తెలంగాణలో హైడ్రా అధికారుల దూకుడు ఆగటం లేదు.. హైదరాబాద్‌లో అక్రమ నిర్మాణాల కూల్చివేతల పరంపరా కొనసాగుతోంది. ఆదివారం ( జనవరి 5, 2025 ) మాదాపూర్ లో హైడ్రా అధికారులు కూల్చివేతలు చేపట్టారు. మాదాపూర్ అయ్యప్ప సొసైటీలో అక్రమంగా నిర్మిస్తున్న ఐదంస్తుల బిల్డింగ్ కూల్చేశారు హైడ్రా అధికారులు.
అయ్యప్ప సొసైటీ వద్దకు భారీగా పోలీసులు మోహరించారు. పోలీసుల భద్రత మధ్య హైడ్రా అయ్యప్ప సొసైటీలో అక్రమ కట్టడాలను కూల్చివేసింది, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా హైడ్రా అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు. కూల్చివేస్తున్న భవనం రోడ్డు పక్కనే ఉండటంతో పవర్ సప్లై ఆపేశారు. భవనాన్ని కూలుస్తున్న సమయంలో ట్రాఫిక్ ను పూర్తిగా నిలిపి వేశారు. దీంతో వాహనదారులు చాలా ఇబ్బంది పడ్డారు.
రూల్స్ పట్టించుకోకుండా ఉన్న ఏ నిర్మాణాన్నైనా కూల్చేస్తామని హైడ్రా అధికారులు ముందు నుంచీ చెబుతూనే ఉన్నారు. అయినా కూడా కొంతమంది వాటిని పెడ చెవిన పెడుతున్నారు. ఇప్పుడు అయ్యప్ప సొసైటీలో నిర్మించిన భవం కూడా రూల్స్‌ను అతిక్రమించి కట్టినదే. నిబంధనలకు విరుద్ధంగా సెల్లార్, గ్రౌండ్ తో పాటూ 5 అంతస్తు భవనాన్ని నిర్మిస్తున్నారని అక్కడ స్థానికులు హైడ్రాకు కంప్లైంట్ చేశారు. ఫిర్యాదుల మేరకు బిల్డింగ్‌ను పరిశీలించిన అధికారులు దాన్ని కూలగొట్టారు.