చెరువులు సామాజిక సంపద

చెరువులు సామాజిక సంపద

ప్రభుత్వ ఆస్తులను కాపాడడానికి తెలంగాణ ప్రభుత్వం హైడ్రా అనే విభాగాన్ని పట్టణ అభివృద్ధిశాఖలో ఏర్పాటు చేసింది.  విస్తృత హైదరాబాద్ పట్టణ ప్రాంతంలో విపత్తుల పట్ల తక్షణ స్పందనకు, సంసిద్ధత, నివారణ, క్షేత్రస్థాయి అమలు కోసం హైడ్రా అనే ప్రత్యేక విభాగాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ విభాగం ప్రధాన పని స్థానిక సంస్థలు,  ప్రభుత్వ ఆస్తులను రక్షించడం. ఉత్తర్వులలో పేర్కొన్న ఆస్తులు,  చెరువులు,  ఖాళీ ప్రభుత్వ స్థలాలు, పార్కులు,  లేఅవుట్లు, ఇతర భూమి, ఆట స్థలాలు, నాలాలు,  రోడ్లు,  ఫుట్‌‌పాత్‌‌లు మొదలైనవి.  జులై 2024లో  మొదలైన ఈ విభాగం తనకిచ్చిన అనేక పనులలో ఇప్పటికైతే  చెరువుల మీద దృష్టి సారించింది. ప్రభుత్వ ఆస్తుల ఆక్రమణ, అవినీతితో జతకట్టి,  ఇంతింతై అదొక పెద్ద సమస్యగా మారింది. 

వాతావరణ  మార్పుల నేపథ్యంలో  చెరువుల పాత్ర కీలకం అయ్యింది. పట్టణాలలో  వరదలు నిత్యకృత్యమై సామాన్యులకి నష్టం కలుగుతున్నది. ఈ నష్టం వివిధ రూపాలలో అంచనా వేస్తే కేవలం హైదరాబాద్​లోనే  కనీసం రూ.2 లక్షల కోట్లు ఉండవచ్చు.  

రాష్ట్ర స్థూల ఉత్పత్తి విలువలో హైదరాబాద్​ ద్వారా చేరేది దాదాపు రూ.8 లక్షల కోట్లు.  ఇటువంటి పట్టణంలో తరచూ వస్తున్న   అనేక విపత్తుల వల్ల సంభవిస్తున్న ఆస్తి నష్టం చాలా ఎక్కువ.  ప్రజల ఆరోగ్యం మీద తీవ్రమైన ప్రభావం కనపడుతున్నది.  కబ్జాల వల్ల ప్రభుత్వం ప్రజల అవసరాలకుఅందించాల్సిన  వనరులను తగిన స్థాయిలో అందించలేకపోతున్నది.  పరిశుభ్రతను నిర్వహించడం గగనం అవుతున్నది.  ప్రజలకు మంచి నీరు ఇవ్వడం ఒక పెద్ద సవాలుగా మారింది. 

జంట జలాశయాలకు 100 ఏండ్లు

100 ఏండ్ల నుంచి హైదరాబాద్ నగరానికి ఖర్చు లేకుండా మంచి నీరు అందిస్తున్న జంట జలాశయాలు, హిమాయత్​సాగర్, ఉస్మాన్ సాగర్ కలుషితమైతే మనం కోల్పోయేది మన ఆరోగ్యమే కాదు. ఈ రెండు జలాశయాలు అందించే 7 టీఎంసీల నీరు కూడా.  ఈ జలాశయాల నీరు కలుషితం అయితే ఆ మేరకు గోదావరి నుంచి నీళ్లు తెచ్చుకోవాలంటే పెట్టుబడి ఖర్చులే దాదాపు రూ.10 వేల కోట్లు కావచ్చు.  

