
హైదరాబాద్ సిటీ, వెలుగు: మణికొండలోని హైటెన్షన్ విద్యుత్ వైర్ల కింద ఉన్న స్థలంతోపాటు బుల్కాపూర్నాలాను ఆక్రమించి ఏర్పాటు చేసిన రేకుల ప్రహరీని హైడ్రా అధికారులు శనివారం తొలగించారు. ఓ నిర్మాణ సంస్థ మణికొండ మర్రిచెట్టు సమీపంలోని నాలాను కలిపేసుకుని, హైటెన్షన్ కరెంట్ తీగల కింద నిర్మాణాలు చేపట్టినట్లు ఇటీవల స్థానికులు హైడ్రాకు ఫిర్యాదు చేశారు. హైడ్రా అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి నిజమేనని తేల్చారు.
శనివారం ఆక్రమణలను తొలగించారు. కాగా శంకరపల్లిలోని బుల్కాపూర్ చెరువు నుంచి మొదలయ్యే నాలా ఖానాపూర్, కోకాపేట, నార్సింగి, పుప్పాలగూడ, మణికొండ, దర్గా, షేక్‌పేట, టోలిచౌకి, పోచమ్మ బస్తీ, చింతల బస్తీ మీదుగా హుస్సేన్ సాగర్‌కు వర్షపు నీటిని తరలిస్తుంది. బుల్కాపూర్ నాలా పునరుద్ధరణతో చాలా ప్రాంతాల్లో భూగర్భ జలాలు పెరుగుతాయని స్థానికులు చెబుతున్నారు.