హైడ్రా వద్ద 1,500 ఆక్రమణల చిట్టా.. కూల్చడానికి కొత్త మెషిన్లు అర్డర్ పెట్టిన అధికారులు

హైడ్రా వద్ద 1,500 ఆక్రమణల చిట్టా.. కూల్చడానికి కొత్త మెషిన్లు అర్డర్ పెట్టిన అధికారులు
  • గ్రేటర్ వ్యాప్తంగా కొనసాగుతున్న విచారణ
  • కూల్చివేతలకు మరిన్ని మెషీన్లు తెచ్చేందుకు రెడీ
  • ఇప్పటికే మూడు హైరిచ్ కాంబి కటింగ్ మెషీన్లు, 
  • 22 రాక్ బ్రేకర్లతో పనులువీటిని డబుల్​ చేసే ఆలోచన

హైదరాబాద్, వెలుగు:హైదరాబాద్​పరిధిలోని చెరువుల ఆక్రమణలపై కొరఢా ఝులిపిస్తున్న హైడ్రా.. మరో1500 అక్రమ కట్టడాలపై చిట్టా రెడీ చేసింది. ఇప్పటివరకు చెరువులు, నాలాలు, పార్కుల కబ్జాలపై దాదాపు 1500 ఆక్రమణలు ఉన్నట్టు  సమాచారం రాగా, వేగంగా విచారణ జరుపుతోంది.  ఎంక్వైరీ తర్వాత అవి ఆక్రమణలని తేలితే వెంటనే కూల్చివేయడానికి రెడీ అవుతోంది. కూల్చివేతలు నిదానంగా కొనసాగితే కొన్ని చోట్ల శాంతిభద్రతల సమస్యలు తలెత్తే అవకాశం ఉందని గుర్తించిన హైడ్రా అలా జరగకుండా ముందే ఏర్పాట్లు చేసుకుంది. ఇందులో భాగంగా అత్యాధునిక టెక్నాలజీతో స్పీడ్​గా భవనాలను కూలుస్తుందనే పేరున్న మాలిక్ ట్రేడింగ్ అండ్ డిమాలేషన్ కంపెనీకి బాధ్యతలు అప్పగించింది. 

గతేడాది జనవరిలో సికింద్రాబాద్ లోని డెక్కన్ మాల్ లో ఫైర్ యాక్సిడెంట్ జరగ్గా ఆ బిల్డింగ్ ను ఈ సంస్థనే యుద్ధప్రాతిపదికన కూల్చివేసింది. అప్పట్లోనే వీరు జపాన్, కొరియా, ఇటలీ దేశాల్లో తయారు చేసే రూ.3 కోట్ల విలువైన హైరిచ్ కాంబి కటింగ్​మెషీన్​వాడారు. ఈ యంత్రాలు కావాలంటే 4 నెలలు ముందే బుక్​ చేసుకోవాల్సి ఉంటుంది.  ఇప్పుడు హైడ్రా కూల్చివేతల్లో కూడా ఈ సంస్థ మూడు హైరిచ్ కాంబి కటింగ్​మెషీన్​(జాక్ కటర్,  షేర్ కటర్, రాక్ బ్రేకర్ )న్లతో పాటు 22 రాక్ బ్రేకర్స్ యంత్రాలను వాడుతోంది. వీటితో 15 నుంచి 20 ఫ్లోర్ల బిల్డింగ్స్ ని పక్కన ఎటువంటి డ్యామెజ్ జరగకుండా నేలమట్టం చేయవచ్చు. అంతకు మించి భవనాలుంటే కంట్రోల్ బ్లాస్టింగ్ ద్వారా కూల్చివేస్తారు.  

మరో 25 తెచ్చేందుకు రెడీ  

ప్రస్తుతం హైడ్రా 25 మెషీన్లను ఉపయోగిస్తోంది. వీటితో 20 నుంచి 30 వరకు బిల్డింగులను ఈజీగా కూల్చేయవచ్చు. అయితే, కూల్చివేతలు ఫాస్ట్ గా కొనసాగుతున్నప్పటికీ ఈ యంత్రాలను ఒకచోట నుంచి మరోచోటకు తరలించేందుకు గంటల సమయం పడుతోంది. డిమాలిష్​చేయడానికి ముందే ఎలా కూల్చాలో ఇంజినీర్లు డిజైన్ చేస్తారు. ఇప్పటి వరకు హైడ్రా కూల్చివేతలు వారంలో రెండు రోజులు మాత్రమే సాగాయి. హైడ్రా దగ్గర పెద్ద లిస్టే ఉన్న నేపథ్యంలో వచ్చే రోజుల్లో కూల్చివేతల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. దీంతో మరిన్ని మెషీన్లు తెచ్చుకోవాలని సదరు సంస్థకు హైడ్రా సూచించినట్టు సమాచారం. 
ప్రస్తుతమున్న 25కి అవసరమైతే మరో 25 కూడా తెచ్చేందుకు కాంట్రాక్ట్​ సంస్థ రెడీ 
అయినట్టు తెలిసింది. 

రెండు నెలల్లో 166 నిర్మాణాలు నేలమట్టం

హైడ్రా ఏర్పడి రెండు నెలలైంది. ఈ రెండు నెలల్లో 18 ప్రాంతాల్లో 166 ఆక్రమణలను నేలమట్టం చేసింది. ఈ ఆక్రమణల వెనుక ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలలతో పాటు  ప్రధాన  పార్టీలకు చెందిన నేతలు కూడా ఉన్నారు. కొందరు బడాబాబులకు చెందిన ఆక్రమణలు కూడా కూల్చడంతో జనాలకు నమ్మకం పెరిగి ఫిర్యాదు చేసేందుకు ముందుకు వస్తున్నారు. 

ఇదే తరహాలో విచారణ జరిపి యాక్షన్ తీసుకునేందుకు హైడ్రా బాస్​ప్లాన్ చేస్తున్నారు. హైడ్రాకి సిబ్బంది తక్కువగా ఉండడంతో కావాల్సిన వారిని త్వరలో ప్రభుత్వం నియమించబోతున్నట్టు తెలిసింది. అలాగే ప్రత్యేకంగా ఓ పోలీస్​స్టేషన్ కూడా ఏర్పాటు చేయనుంది. ఆక్రమణల కూల్చివేతే లక్ష్యమని, ఎవ్వరినీ పట్టించుకోవద్దని ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు ఉండడంతో హైడ్రా ఎక్కడా చర్యలకు వెనుకడుగు వేయడం లేదు. ఈ క్రమంలో రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందా అని జనాలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.