హైదరాబాద్ సిటీ, వెలుగు: జంట జలాశయాల్లో ఒకటైన హిమాయత్ సాగర్‌పై హైడ్రా ఫోకస్ పెట్టింది. ఎఫ్డీఎల్, బఫర్ జోన్ పరిధిని గుర్తించే చర్యలను ముమ్మరం చేసింది. నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ, సర్వే ఆఫ్ ఇండియా రికార్డుల ఆధారంగా సర్వే చేపట్టాలని హైడ్రా అధికారులు నిర్ణయించారు. త్వరలో 2010 నుంచి 2024 వరకు హిమాయత్ సాగర్ పరిస్థితిపై అధ్యయనం చేయనున్నారు. ఆ తరువాత బౌండరీలు ఫిక్స్ చేయనున్నారు.
హిమాయత్ సాగర్ సర్వే పూర్తయిన వెంటనే ఉస్మాన్ సాగర్ పై దృష్టి పెట్టేలా కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు. హైడ్రా పరిధిలో 549 చెరువులు ఉండగా, ఇందులో 138 చెరువులకు సంబంధించి ఫైనల్ నోటిఫికేషన్ జారీ చేయగా, 411 చెరువులకు సంబంధించి ప్రిలిమినరీ నోటిఫికేషన్ జారీ చేశారు. కొద్ది నెలల్లోనే ఎవరికీ ఇబ్బందులు లేకుండా ఎఫ్టీఎల్, బఫర్ జోన్లను ఫిక్స్ చేసి బౌండరీలు వేయనున్నారు. ప్రతి చెరువుకు జియో ట్యాగింగ్ చేసేలా హైడ్రా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.