మూసీ పొడవునా ఆక్రమణల తొలగింపు బాధ్యత హైడ్రాకు!

మూసీ పొడవునా ఆక్రమణల తొలగింపు బాధ్యత హైడ్రాకు!
  • పరిశీలిస్తున్న ప్రభుత్వం నోటీసుల జారీకి రెవెన్యూ సన్నాహాలు
  • మూసీ సుందరీకరణ ప్రాజెక్టుపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి
  • నిర్వాసితులకు డబుల్​బెడ్​రూమ్​ ఇండ్లు, టీడీఆర్ అమలుకు నిర్ణయం!

హైదరాబాద్ సిటీ, వెలుగు : మూసీ సుందరీకరణ ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న నేపథ్యంలో ఆ నది వెంట వెలసిన ఆక్రమణల తొలగింపుపై ప్రభుత్వం దృష్టిపెట్టింది. వీటిని రెవెన్యూ, జీహెచ్ఎంసీ,హెచ్ఎండీఏ అధికారులు కలిసి తొలగించాలా? లేక మరో ఏజెన్సీకి అప్పగించాలా? అన్న విషయం పై ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్టు అధికారులు తెలిపారు. తాజాగా, ఇప్పుడు అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తూ కబ్జాదారులను గడగడలాడిస్తున్న హైడ్రాకు మూసీ ఆక్రమణలు తొలగించే బాధ్యతలు అప్పగిస్తే ఎలా ఉంటుందన్న విషయం పై 

కూడా సమాలోచన చేస్తున్నట్టు సమాచారం.అయితే, మూసీలో కబ్జాలను తొలగించడం అంత సులభం కాదని, వారిని ఒప్పించి ఖాళీ చేయించాలంటే కూడా అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుందని అధికారులు అభిప్రాయపడుతున్నారు. మూసీలో నిర్మాణాలను, బస్తీలను ఖాళీ చేయడంద్వారా నష్టపోయినవారి కోసం ప్రభుత్వం ప్రత్యామ్నాయ చర్యలు తీసుకుంటుందని అధికారులు తెలిపారు. 

భారీ సంఖ్యలో ఆక్రమణలు

మూసీ సుందరీకరణ ప్రాజెక్టు కోసం అధికారులు ఇప్పటికే  రెవెన్యూ, డ్రోన్​, హైడ్రాలజీ సర్వేలు నిర్వహించారు. రెవెన్యూ సర్వేలో నది పరీవాహక ప్రాంతం, స్థితిగతులపై వివరాలు సేకరించారు. మూసీలో  మొత్తం 12 వేల అక్రమ నిర్మాణాలున్నాయని రెవెన్యూ అధికారులు తేల్చారు. ఇందులో లంగర్​హౌస్​​ నుంచి నాగోల్​ వరకు 5,501 నిర్మాణాలను గుర్తించారు. 

మరి కొన్నింటి పై సర్వేలు జరుగుతున్నాయని తెలిపారు. ఆయా ప్రాంతాల్లో నిర్మాణాలు చేసుకున్న వారిని ఖాళీ చేయాల్సిందిగా అధికారులు ఇప్పటికే కొందరికి నోటీసులు ఇచ్చారు. ఇందులో అర్హులైన వారికి పునరావాసం కల్పించేందుకు రూ. 2,500 కోట్లు అవసరమవుతాయని అధికారులు అంచనా వేశారు. హైడ్రాలజీ సర్వే ద్వారా మూసీ నదిలో ఉండే ప్రవాహ వేగాన్ని, సరిహద్దులను గుర్తించారు. ఎక్కడెక్కడ బ్రిడ్జిలు అవసరమవుతాయో అంచనాకు వచ్చారు.  అయితే, ప్రస్తుతం ఉన్న పురాతన బ్రిడ్జిలతోపాటు మరో 15 ప్రాంతాల్లో కొత్త బ్రిడ్జిల నిర్మాణం చేపట్టాలని కూడా అధికారులు నిర్ణయించారు.

ALSO READ : టీటీడీ తరహాలోయాదగిరిగుట్ట టెంపుల్ బోర్డు

 హెరిటేజ్​యాక్టివిస్టులతో మీటింగ్​ ఏర్పాటు చేసి, చారిత్రక కట్టడాల పరిరక్షణ, టూరిస్టుల రాకపోకలపై అభిప్రాయ సేకరణ జరిపారు. అక్రమ నిర్మాణాలను కూల్చేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. ఈ పనులు హైడ్రా ద్వారా నిర్వహిస్తేనే బాగుంటుందన్న వాదన వినిపిస్తున్నది. రెవెన్యూగానీ, జీహెచ్ంసీగానీ, హెచ్ఎండీఏగానీ.. ఎవరు ఈ పనులు  చేపట్టినా పెద్ద ఎత్తున రాజకీయంగా, మతపరంగా ఒత్తిళ్లు వచ్చే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.

నిర్వాసితులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు

మూసీ నది పొడవునా నార్సింగి నుంచి గౌరెల్లి వరకూ  58 కిలోమీటర్ల పరిధిలో వేల సంఖ్యలో ఉన్న అక్రమ నిర్మాణాలను తొలగిస్తే అందులో అర్హులైన వారికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసేందుకు హెచ్ఎండీఏ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ముఖ్యంగా కోట్ల రూపాయల్లో వ్యయం చేయాల్సి వస్తుందని గుర్తించిన అధికారులు.. నష్టాన్ని బట్టి అర్హులైన వారికి డబుల్​ బెడ్​రూం​ ఇండ్లను నిర్మించి, ఇవ్వాలని కూడా ఆలోచిస్తున్నారు. అలాగే ఆస్తులను కోల్పోయిన మరికొందరికి టీడీఆర్​ (ట్రాన్స్​ఫరబుల్​ డెవలప్​మెంట్​ రైట్స్) స్కీమ్​ అమలు చేయాలని కూడా భావిస్తున్నారు. 

వారు ప్రభుత్వానికి ఇచ్చిన స్థలానికి సంబంధించి నాలుగింతలు ఎత్తయిన భవనాలను నిర్మించుకునేందుకు అనుమతి ఇస్తారు. ఇలా ఇచ్చిన అనుమతులను వారు వినియోగించుకోవడం గానీ, ఇతరులకు అమ్ముకునే హక్కునుగానీ కల్పిస్తారు. ఈ ట్రాన్స్​ఫరబుల్​రైట్స్​ను కూడా ఎక్కడయినా వినియోగించుకునే అవకాశం కల్పిస్తారు. మూసీ ప్రాజెక్టు ముందుకు సాగాలంటే ముందు ఆక్రమణలను తొలగించే పనులు కీలకమని అధికారులు భావిస్తున్నారు. ఈ పనులు పూర్తయితే మిగిలిన ప్రాజెక్టు పనులు వేగవంతమయ్యే అవకాశం ఉందని తెలిపారు.