సీఎం అన్నకు నోటీసులు

సీఎం అన్నకు నోటీసులు
  • హైదరాబాద్ మాదాపూర్​లోని అమర్ సొసైటీలో తిరుపతి రెడ్డికి ఇల్లు
  • అది దుర్గం చెరువు ఎఫ్​టీఎల్ పరిధిలో ఉందని తేల్చిన అధికారులు
  • నెల రోజుల్లోగా స్వచ్ఛందంగా కూల్చివేయాలని రంగారెడ్డి కలెక్టర్ నోటీసులు
  • లేదంటే తామే కూల్చివేస్తామని హెచ్చరిక
  • దుర్గం చెరువు ఎఫ్​టీఎల్, బఫర్ జోన్ పరిధిలో అక్రమ నిర్మాణాలు చేపట్టిన మొత్తం 204 మందికి నోటీసులు
  • లిస్టులో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డితో పాటు సినీ, వ్యాపార ప్రముఖులు, ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్లు

మాదాపూర్, వెలుగు: చెరువుల భూముల్లో అక్రమ నిర్మాణాలు చేపట్టినోళ్లపై అధికారులు కొరడా ఝులిపిస్తున్నారు. ఇందులో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి సొంత అన్న తిరుపతి రెడ్డికి సైతం నోటీసులు అందజేశారు. హైదరాబాద్ మాదాపూర్ లోని అమర్ సొసైటీలో 600 గజాల్లో తిరుపతి రెడ్డికి ఇల్లు,  ఆఫీస్ ఉంది. అయితే తిరుపతి రెడ్డి ఇల్లు దుర్గం చెరువు ఎఫ్​టీఎల్​ పరిధిలో ఉందని అధికారులు ఆయనకు నోటీసులు అందజేశారు.

Also Read:-పట్టా ల్యాండా..భూదాన్​ భూమా?

రంగారెడ్డి కలెక్టర్ పేరుతో ఉన్న ఆ నోటీసులను శేరిలింగంపల్లి రెవెన్యూ అధికారులు తిరుపతి రెడ్డికి అందజేశారు. వాల్టా చట్టంలోని సెక్షన్​23(1) ప్రకారం నోటీసులు జారీ చేస్తున్నట్టు పేర్కొన్నారు. 30 రోజుల్లోగా అక్రమ నిర్మాణాలను తొలగించాలని ఆదేశించారు. లేదంటే తామే కూల్చివేస్తామని హెచ్చరించారు. 

అమర్ సొసైటీతో పాటు ఇక్కడున్న కావూరి హిల్స్, డాక్టర్స్​ కాలనీ, నెక్టార్​ గార్డెన్ ప్రాంతాలు దుర్గం చెరువు ఎఫ్​టీఎల్, బఫర్​జోన్​పరిధిలోకి వస్తాయి. ఇక్కడ గత కొన్నేండ్లుగా యథేచ్ఛగా నిర్మాణాలు జరుగుతున్నాయి. ఇప్పుడా అక్రమ నిర్మాణాలను గుర్తించిన అధికారులు..
మొత్తం 204 మందికి నోటీసులు అందజేశారు. 30 రోజుల్లోగా స్వచ్ఛందంగా కూల్చివేతలు చేపట్టాలని నోటీసుల్లో పేర్కొన్నారు. లేదంటే తామే కూల్చివేస్తామని హెచ్చరించారు.

ఇలా నోటీసులు అందుకున్న వాళ్లలో బీఆర్ఎస్​ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్​రెడ్డి ఉన్నారు. ఆయనకు అమర్ సొసైటీలో క్యాంప్ ఆఫీస్ ఉంది. అలాగే మరికొంతమంది సినీ, వ్యాపార ప్రముఖులతో పాటు ఐఏఎస్, ఐపీఎస్​లు ఉన్నారు. కాగా అధికారులు జారీ చేసిన నోటీసుల్లో ఈ నెల మూడో తేదీ ఉన్నది.