నిర్వహణ ఖర్చులు అదనం.  గత ప్రభుత్వాధినేత ఈ చిన్న తర్కం తట్టక జంట జలాశయాలు కనుమరుగు అయినా సమస్య లేదు అని ప్రకటించారు. జీవో111 పరిధిలో ఉంది అంటున్న 1.32 లక్షల ఎకరాలు కాంక్రీట్ నిర్మాణాలుగా మారిస్తే వచ్చే నష్టం పరివిధాలుగా ఉంటుంది. ఈ జంట జలాశయాలు 100 ఏండ్లు పూర్తి చేసుకున్న సందర్భంలో వీటిని శుభ్రపరిచి, పూడిక తీసి, కబ్జాలు ఎత్తివేసి, మురికినీరు చేరకుండా వ్యవస్థ ఏర్పాటు చేసి, ఉత్సవాలు నిర్వహించాలి. 

తెలంగాణ వ్యాప్తంగా చెరువులు అనుసంధానం

హైదరాబాద్​లోనే కాక  తెలంగాణ వ్యాప్తంగా చెరువులు ఒకదానితో ఒకటి అనుసంధానించబడినాయి.  హైదరాబాద్​లో   కేవలం 26 గొలుసు కట్టు చెరువులు ఉన్నట్టు కాగ్​ నివేదికలో ప్రస్తావించారు. ఇంకా ఎక్కువే ఉన్నాయి.  హైదరాబాద్  రాజధాని ప్రాంతంగా ప్రకటిస్తున్న ప్రాంతంలో అన్ని చెరువుల నీటి నిలువ సామర్థ్యం జోడిస్తే కనీసం 100 టీఎంసీలు ఉండే అవకాశం ఉన్నది.  తెలంగాణ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టులో 180 టీఎంసీల నీళ్లు తరలించడానికి దాదాపు రూ.1,50,000 కోట్లు ఖర్చు చేసింది.  

అంటే, ప్రతి  టీఎంసీ నీళ్లకు పెట్టుబడి ఖర్చు రూ.6 వేల కోట్లు అవుతున్నది.  నిర్వహణ ఖర్చులు అదనం.  ఆ లెక్కన హైదరాబాద్  చెరువులలో నీటి విలువ కనీసం రూ.6 లక్షల కోట్ల నుంచి మొదలై  ఇంకా ఎక్కువే ఉండవచ్చు.  చెరువుల కబ్జా వలన తెలంగాణ రాష్ట్రం కోల్పోయింది కేవలం ఎకరాల విస్తీర్ణం కాదు. అనేక రూపాలలో రూ.10 లక్షల కోట్లు ఉండవచ్చు. ఈ నష్టం కూడా ప్రతి ఏటా పెరుగుతూ వస్తున్నది. 

చెరువుల రక్షణకు ప్రాధాన్యమివ్వాలి

చెరువుల కబ్జాతో  నష్టపోతున్న వ్యక్తులు, కుటుంబాల సంఖ్య కనీసం ఒక కోటి ఉండవచ్చు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన హైడ్రా వల్ల ఆర్థికంగా ఒకరిద్దరు వ్యక్తులు నష్టపోతున్నారు అని బాధపడేవారు ఈ లెక్కలను పరిగణనలోనికి తీసుకోవాలి.  ప్రజల ఆస్తిని కబ్జా నుంచి విముక్తి చేస్తే  దీర్ఘకాలికంగా,  సుస్థిర ప్రయోజనాలు ఉంటాయి. 

తెలంగాణాలో ప్రతి ఇంటికి 80 శాతం నీటికి భూగర్భ జలాలే ఆధారం. హైదరాబాద్ లాంటి పట్టణాలలో కొన్ని ప్రాంతాలలో 100 శాతం.  హైదరాబాద్ జల మండలి, మిషన్ భగీరథ ద్వారా వచ్చే నీళ్లు 20 శాతం మాత్రమే. వ్యవసాయం కూడా దాదాపు 80 శాతం బోర్లు ఆధార నీటి సరఫరా మీదనే ఆధారపడుతుంది.  చెరువుల నాశనం, కబ్జా తెలంగాణ ఆర్థిక రంగం మీద, ఉత్పత్తి మీద, ఉత్పాదకత మీద దాడిగా భావించాలి. 

