అమీన్​పూర్​లో మరోసారి హైడ్రా యాక్షన్

అమీన్​పూర్​లో మరోసారి హైడ్రా యాక్షన్
  • పెద్ద చెరువు ఆక్రమించి వేసిన ఫెన్సింగ్ తొలగింపు

రామచంద్రాపురం (అమీన్​పూర్), వెలుగు: సంగారెడ్డి జిల్లా అమీన్​పూర్​లో హైడ్రా మళ్లీ యాక్షన్ మొదలుపెట్టింది. మున్సిపాలిటీ లిమిట్స్​లోని చక్రపురి కాలనీ సమీపంలో పెద్ద చెరువు ఆక్రమణలను మరోసారి కూల్చివేసింది. మంగళవారం ఉదయం నుంచే ఈ కూల్చివేతలు చేపట్టింది. గతంలో మూడు నెలల క్రితం ప్రభుత్వ స్థలాలను ఆక్రమించారని ఇక్కడే కూల్చివేతలు జరగగా, తిరిగి ఫెన్సింగ్ నిర్మాణం చేపట్టడంతో హైడ్రా అధికారులు నేలమట్టం చేశారు. ఆంధ్రాకు చెందిన మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి తమ లేఅవుట్​కు సంబంధించిన స్థలాలను ఆక్రమించి ఫెన్సింగ్ వేస్తున్నారని స్థానికులు కొంతమంది సోమవారం హైడ్రా ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. 

దీనిపై విచారణ చేపట్టిన కమిషనర్​రంగనాథ్ కూల్చివేతలకు ఆర్డర్​ఇవ్వడంతో మంగళవారం అక్కడి నిర్మాణాలను తొలగించారు. ఐలాపూర్​తండాకు చెందిన వివాదాస్పద భూములను కూడా మంగళవారం హైడ్రా అధికారులు పరిశీలించారు. అమీన్​పూర్​పరిధిలోని ప్రజల నుంచి వందలాది కంప్లైట్స్ వస్తున్నాయని, అన్ని ఫిర్యాదులపై విచారణ చేపట్టి త్వరలోనే చర్యలు తీసుకుంటామన్నారు.

కుత్బుల్లాపూర్ లో అక్రమ నిర్మాణాలు నేలమట్టం

జీడిమెట్ల: కుత్బుల్లాపూర్ లో ప్రభుత్వ భూమిని కబ్జా చేసి కట్టిన అక్రమ నిర్మాణాలను​రెవెన్యూ అధికారులు మంగళవారం కూల్చివేశారు. కుత్బుల్లాపూర్​మండలం గాజులరామారం సర్వేనెంబర్​ 329లో ప్రభుత్వం ఉంది. స్థానికంగా ఉండే భూకబ్జాదారులు కొందరు ప్రజాప్రతినిధుల అండదండలతో కోట్లాది రూపాయల విలువచేసే ఈ భూమిని ఆక్రమించారు. ఆ భూమిని నిరుపేదలకు విక్రయించి కోట్లకు పడగెత్తారు. దీనిపై ఫిర్యాదులు అందడంతో గతేడాది జులైలో హైడ్రా అధికారులు 40కి  పైగా అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు. 

తాజాగా కొందరు భూకబ్జాదారులు తిరిగి సర్వే నంబర్​ 329 ప్రభుత్వ భూమిలో చింతల చెరువును ఆనుకుని నిర్మాణాలు చేశారు. ఈ విషయమై కుత్బుల్లాపూర్​మండల రెవెన్యూ అధికారులకు ఫిర్యాదులు అందాయి. దీంతో రెవెన్యూ అధికారులు సూరారం పోలీసుల బందోబస్తు తీసుకుని 8 అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు. ప్రభుత్వ భూముల్లో అక్రమణలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.