- ప్రభుత్వానికి నివేదిక సమర్పించిన హైడ్రా
- 23 ప్రాంతాల్లో 111 ఎకరాల ప్రభుత్వ భూమిని కాపాడినం
- ఎమ్మెల్యేలు, పలు పార్టీల నేతల నిర్మాణాలను నేలమట్టం చేసినట్టు వెల్లడి
హైదరాబాద్, వెలుగు: హైడ్రా కూల్చివేతలు కొనసాగుతున్నాయి. చెరువుల ఎఫ్టీఎల్, బఫర్ జోన్లలోనే కాకుండా ప్రభుత్వ భూమిని ఆక్రమించి కట్టిన పార్కులు, నాలాలు, రోడ్లు, ఫుట్ పాత్లను కూడా హైడ్రా కూల్చేస్తున్నది. జూన్ 27 నుంచి ఈ నెల 8 దాకా మొత్తం 23 ప్రాంతాల్లో 262 అక్రమ నిర్మాణాలను తొలగించింది. 111.72 ఎకరాల ప్రభుత్వ భూమిని కాపాడినట్లు హైడ్రా అధికారులు బుధవారం ప్రభుత్వానికి రిపోర్టు అందజేశారు.
ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ఆయా పార్టీల నేతలతో పాటు సెలబ్రెటీలకు చెందిన అక్రమ నిర్మాణాలను హైడ్రా కూల్చేసింది. జూన్ 27న లోటస్ పాండ్, ఫిలింనగర్‌లోని కో ఆపరేటివ్ సొసైటీలో పార్క్ స్థలాన్ని కబ్జా చేసి నిర్మించిన కాంపౌండ్ వాల్ ను తొలగించారు. జులై 1న మన్సురాబాద్ లో రోడ్డును ఆక్రమించి జరిపిన నిర్మాణాలను కూల్చేశారు. జులై 4న జూబ్లీహిల్స్ లోని ఎంపీ, ఎమ్మెల్యే కాలనీలో పార్క్ స్థలంలో నిర్మించిన మూడు నిర్మాణాలను నేలమట్టం చేశారు.
జులై 5న బంజారాహిల్స్ రోడ్డు నంబర్ 12లోని మిథిల నగర్ లో పార్కు స్థలాన్ని హైడ్రా అధికారులు కాపాడారు. జులై 14న ఫిలింనగర్‌లోని బీజేఆర్ నగర్ లో నాలాపై నిర్మించిన ఆక్రమణలను తొలగించారు. జులై 21న గాజులరామారంలోని మహదేవ్ పురంలో పార్క్ జాగాను ఆక్రమించి కట్టిన నిర్మాణాలను నేలమట్టం చేశారు.
జులై 27న జూబ్లీహిల్స్ రోడ్డు నంబర్లో 10లోని బేబిలాన్ రెస్టారెంట్ ఫుట్ పాత్ ని ఆక్రమించి నిర్మించిన కట్టడాలను కూల్చేశారు. ఆగస్టు 3న అమీర్ పేట్ లో నాలాని ఆక్రమించి జరిపిన మూడు నిర్మాణాలను నేలమట్టం చేశారు. బోడుప్పల్‌లోని సర్వే నంబర్ 3లో ప్రభుత్వ భూమిలో జరుగుతున్న కట్టడాలను ఆగస్టు 14న కూల్చేశారు.
ఆగస్టు 24న ఎన్ కన్వెన్షన్ కూల్చివేత
ఖానాపూర్, చిల్కూర్ లోని గండిపేట్ చెరువులో 24 ఆక్రమణలను ఆగస్టు 18న నేలమట్టం చేశారు. ఆగస్టు 24న ఎన్ కన్వెన్షన్ కి సంబంధించి భారీ షెడ్లను కూల్చేశారు. ఈ నెల 8న అమీన్ పూర్ లేక్ ఆక్రమించి కట్టిన 20 కాంపౌండ్ వాల్స్, 4 షెడ్లను నేలమట్టం చేశారు. కత్వ చెరువు ఎఫ్ టీఎల్, బఫర్ జోన్లలో నిర్మించిన 13 విల్లాలను కూల్చేశారు.
రాజేంద్రనగర్ లోని భుమ్రుక్ దౌలా 12 ఎకరాల లేక్ స్థలంలో 45 నిర్మాణాలను హైడ్రా అధికారులు నేలమట్టం చేశారు. వీటిలో జీ ప్లస్ ఐదు అంతస్తుల భవనాలు 2, జీ ప్లస్ రెండు ఫ్లోర్ల భవనం ఒకటి, గ్రౌండ్ ఫ్లోర్ తో ఉన్న మరో భవనం ఉంది. ఐదు ఫ్లోర్ల బిల్డింగ్ బహదూర్ పురా ఎమ్మెల్యే మహ్మద్ ముబీన్ది అని, మరొకటి ఎమ్మెల్సీ మిర్జా రెహ్మత్ బేగ్‌కు చెందినదని అని హైడ్రా తెలిపింది.
విల్లాలు, అపార్ట్మెంట్లు నేలమట్టం
జూబ్లీహిల్స్ నందగిరిహిల్స్ లో పార్క్ స్థలాన్ని ఆక్రమించి కట్టిన 16 టెంపరరీ నిర్మాణాలను కూల్చేశారు. చిల్కూర్ పరిధిలో గ్రౌండ్ ప్లస్ 2 ఫ్లోర్ల భవనాలు 2, గ్రౌండ్ ప్లస్ 1 ఫ్లోర్ భవనం 1, గ్రౌండ్ ఫ్లోర్ 3, షెడ్స్, కాంపౌండ్ వాల్స్‌ను హైడ్రా నేల మట్టం చేసింది. వీటిలో కాంగ్రెస్, బీజేపీ నేతలకు సంబంధించిన నిర్మాణాలు ఉన్నాయి. ఎన్ కన్వెన్షన్ సెంటర్లోని భారీ షెడ్లు కూల్చి 4.9 ఎకరాల ప్రభుత్వ భూమిని కాపాడినట్లు హైడ్రా తెలిపింది.
గాజులరామారంలోని చింతల చెరువు సర్వే నంబర్ 329లో 3.5 ఎకరాలను సేవ్ చేసింది. ఈ నెల 8న దుండి గల్ మున్సిపాలిటీ పరిధి మల్లంపేటలోని కత్వ చెరువులో 13 విల్లాలను కూల్చేసినట్లు హైడ్రా అధికారులు రిపోర్టులో పేర్కొన్నారు. దీంతో 2.50 ఎకరాల ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకున్నామని తెలిపారు.