యంత్రాంగం ఏర్పాటు చేయాలి

చెరువులు ప్రకృతి వనరులు. వాగులు, నాలాలు చెరువులకు జీవనాడులు.  ఇవి ప్రభుత్వ ఆస్తి కాదు.  అవి ఉమ్మడి, సామాజిక ఆస్తి.  వీటి మీద వ్యాపారం చేయకుండా తెలంగాణ రికార్డ్ అఫ్ రైట్స్ చట్టంతో ముడిపెట్టి, సెక్షన్ 22లో ఇంకొక ఉప సెక్షన్ గా చేర్చి, వాటి పరిరక్షణకు యంత్రాంగం ఏర్పాటు చెయ్యాలి.  2019లో ఏర్పాటు చేసిన తెలంగాణ వెట్లాండ్స్ అథారిటీకి  వనరులు ఇచ్చి జవసత్వాలు ఇచ్చి బలోపేతం చెయ్యాలి.  

తెలంగాణలో ఉన్న 4.95 లక్షల హెక్టార్లలో విస్తరించి ఉన్న 13,297 చిత్తడి నేలల్లో, 2.25 హెక్టార్ల కంటే ఎక్కువ విస్తీర్ణం ఉన్న 7,987 చిత్తడి నేలల్లో కేవలం మూడు మాత్రమే నోటిఫై చేశారు. పర్యావరణపరంగా సున్నితంగా ఉండే ఈ చిత్తడి నేలలను పరిరక్షించడానికి నోటిఫై చెయ్యాలని సుప్రీంకోర్టు ఆదేశించినా పని కాలేదు. 

హెచ్ఎండీఎ పరిధిలో చెరువులు మాయం

హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్​మెంట్​ అథారిటీ పరిధిలో ఉన్న అనేక చెరువులు మాయమవుతున్నాయి. మాస్టర్ ప్లాన్ 2012 పూర్తిగా తప్పులతో తయారుచేశారు. హైదరాబాద్ నగరంతో సహా చుట్టుపక్కల ప్రాంతాలకు సంబంధించి 7 లేక 8 మాస్టర్ ప్లాన్లు ఉంటాయి.  ఏ ఒక్క మాస్టర్ ప్లాన్​లో కూడా చెరువులు, ఇతర నీటి వనరులను గుర్తించలేదు. వాటి పరిరక్షణకు కనీస విధి విధానాలు కూడా ప్రకటించలేదు. 6,500 పై చదరపు కిలోమీటర్ల హెచ్​ఎమ్​డీఏ పరిధిలోని  భూమిని జోన్లుగా విభజించినా ఆ ప్రణాళికలలో చెరువులకు స్థానం లేకపోవడం శోచనీయం. ఇటువంటి తీవ్ర లోపాల వల్ల హెచ్​ఎమ్​డీఏలో చెరువుల పరిరక్షణ కమిటీ పెట్టినా లాభం లేకుండాపోయింది. 

చెరువుల పరిరక్షణకు తీర్మానం చేయాలి

టౌన్ ప్లానింగ్ చట్టంలో చెరువులకు స్థానం కల్పించాలి. పట్టణ ప్రణాళికలలో చెరువులకు ఒక ప్రత్యేక జోన్ ప్రకటించాలి.  హైడ్రాకు బలం చేకూరాలంటే  తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్​ రెడ్డి తక్షణమే అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి రాజకీయ నాయకులకు గట్టి సందేశం, సమాచారం ఇస్తూ ఏకాభిప్రాయ సాధనకు కృషి చెయ్యాలి.  ప్రజా ప్రతినిధుల మద్దతు కోసం జీహెచ్​ఎమ్​సీ స్టాండింగ్ కౌన్సిల్లో ఏకగ్రీవ తీర్మానం చెయ్యాలి.  తెలంగాణ శాసన సభలో కూడా చెరువులు, 
చిత్తడి నేలల పరిరక్షణకు తీర్మానం చేస్తే చరిత్రాత్మకం అవుతుంది. 

- డా. దొంతి నరసింహారెడ్డి