జనవరి నెలాఖరు లోగా హైడ్రా పీఎస్ అందుబాటులోకి..

  • బుద్ధభవన్ బీ బ్లాక్​లో పనులు పూర్తి
  • ప్రభుత్వ స్థలాల ఆక్రమణలపై కేసుల నమోదు ఇక్కడ్నుంచే 

హైదరాబాద్ సిటీ, వెలుగు: ఈ నెలాఖరు లోపు హైడ్రా పోలీస్​స్టేషన్​అందుబాటులోకి రానుంది. ఏర్పాటుకు సంబంధించి ఈ నెల 7న ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు జారీ చేయగా, అధికారులు పనులను స్పీడప్​చేశారు. బుద్ధభవన్ లోని బీ బ్లాక్ మొదటి అంతస్తుని హైడ్రా పీఎస్ కోసం కేటాయించారు. పీఎస్ ఏర్పాటు తర్వాత ప్రభుత్వ స్థలాల ఆక్రమణ, చెరువుల్లో వ్యర్థాలు వేయడంతోపాటు ఫైర్​సేఫ్టీ, ఫుట్​పాత్, రోడ్ల కబ్జా లాంటి కేసులను ఇక్కడ నమోదు చేయనున్నారు.

పీఎస్​ప్రారంభానికి ముందే సిబ్బంది నియామక ప్రక్రియను పూర్తి చేయనున్నారు. ఏసీపీ స్థాయి అధికారికి ఎస్ హెచ్ఓ(స్టేషన్ హౌస్ ఆఫీసర్) బాధ్యతలు అప్పగించనున్నారు. పీఎస్​కు, హైడ్రాకు పోలీసు శాఖ ఇప్పటికే 169 మంది సిబ్బందిని కేటాయించేందుకు అంగీకారం తెలిపింది. ఇందులో ఇద్దరు నాన్ కేడర్ ఎస్పీలు, ఐదుగురు డీఎస్పీలు , 16 మంది ఇన్ స్పెక్టర్లు, 16 మంది సబ్ ఇన్ స్పెక్టర్లు, 60 మంది కానిస్టేబుల్స్​తోపాటు హోంగార్డులు, అనలిటికల్ ఆఫీసర్లు, అసిస్టెంట్ అనలిటికల్ ఆఫీసర్లు ఉండనున్నారు.

నియామక ప్రక్రియలో ఇరిగేషన్, రెవెన్యూ అధికారులకు భాగస్వామ్యం కల్పించారు. దీంతో ఎఫ్ టీఎల్, బఫర్ జోన్ల తో పాటు ప్రభుత్వ స్థలాలకు సంబంధించి కేసుల నమోదుకు వారు ఉపయోగపడే అవకాశం ఉంది.