ప్రభుత్వ స్థలంలో క్రికెట్​ బాక్స్ ..​ కూల్చేసిన హైడ్రా

ప్రభుత్వ స్థలంలో క్రికెట్​ బాక్స్ ..​ కూల్చేసిన హైడ్రా
  • అధికారులు, సిబ్బందిపై దాడికి యత్నించిన బీఆర్ఎస్​ లీడర్​ 

ఎల్బీనగర్, వెలుగు: బడంగ్ పేట్ పరిధిలో అక్రమ నిర్మాణాలను కూల్చివేసేందుకు వెళ్లిన హైడ్రా అధికారులు, సిబ్బందిపై బీఆర్ఎస్ మాజీ కార్పొరేటర్​భర్త, అనుచరులు దాడికి యత్నించారు. హైడ్రా సీఐ తిరుమలేశ్ పైకి కూడా వెళ్లడంతో ఉద్రిక్తత నెలకొంది. రంగారెడ్డి జిల్లా బడంగ్ పేట కార్పొరేషన్ పరిధిలో ఉన్న సర్వే నంబర్ 38,39,40,41,44లో భూ యజమానులు బోయపల్లి ఎన్ క్లేవ్ పేరిట1982లో లే అవుట్ చేసి ప్లాట్లు అమ్మారు. కొద్ది రోజుల క్రితం ఇదే లే అవుట్ లోని 238గజాల పార్క్ స్థలంతో పాటు మూడు రోడ్ల స్థలాన్ని బాక్స్ క్రికెట్ గ్రౌండ్ గా డెవలప్​చేశారు. కాలనీవాసులు హైడ్రాకు ఫిర్యాదు చేయగా, హైడ్రా సీఐ తిరుమలేష్ నేతృత్వంలో 40 మంది సిబ్బంది గురువారం బాక్స్ క్రికెట్ గ్రౌండ్ ను కూల్చివేయడానికి వచ్చారు. 

దీంతో యజమాని, బీఆర్ఎస్ మాజీ కార్పొరేటర్ భర్త బోయపల్లి శేఖర్ రెడ్డితో పాటు మరికొంత మంది అక్కడకు వచ్చి హైడ్రా అధికారులతో గొడవకు దిగారు. అడ్డుకోవడంతో పాటు హైడ్రా ఇన్​స్పెక్టర్​తిరుమలేశ్ పై దాడికి యత్నించారు. అయినా హైడ్రా అధికారులు వారి పని ముగించుకుని వెళ్లిపోయారు.  తర్వాత మున్సిపల్ కమిషనర్ తో మాట్లాడి ఆ స్థలంలో బోర్డు పాతించారు. కాలనీవాసులు మాట్లాడుతూ తాము నడవడానికి ఇబ్బందులు పడ్డామని, కనీసం అంబులెన్స్, స్కూల్ బస్సు వచ్చే వీలు లేకుండా రోడ్డు కబ్జా చేశారని ఆరోపించారు. హైడ్రా ఏర్పాటు చేసిన సీఎం రేవంత్​రెడ్డి, హైడ్రా చీఫ్​రంగనాథ్​ఫొటోలకు పాలాభిషేకం చేశారు.