హైదరాబాద్ లో చెరువుల ఆక్రమణలను అరికట్టడమే లక్ష్యంగా రంగంలోకి దిగిన హైడ్రా ఇప్పుడు హిమాయత్ సాగర్ పై ఫోకస్ పెట్టింది. హిమాయత్ సాగర్ ఎఫ్డిఎల్, బఫర్ జోన్ గుర్తించేందుకు చర్యలు ముమ్మరం చేసింది. ఈ మేరకు నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ, సర్వే ఆఫ్ ఇండియా రికార్డుల ఆధారంగా సర్వే చేయాలని నిర్ణయించింది హైడ్రా. 2010 నుంచి 2024 వరకు హిమాయత్ సాగర్ పరిస్థితిపై అధ్యయనం చేసేందుకు సన్నాహాలు చేస్తోంది.
హిమాయత్ సాగర్ సర్వే పూర్తి అయిన వెంటనే ఉస్మాన్ సాగర్ పై దృష్టి పెట్టేలా కార్యాచరణ సిద్ధం చేస్తోంది హైడ్రా. రెండో విడతగా ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలోని 549 చెరువులకు సర్వే చేపట్టనున్న హైడ్రా... ఎఫ్డిఎల్, బఫర్ జోన్ గుర్తించేందుకు 411 చెరువులకు ప్రిలిమినరీ నోటిఫికేషన్ జారీ చేసింది. ప్రతి చెరువుకు జియో ట్యాగింగ్ చేసేలా ప్రణాళిక సిద్ధమవుతోందని సమాచారం.