- ఇవాళ్టి నుంచి 27 వరకు బిడ్స్ దాఖలుకు చాన్స్
- 23 చోట్ల 262 అక్రమ నిర్మాణాల నేలమట్టం పూర్తి
- అక్రమంగా నిర్మించుకున్నవారే ఖర్చు భరిస్తారా?
- హాట్ టాపిక్ గా మారిన వ్యర్థాల తొలగింపు ప్రక్రియ
హైదరాబాద్: హైదరాబాద్ నగరంలో చెరువులు, నీటి వనరులను సంరక్షించడమే ధ్యేయంగా ఏర్పాటైన హైడ్రా మరో ముందడుగు వేసింది. వ్యర్థాల తొలగింపుపై ఫోకస్ పెట్టింది. జూలై 19న ఏర్పాటైన హైడ్రా.. ఇప్పటి వరకు 23 ప్రాంతాలపై ప్రధానంగా దృష్టి సారించింది. ఇక్కడి చెరువులు, కుంటల్లో అక్రమంగా నిర్మించిన 262 కట్టడాలను నేలమట్టం చేసింది. కూల్చిన వ్యర్థాలను తరలించేందుకు కాంట్రాక్టు సంస్థల నుంచి టెండర్లను ఆహ్వానిస్తోంది. ఆఫ్ లైన్ లో ఇవాళ్టి నుంచి టెండర్ల ప్రక్రియ మొదలైంది. బిడ్ల దాఖలుకు ఈ నెల 27వ తేదీ వరకు అవకాశం ఇచ్చింది. తక్కువకు కోట్ చేసిన వారికి తరలింపు బాధ్యతను అప్పగించే అవకాశం ఉంది.
ఖర్చెవరు భరించాలి?
చెరువులు,కుంటల ఎఫ్టీఎల్, బఫర్ జోన్ల పరిధిలో చాలా మంది ఆక్రమించి భారీ భవంతులను నిర్మించుకున్నారు. వాటిని కొత్తగా ఏర్పాటైన హైడ్రా తొలగించింది. భారీ సంఖ్యలో బుల్డోజర్లు, జేసీబీలతో కూల్చివేసింది. జేసీబీలు, బుల్డోజర్ల ఖర్చును ప్రభుత్వం ఇప్పటి వరకు భరించింది. అయితే వ్యర్థాల తొలగింపు ప్రక్రియకు కూడా ప్రభుత్వం డబ్బులు ఇవ్వాల్సి ఉంటుంది. తప్పు చేసిన వారితోనే డబ్బులు కట్టించాలనే డిమాండ్ బలంగా వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఆ ఖర్చులను ప్రస్తుతానికి ప్రభుత్వం భరించి తర్వాత ఆక్రమణలకు పాల్పడ్డ వారి నుంచి వసూలు చేస్తుందా..? అన్నది హాట్ టాపిక్ గా మారింది.