పైగా ప్యాలెస్‌‌లో హైడ్రా కమిషనరేట్!

పైగా ప్యాలెస్‌‌లో హైడ్రా కమిషనరేట్!
  • 3 రీజినల్ ఆఫీసుల ఏర్పాటుకు సర్కార్ నిర్ణయం

హైదరాబాద్ సిటీ, వెలుగు: హైడ్రా ఆఫీసులు త్వరలో ఏర్పాటు కానున్నాయి. కమిషనరేట్ తో పాటు మూడు రీజినల్ కార్యాలయాలను ప్రభుత్వం ఏర్పాటు చేయనున్నది. ఇందులో హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ రీజినల్ ఆఫీసులు రానున్నాయి. రసూల్ పురాలోని పైగా ప్యాలెస్ లో హైడ్రా కమిషనర్ కార్యాలయం ఏర్పాటు చేయనున్నట్లు తెలిసింది.

ఈ మేరకు ఆ భవనాన్ని కమిషనర్ సహా పలువురు అధికారులు పలుమార్లు పరిశీలించారు. ప్రస్తుతం కొనసాగుతున్న హైడ్రా కార్యాలయాన్ని హైదరాబాద్ రీజినల్ ఆఫీస్​కి కేటాయించనున్నారు. ఇదే బిల్డింగ్ లోని బీ బ్లాక్ లో హైడ్రా పోలీసు స్టేషన్ ఏర్పాటు కానున్నది. సైబరాబాద్ రీజినల్ ఆఫీస్​కు సంబంధించి భవనాన్ని అధికారులు పరిశీలిస్తున్నారు. శేరిలింగంపల్లి, కూకట్ పల్లి నియోజకవర్గాల్లో ఏర్పాటు చేసే అవకాశం ఉన్నది. 

కమాండ్ కంట్రోల్ తరహాలోనే..

బంజారాహిల్స్ లోని కమాండ్ కంట్రోల్ తరహాలోనే హైడ్రా కమిషనరేట్ ఏర్పాటు చేయనున్నారు. దీనికోసం అనుభవనం కలిగిన ఓ డీఎస్పీకి బాధ్యతలను అప్పగించారు. అన్ని రకాల టెక్నాలజీతో కంట్రోల్ రూమ్ ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. ఇందులో భాగంగా బుధవారం షాద్ నగర్ లోని నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్(ఎన్​ ఆర్ఎస్ సీ) సెంటర్ ని హైడ్రా అధికారులు పరిశీలించారు.

అక్కడి పరిస్థితుల గురించి వివరాలు సేకరించారు. ఇంకొన్ని సెంటర్లను పరిశీలించి.. అన్ని వివరాలు తెలుసుకున్నాక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయనున్నారు. భవనాలకు కావాల్సిన ఇన్ ఫ్రాస్ట్రక్చర్​కు సంబంధించి అంచనా వేసి ప్రభుత్వానికి పంపనున్నారు.

ఇప్పటికే హైడ్రాకు ప్రభుత్వం రూ.200 కోట్లు కేటాయించింది. ఇందులో నుంచి ఎంతమేరకు ఇస్తుందో వేచిచూడాల్సి ఉంది. హైడ్రాకు కేటాయించిన డిప్యూటీ కలెక్టర్లు, ఎంఆర్ వో, ఇన్ స్పెక్టర్లు, ఎస్​ఐలు హైడ్రాకు రిపోర్టు చేశారు. ప్రస్తుతం జీహెచ్ఎంసీ సిబ్బందితో హైడ్రా పనులు కొనసాగిస్తున్నది.