4 వారాల్లో ప్రాబ్లమ్ సాల్వ్ కావాలి.. లేదంటే నేనే రంగంలోకి దిగుతా: రంగనాథ్

4 వారాల్లో ప్రాబ్లమ్ సాల్వ్ కావాలి.. లేదంటే నేనే రంగంలోకి దిగుతా: రంగనాథ్

హైదరాబాద్: ప్రజల నుంచి వచ్చిన  ఫిర్యాదులను నాలుగు వారాల్లో పరిష్కరించాలని, లేదంటే తానే స్వయంగా రంగంలోకి దిగి విచారిస్తాన‌ని హైడ్రా కమిషనర్ రంగనాథ్ అన్నారు. సోమవారం (జనవరి 27) హైదరాబాద్ బుద్ధ భవన్లో హైడ్రా ప్రజావాణి కార్యక్రమం జరిగింది. కమిషనర్ రంగనాథ్ స్వయంగా ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. మొత్తం 78 ఫిర్యాదులు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. 

చెరువులు, నాలాలు, ర‌హ‌దారులు, పార్కుల కబ్జాలకు సంబంధించి ఎక్కువగా ఫిర్యాదులు అందాయి. అమీన్‌పూర్ మండ‌లం ఐలాపూర్ గ్రామం స‌ర్వే నంబ‌రు 119 నుంచి 220 వర‌కూ ఉన్న 408 ఎక‌రాల్లో అక్రమ అమ్మకాలు జ‌రుగుతున్నాయ‌ని ఫిర్యాదు వచ్చింది. అలాగే.. అబ్దుల్లాపూర్‌ మండ‌లం కుంట్లూర్ చెరువులో 2 ఎక‌రాల స్థలాన్ని క‌బ్జాచేశార‌ని.. వెంట‌నే ఆ భూమిని కాపాడాలంటూ స్థానికులు హైడ్రాకు కంప్లైంట్ చేశారు. 

నిజాంపేట మున్సిపాలిటీలో 2900 గ‌జాల పార్కును స్థానికులు క‌బ్జా చేస్తున్నార‌ని కేవీఆర్ రెయిన్‌బో కాల‌నీ ప్రతినిధులు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వచ్చిన కంప్లైంట్లను పరిశీలించి.. సంబంధిత అధికారుల‌కు ఆయా ఫిర్యాదుల‌ను కేటాయించి విచార‌ణ చేప‌ట్టాల‌ని క‌మిష‌న‌ర్ రంగనాథ్ ఆదేశించారు. 4 వారాల్లో ఫిర్యాదు ప‌రిష్కారం కాకుంటే.. తానే స్వయంగా వ‌చ్చి విచారిస్తాన‌ని ఫిర్యాదుదారులకు చెప్పారు కమిషనర్.