అపార్ట్ మెంట్లు, ఫాంహౌస్‌ల నుంచి మురుగు నేరుగా చెరువుల్లోకి..
- పీసీబీ అధికారుల నిర్లక్ష్యమే కారణమని గుర్తించిన హైడ్రా
- శాశ్వత నివారణ చర్యలపై సీఎంతో చర్చించే అవకాశం
హైదరాబాద్ సిటీ, వెలుగు: చెరువుల్లో నీటి కాలుష్యంపై హైడ్రా ఫోకస్ పెట్టింది. పరిశ్రమల నుంచి వచ్చి కలుస్తున్న ప్రమాదకరమైన కెమికల్స్, అపార్ట్ మెంట్లు, ఫాంహౌస్‌ల నుంచి వస్తున్న మురుగు చేరి చెరువులు విషతుల్యం అవుతున్నట్లు గుర్తించింది. నివారణ చర్యలపై ఫోకస్పెట్టింది. ఫ్యాక్టరీల నుంచి వచ్చే వ్యర్థాలు చెరువుల్లో కలవకుండా పీసీబీ యాక్షన్తీసుకోవాల్సి ఉన్నా పట్టించుకోకపోవడంతో ఈ పరిస్థితి తలెత్తిందని హైడ్రా గుర్తించింది.
హైడ్రా ఏర్పడినప్పటి నుంచి ఒక్కొక్క చెరువును పరిశీలిస్తూ వస్తోంది. అప్పటి నుంచి చాలా చెరువులు మురుగు కూపాలుగానే ఉన్నాయని తెలుసుకుంది. కొన్ని చెరువుల దగ్గర కనీసం కొన్ని సెకన్లు కూడా నిలబడలేని దుస్థితి ఉందని తేలింది. ఈ విషయమై ఇప్పటికే హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్పీసీబీ అధికారులతో చర్చించారు. త్వరలో ఇదే అంశంపై హైడ్రా ఆఫీసులో మరోసారి పీసీబీ ఆఫీసర్లతో సమావేశం నిర్వహించనున్నారు. తర్వాత విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లి శాశ్వత నివారణ చర్యల కోసం చర్చించనున్నారు.
జంట జలాశయాల్లోకి కూడా..
చాలాచోట్ల అపార్టుమెంట్లు, ఫాంహౌస్‌ల నుంచి వ్యర్థాలు నేరుగా చెరువులు, కుంటల్లోకి చేరుతున్నాయి. అపార్టుమెంట్లలో సీవరేజీ ట్రీట్ మెంట్ ప్లాంట్లు పెట్టుకోవాలనే రూల్స్ఉన్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. కొందరు ప్లాంట్లు పెడుతున్నా వాటిని రన్ చేస్తే రూ.లక్షల్లో కరెంట్ బిల్లులు వస్తున్నాయని వాడకుండా మురుగును అలాగే వదిలేస్తున్నారు. ఈ నీరు డ్రెయిన్ల ద్వారా చెరువులు, కుంటల్లోకి చేరుతోంది. హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ జంట జలాశయాల సమీపంలోని ఫాంహౌస్‌లు, కమర్షియల్ యాక్టివిటీస్ కొనసాగిస్తున్న కొందరు మురుగును నేరుగా చెరువుల్లోకి వదిలేస్తున్నారని హైడ్రా తెలుసుకుంది. కొందరైతే ఏకంగా జలాశయాల్లోకి డైరెక్ట్పైపులైన్లు వేసినట్టు గుర్తించింది. దీనిపై యాక్షన్ప్లాన్సిద్ధం చేసి చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్టు తెలిసింది.
100 చెరువులు కంపు
హైడ్రా పరిధిలో 549 చెరువులుండగా ఇందులో వంద వరకు చెరువులు మురుగు చేరి కంపు కొడుతున్నట్లు తెలిసింది. కొన్ని చెరువుల్లో రసాయనాలు, మరికొన్నింటిలో మురుగు చేరుతోంది. నగరం నడిబొడ్డున ఉన్న హుస్సేన్ సాగర్ లో నేటికీ కెమికల్ వ్యర్థాలు కలుస్తూనే ఉన్నాయి. ఫ్యాక్టరీలు ఎక్కువగా ఉండే బాలానగర్ నుంచి వచ్చే కాల్వలో ఎక్కువగా ఈ కెమికల్వ్యర్థాలు వస్తున్నాయి. అలాగే దుండిగల్‌లోని కుడికుంటలోకి స్థానికంగా ఉన్న పరిశ్రమల నుంచి కెమికల్ వ్యర్థాలు వచ్చి చేరుతున్నాయి. ఈ కెమికల్ప్రభావానికి కుంటలోని చేపలు కూడా బతకడం లేదు. ఇదే ప్రాంతంలోని చింతలకుంట-లోకి కాలనీల్లోంచి వస్తున్న మురుగు చేరుతుండటంతో కంపు కొడుతోంది. ఈ ప్రాంతం దగ్గర్లో క్షణాలపాటు కూడా నిలబడలేని పరిస్థితి ఉంది.
వ్యర్థాలు చేరకుండా చూడాలి
నగరంలోని చాలా చెరువులు కలుషితం అయ్యాయి. కొన్ని చెరువుల వద్ద నిలబడలేకపోతున్నం. చెరువులను కాలుష్యం నుంచి కాపాడాలి. పరిశ్రమల నుంచి వ్యర్థాలు కలవకుండా చూడాలి. ఆ బాధ్యత హైడ్రాపై ఉంది. ప్రభుత్వం దీనిపై దృష్టి పెట్టాలి. లేకపోతే భూగర్భ జలాలు కూడా కలుషితమవుతాయి. – డాక్టర్ లుబ్నా సర్వత్, సెంటర్ ఫర్ వెల్బీయింగ్ ఎకనామిక్స్ హైదరాబాద్ వ్యవస్థాపక డైరెక్టర్