
హైదరాబాద్ అంబర్ పేటలోని బతుకమ్మ కుంట పునరుద్ధరణన పనులను హైడ్రా మొదలు పెట్టింది. పునరుద్ధర లో భాగంగా ఫిబ్రవరి 18న బతుకమ్మ కుంటలో హైడ్రా పూడిక తీత పనులు చేపట్టింది. ఇందులో భాగంగా కుంటలో జేసీబీతో కొంత మేర మట్టి తీయగానే నీళ్లు బయటకు వచ్చాయి. గతంలో ఇక్కడ చెరువు ఉండటం వల్లనే నీళ్ళు బయటపడ్డాయని హైడ్రా అధికారులు చెబుతున్నారు.
అంబర్ పేట మండలం బాగ్ అంబర్ పేట్ లోని సర్వే నంబరు 563 లో 1962- -63 లెక్కల ప్రకారం 14.06 ఎకరాల విస్తీర్ణంలో బతుకమ్మ కుంట ఉంది. బఫర్ జోన్ తో కలిపి మొత్తం16.13 ఎకరాలు. అయితే తాజా సర్వే ప్రకారం అక్కడ 5.15 ఎకరాలు మాత్రమే మిగిలింది. దీన్ని హైడ్రా పనరుద్దరించేందుకు చర్యలు చేపట్టింది. ఇక్కడ ఉంటున్న వారికి సమస్య లేకుండా చెరువును పునరుద్ధరించనున్నారు అధికారులు. బ్యూటిఫికేషన్చేపట్టనున్నారు. ఒకప్పటి ఎర్రకుంటనే కాలక్రమంలో బతుకమ్మ కుంటగా మారిందని స్థానికులు చెబుతున్నారు. రెవెన్యూ రికార్డులు కూడా ఇదే విషయాన్ని చెబుతున్నాయి. కాలక్రమంలో బతుకమ్మకుంటలో చెత్త, నిర్మాణ వ్యర్థాలు పోయడంతో చెరువు ఆనవాళ్లు లేకుండా పోయిందంటున్నారు.
అంబర్పేట పరిధిలోని బతుకమ్మ కుంట స్థలం తమదేనంటూ ఎడ్ల సుధాకర్ రెడ్డి అనే వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్‌ను 2025 జనవరి 8న హైకోర్టు కొట్టేసింది. హైడ్రాకు అనుకూలంగా తీర్పునిచ్చింది. దీంతో హైడ్రా పునరుద్ధరణ చర్యలు చేపట్టింది.