ముషీరాబాద్, వెలుగు: హైడ్రా చర్యలను తప్పుపట్టడం కరెక్ట్కాదని ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ డెవలప్మెంట్ కౌన్సిల్ పేర్కొంది. కొంతమంది నేతలు చెరువుల ఆక్రమణదారులకు వత్తాసు పలికేలా హైడ్రా చర్యలను తప్పుపట్టడం సమర్ధనీ కాదని అభిప్రాయపడింయంది. ఈ మేరకు ఆదివారం కౌన్సిల్ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎస్సీహెచ్ రంగయ్య, జాతీయ సలహాదారు కోమటిరెడ్డి గోపాల్ రెడ్డి, గౌరవ కన్వీనర్ ముదిగొండ త్యాగరాజు ఓ ప్రకటన విడుదల చేశారు. అవసరమైతే హైడ్రాకు మరింత చట్టబద్ధ హక్కులు దక్కేలా కృషి చేయాలని రాజకీయ పార్టీల నేతలకు విజ్ఞప్తి చేశారు. దశాబ్దాలుగా వేల చెరువులు ఆక్రమణ జరిగి మహానగరంలో చినుకు పడితే వరద బీభత్సాలు జరుగుతున్న వైనాన్ని నాయకులు మర్చిపోవడం హాస్యాస్పదమన్నారు.
వరద భయాన్ని నిలువరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన హైడ్రాను నిందించడం వారి పర్యావరణ అవగాహన లోపానికి నిదర్శనమని కౌన్సిల్ దుయ్యబట్టింది. ఆలస్యంగా నైనా దశాబ్దాల సమస్యకు అసలు కారణం చెరువుల ఆక్రమణ అన్న వాస్తవాన్ని రేవంత్ రెడ్డి సర్కార్ గుర్తించిందన్నారు. హైడ్రాపై కొన్ని పార్టీలు స్వలాభం కోసం నిందలు వేయడం తగదన్నారు. హైడ్రాకు మరిన్ని అధికారాలతో స్వయంప్రతిపత్తి కల్పించాలని కౌన్సిల్ ప్రత్యేకంగా విజ్ఞప్తి చేసింది.