ఆక్రమణలపై హైడ్రా ఫోకస్

ఆక్రమణలపై హైడ్రా ఫోకస్
  • చెరువులు, కుంటలు, ఎఫ్టీఎల్, బఫర్ జోన్లలో అక్రమ నిర్మాణాలు
  • డ్రోన్ కెమెరాలతో సర్వే
  • అమీన్ పూర్ పెద్ద చెరువు పరిధిలోనే 10 కాలనీలు, హెచ్ఎండీఏ లే ఔట్లు 
  • కూల్చివేతలకు సిద్ధమైన అధికారులు

సంగారెడ్డి, వెలుగు: జిల్లాలో ఆక్రమణకు గురైన చెరువులు, కుంటలు, బఫర్ జోన్ పరిధిలోని స్థలాలపై హైడ్రా (హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అసెట్స్ మానిటరింగ్ అథారిటీ) ఫోకస్ పెట్టింది. నగరానికి సమీపంలోని అమీన్ పూర్, పటాన్ చెరు మండలాల్లో చెరువుల చుట్టూ వెలసిన కాలనీలు, ఎఫ్డీఎల్ పరిధిలోకి వచ్చే ప్లాట్లు, ఆక్రమణలను గుర్తించే పనిలో నిమగ్నమైంది. ఈ నేపథ్యంలో అమీన్ పూర్ మండలం, మున్సిపాలిటీలోని ఒకటి రెండు చెరువులు, నాళాలు ఆక్రమణకు గురైనట్టు డ్రోన్ కెమెరాతో సర్వే చేసి గుర్తించింది.

 పైగా ఇటీవల రెండుసార్లు హైడ్రా కమిషనర్ రంగనాథ్ అమీన్ పూర్ లోని పలు చెరువులను సందర్శించి సమగ్ర నివేదికలు తయారుచేయాలని అధికారులను ఆదేశించారు. గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలతో గతంలో సర్వే నిర్వహించగా, అక్రమ నిర్మాణాల కూల్చివేతలపై న్యాయపరమైన చిక్కులు రాకుండా హైడ్రా అధ్యయనం చేస్తున్నట్టు సమాచారం. దీంతో కొంతమంది ఆక్రమణదారులు టెన్షన్​పడుతూ లీగల్ ఒపీనియన్స్ కోసం న్యాయనిపుణుల చుట్టూ తిరుగుతున్నట్లు తెలుస్తోంది.

అమీన్​పూర్​మండలంలో..

అమీన్ పూర్ మండలంలో పెద్ద చెరువు, కొత్త చెరువు, బంధం చెరువు, శంబుని కుంట, బొమ్మన కుంట, శెట్టికుంట, ఉబకుంట తోపాటు మరికొన్ని  ప్రాంతాల్లో నాలాలు డైవర్షన్ చేశారు. అలాగే పటాన్ చెరు మండలంలో తిమ్మక్క చెరువు, సాకి చెరువు కబ్జా కోరలో చిక్కుకున్నాయి. ఒక్క అమీన్ పూర్ లోనే 13 చెరువులు, 80కు పైగా కుంటల ఆక్రమణలు జరిగినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. 

ఇదిలా ఉంటే ఎఫ్టీఎల్​పరిధిలో లేఔట్ల ఏర్పాటుకు హెచ్ఎండీఏ పర్మిషన్లు ఇవ్వడం, ఆయా లేఔట్లలో మున్సిపల్ అధికారులు ఇండ్ల నిర్మాణాలకు అనుమతులు ఇచ్చినట్లు హైడ్రా గుర్తించడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. చెరువులు, కుంటలతో పాటు అమీన్​పూర్​, పటాన్ చెరు మండలాల్లో  విస్తరించి ఉన్న ప్రభుత్వ భూములపై కూడా హైడ్రా దృష్టి పెట్టింది. ఈ క్రమంలో 993, 630, 343 సర్వే నెంబర్లలో ప్రభుత్వ భూములను కాపాడేందుకు జిల్లా రెవెన్యూ యంత్రాంగం స్పెషల్ డ్రైవ్ కు రెడీ అవుతోంది.

పెద్ద చెరువు పరిధిలో..

అమీన్​పూర్​మున్సిపల్ పరిధిలోని పెద్ద చెరువు పరిధిలో పది కాలనీలు కొత్తగా వెలిశాయి. పదుల సంఖ్యలో హెచ్ఎండీఏ లేఔట్లు, దాదాపు 500 ఇండ్ల నిర్మాణాలు జరిగినట్టు గతంలో గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలతో చేపట్టిన సర్వేలో తేలాయి. వాటికి మున్సిపల్ అధికారులు నోటీసులు ఇచ్చారే తప్ప చర్యలు తీసుకోలేదనే విమర్శలు వినిపించాయి. తాజాగా హైడ్రా రాకతో ఆ ఇష్యూ కాస్త  మళ్లీ తెరపైకి వచ్చింది.

ALSO READ : స్లాబ్​ కింద చదువులు

 300 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ పెద్ద చెరువు ప్రస్తుతం 93 ఎకరాల విస్తీర్ణానికి తగ్గిపోయింది. ఈ చెరువు వద్దకు ప్రతీ ఏడాది విదేశీ పక్షులు వలస వస్తుండడంతో 2016లో కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ జీవ వైవిధ్య జలాశయంగా దీన్ని గుర్తించింది. ప్రస్తుతం ఈ చెరువు చుట్టూ పెద్దపెద్ద అపార్ట్​మెంట్లు, కాలనీలు విస్తరించి ఉండగా ఎఫ్డీఎల్ పరిధిలోను బిల్డింగులు వెలిశాయి. ఈ చెరువు తోపాటు ఇతరత్రా గొలుసు కట్టు చెరువులు, కుంటలు, నాళాల  వివరాలతో నివేదికలు సిద్ధం చేసే పనిలో అధికారులు బిజీగా ఉన్నారు.