- మల్కాపూర్ చెరువులో బిల్డింగ్‌ను తాము కూల్చేయలేదన్న హైడ్రా కమిషనర్
హైదరాబాద్‌సిటీ, వెలుగు: హైడ్రా పరిధి ఔటర్ రింగ్ రోడ్డు వరకే అని హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు. రహదారుల విస్తరణతో పాటు రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడ కూల్చివేతలు జరిగినా హైడ్రా చేసినట్టు ప్రచారం చేయడాన్ని ఖండిస్తున్నామన్నారు. కొంతమంది హైడ్రాను అప్రతిష్టపాలు చేసేందుకు చేస్తున్న ప్రయత్నాల్లో ఎవరూ పావులు కావద్దని ఆదివారం ఓ ప్రకటనలో ఆయన విజ్ఞప్తి చేశారు. వాస్తవాలు తెలుసుకోకుండా హైడ్రాపై అసత్య వార్తలు ప్రచారం చేస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఇక సంగారెడ్డిలోని మల్కాపూర్ చెరువులో కూల్చివేతకు, తమకు సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు. చెరువులో కట్టిన ఆ బిల్డింగ్ ను తాము కూల్చివేయలేదని తెలిపారు. ఆ కూల్చివేతలను హైడ్రాకు ముడిపెడుతూ సోషల్‌మీడియాలో వార్తలు వస్తున్నాయని, అది విచారకరమన్నారు. ఆ తప్పుడు వార్తలను ఖండిస్తున్నామన్నారు. అక్కడ ఓ హోంగార్డుకు గాయమైతే.. హైడ్రా బలి తీసుకుందని, సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. గాయపడిన హోంగార్డు ఆరోగ్యం కుదుటపడుతోందని వెల్లడించారు.