
హైడ్రా యాక్షన్ ప్లాన్ పక్కాగా ఉండేలా చూసుకుంటున్నారు అధికారులు. గ్రేటర్ పరిధిలో కబ్జాలకు గురైన ప్రభుత్వ భూములు, చెరువులను రక్షించేందుకు ఏర్పాటైన హైడ్రా.. ఇప్పటికే ఎన్నో అక్రమ కట్టడాలను కూల్చివేసి చెరువులు, ప్రభుత్వ స్థలాలను కబ్జా కోరల నుంచి కాపాడింది. తాజాగా గ్రేటర్ లోని అత్యంత విలువలైన చెరువుల చుట్టూ ఉన్న కబ్జాలను పరిశీలించారు కమిషనర్ రంగనాథ్.
గురువారం (మార్చి 27) స్థానికుల నుంచి వచ్చిన ఫిర్యాదుల మేరకు ముందుగా శంషాబాద్ తొండుపల్లి చెరువును సందర్శించారు కమిషనర్. ఎయిర్ పోర్టుకు సమీపంలోని అత్యంత విలువైన చెరువు కబ్జాలను స్వయంగా పరిశీలించారు. తొండుపల్లి చెరువు పక్కన ప్రభుత్వ స్థలం కబ్జా చేసి వెంచర్ వేసి రోడ్లు కూడా వేస్తున్నారని ఫిర్యాదు రావడంతో అక్కడికి వెళ్లి స్వయంగా పరిశీలించారు కమిషనర్ రంగనాథ్ .
Also Read :- సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ ఛాలెంజ్
ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేసిన వారిపైన క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఈ ఘటనపై ముందుగా స్థానిక పోలీసులకు పిర్యాదు చేసి.. హైడ్రా పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేశాక కేసులను టేకప్ చేస్తామని తెలిపారు.
యాక్షన్ మీరు తీసుకుంటారా.. మమ్మల్ని తీసుకొమ్మంటారా..?
తొండుపల్లి శ్మశాన వాటికలో అక్రమంగా హోల్డింగ్ లు ఏర్పాటు చేయడం పై ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్మశాన వాటికలో ఏర్పాటు చేసిన అక్రమ హోల్డింగ్ లను తొలగించాలని మున్సిపల్ కమిషనర్ సుమన్ రావు కు సూచించారు. ‘‘మీరు చర్యలు తీసుకోని పక్షంలో తము రంగంలోకి దిగి చర్యలు తీసుకుంటాం’’ అని ఈ సందర్భంగా మునిసిపల్ కమిషనర్ తో అన్నారు. అదేవిధంగా చారినగర్ వద్ద చెరువు కుంటను పూడ్చేసి వెంచర్ చేసిన నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
మాదాపూర్, ఫిలింనగర్ బస్తీ చెరువు కబ్జాలపై సీరియస్:
ప్రభుత్వ భూములు, చెరువుల కబ్జాలపై వస్తున్న ఫిర్యాదులను సీరియస్ గా తీసుకున్నా హైడ్రా కమిషనర్ రంగనాథ్. మాదాపూర్ లోని గుట్టల బేగంపేట చెరువు కబ్జాలపై వచ్చిన ఫిర్యాదులను పరిశీలించారు. అత్యంత విలువైన చెరవు స్థలాలను కబ్జా చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
అదేవిధంగా ఫిలింనగర్ బస్తీ విష్పర్ వ్యాలీకి చేరువగా వున్న చెరువును కూడా అధికారులతో కలిసి స్వయంగా పరిశీలించారు. రామానాయుడు స్టూడియోస్ కు దగ్గరలో ఉన్న చెరువు చుట్టూ కబ్జాలపై వచ్చిన ఫిర్యాదులపై హైడ్రా పోలీస్ ఏర్పాటు అయ్యాక చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.