హైడ్రా మరో కీలక నిర్ణయం.. జనవరి నుంచి హైడ్రా ‘ప్రజావాణి’

హైడ్రా మరో కీలక నిర్ణయం.. జనవరి నుంచి హైడ్రా ‘ప్రజావాణి’

హైదరాబాద్ సిటీ, వెలుగు:  ప్రభుత్వ భూములను కాపాడేందుకు హైడ్రా మరో కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే నెల నుంచి ప్రతి సోమవారం బుద్ధభవన్‌‌‌‌లో ప్రజల నుంచి నేరుగా కమిషనర్ రంగనాథ్ ఫిర్యాదులను తీసుకోనున్నారు. ప్రభుత్వ స్థలాలను ఆక్రమించారంటూ ఇప్పటికే రోజూ వందల సంఖ్యలో ఫిర్యాదులు వస్తున్నాయి. వాటిని పరిష్కరించడానికి ఫీల్డ్‎కు వెళ్తే అక్కడ కూడా జనాల నుంచి కంప్లయింట్స్​వస్తూనే ఉన్నాయి. ఇలా ఇప్పటివరకు హైడ్రాకు సుమారు10 వేలకు వరకు ఫిర్యాదులు వచ్చినట్టు సమాచారం. 

ఇందులో హైడ్రాకు సంబంధం లేనివాటిని వదిలేసి మిగిలిన వాటిపై విచారణ చేస్తోంది. చెరువులు, నాలాలు, పార్కుల వంటి  ప్రభుత్వ స్థలాలతో పాటు ఫైర్​సేఫ్టీ, డిజాస్టర్​మేనేజ్​మెంట్‎పై ప్రజల నుంచి డైరెక్ట్​గా ఫిర్యాదులు స్వీకరిస్తే బాగుంటుందని హైడ్రా భావించింది. అందులో భాగంగా వచ్చే నెల నుంచి ప్రతి సోమవారం కంప్లయింట్స్​తీసుకోనుంది. మిగతా ప్రభుత్వ శాఖలు నిర్వహిస్తున్న ప్రజావాణి లెక్కనే ఈ కార్యక్రమం కూడా కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.  

సోమవారం ఫిర్యాదు చేస్తే శుక్రవారం సమావేశం 

హైడ్రా ఏర్పడినప్పటి నుంచి పలువురు ఫిర్యాదుదారులు బుద్ధభవన్‎లోని హైడ్రా ఆఫీసుకు వచ్చి కమిషనర్‎ను కలిసి ఫిర్యాదు చేస్తున్నారు. ఇందుకోసం కొన్ని సందర్భాల్లో గంటలతరబడి కూడా వెయిట్​చేయాల్సి వస్తున్నది. ఈ నేపథ్యంలో ప్రతివారం ప్రజలకు అందుబాటులో ఉండి ఫిర్యాదులను నేరుగా స్వీకరించేందుకు హైడ్రా ప్రజావాణి నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. 

ప్రతి సోమవారం ఫిర్యాదు చేయడానికి వచ్చేవారు పూర్తి వివరాలు పొందుపర్చాలని సూచిస్తోంది. ఆక్రమ‌‌‌‌ణ‌‌‌‌ల‌‌‌‌కు సంబంధించిన స‌‌‌‌ర్వే నంబర్లు, ఫొటోలు, ఇతర ఆధారాలుంటే జ‌‌‌‌త చేసి ఫిర్యాదులు చేయవచ్చని సూచిస్తోంది. కంప్లయింట్​వచ్చిన తర్వాత ఆలస్యం చేయకుండా ఫీల్డ్‎కు వెళ్లి విచారణ జరిపి, నిజంగా ఆక్రమణ జరిగిందని తేలితే నోటీసులు జారీ చేసి చర్యలు తీసుకోనుంది. 

ఫైర్​సేఫ్టీ, డిజాస్టర్​ మేనేజ్​మెంట్‎పై కూడా...

ప్రజావాణిలో ఆక్రమణలే కాకుండా ఫైర్ సేఫ్టీ, డిజాస్టర్ మేనేజ్​మెంట్‎కి సంబంధించిన సమస్యలపై కూడా ఫిర్యాదు చేసే అవకాశం ఉంది. ఈ కార్యక్రమంలో హైడ్రాకి సంబంధించిన అన్ని విభాగాల అధికారులు అందుబాటులో ఉండనున్నారు. ఎక్కడైనా వరద నిలిచే ప్రాంతాలుంటే కూడా ఫిర్యాదులు చేస్తే పరిష్కరిస్తారు. హైడ్రా కమిషనర్ నేరుగా కమిషనర్​రంగనాథ్​ స్వీకరించనున్నారు.  

 ముఖ్యమైన ఫిర్యాదులకు వెంటనే పరిష్కారం  

ప్రభుత్వ స్థలాల ఆక్రమణలపై సమాచారం ఇవ్వాలని ప్రజలందరికీ ఇదివరకే విన్నవించాం. దీనిపై వేల సంఖ్యలో ఫిర్యాదులు వచ్చాయి. వాటిని పరిష్కరించే పనిలో ఉన్నాం. అలాగే ప్రతి సోమవారం ప్రజావాణి నిర్వహిస్తే మరింత మంది ఫిర్యాదు చేసే అవకాశం ఉంటుంది. సోమవారం వచ్చిన ఫిర్యాదుల్లోంచి ముఖ్యమైన వాటిని ఎంపిక చేసి వెంటనే విచారణ జరుపుతాం.  నాలుగు రోజుల్లోనే సమస్య పరిష్కరించి ఫిర్యాదు చేసినవారిని పిలిపిస్తాం. ఏం చర్యలు తీసుకున్నది వారికి వివరిస్తాం.  
–హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్