- కబ్జాల చెర నుంచి 44 ఎకరాల భూమికి విముక్తి
- జూన్ 27 నుంచి ఈ నెల 24 వరకు హైడ్రా యాక్షన్ ఇది
- ఆక్రమణల కూల్చివేతపై ప్రభుత్వానికి రిపోర్టు
- ఆక్రమణదారుల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ, ఎంఐఎం నేతలు, బంధువులు
- -చింతల్ చెరువులో 3.5 ఎకరాలు కబ్జా చేసిన బీఆర్ఎస్ నేత రత్నాకర్ రాజు
- అనుమానం రాకుండా చిన్న చిన్న ఇండ్లు కట్టి అందులో పేదలను ఉంచినట్లు గుర్తింపు
- అక్కినేని నాగార్జున, పల్లం ఆనంద్, కావేరీ సీడ్స్ యజమాని భాస్కర్ రావు,
- ప్రొ కబడ్డీ యజమాని అనుపమ కట్టడాలూ కూల్చివేత
హైదరాబాద్, వెలుగు: ఆక్రమణల కూల్చివేతలపై ప్రభుత్వానికి హైడ్రా కమిషనర్ రంగనాథ్ రిపోర్ట్ సమర్పించారు. ఈ ఏడాది జూన్ 27 నుంచి హైడ్రా కూల్చివేతలు ప్రారంభించగా.. ఆగస్టు 24 వరకు మొత్తం 18 చోట్ల 166 ఆక్రమణలను తొలగించి 44 ఎకరాల భూమిని కబ్జా కోరల నుంచి రికవరీ చేసింది. ఆక్రమణదారుల్లో లీడర్లు, సెలబ్రిటీలు, బడాబాబులు ఉన్నారు. చెరువులను కబ్జా చేసి వాటిలో భారీ బిల్డింగ్స్ కట్టారు. కొందరైతే ఎవరికీ అనుమానం రాకుండా చిన్న చిన్న ఇండ్లు కట్టి.. అందులో పేదలను ఉంచారని హైడ్రా గుర్తించింది.
లోటస్ పాండ్‌తో మొదలు..
ఫిలింనగర్ కో ఆపరేటివ్ సొసైటీ ప్రాంతంలోని లోటస్ పాండ్ పార్కు స్థలాన్ని కబ్జా చేసి కట్టిన కాంపౌండ్ వాల్‌ను జూన్ 27న హైడ్రా తొలగించింది. ఆక్రమణకు గురైన 16 గుంటల స్థలాన్ని స్వాధీనం చేసుకుంది. మన్సురాబాద్‌లో రోడ్డును ఆక్రమించి చేసిన నిర్మాణాలను జులై 1న కూల్చివేసింది. జూబ్లీహిల్స్ ఎంపీ, ఎమ్మెల్యే కాలనీలోని పార్కు స్థలంలో నిర్మించిన మూడు ఆక్రమణలను జులై 4న నేలమట్టం చేసింది. బంజారాహిల్స్ రోడ్డు నంబర్ 12లోని మిథిలానగర్‌లో పార్కు స్థలాన్ని ఆక్రమించి జరిపిన రెండు నిర్మాణాలను జులై 5న హైడ్రా అధికారులు కూల్చేశారు.
Also Read:-తెలంగాణను డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మారుస్తం
ఫిలింనగర్ లోని బీజేఆర్ నగర్ లో నాలాపై నిర్మించిన ఆక్రమణలను జులై 14న తొలగించారు. గాజులరామారంలోని మహదేవ్ పురంలో పార్కు జాగను ఆక్రమించి కట్టిన నిర్మాణాన్ని జులై 21న నేలమట్టం చేశారు. జూబ్లీహిల్స్ రోడ్డు నెంబర్10 లోని బేబిలాన్ రెస్టారెంట్ ఫుట్ పాత్‌ను ఆక్రమించి జరిపిన ఒక నిర్మాణాన్ని జులై 27న కూల్చారు. అమీర్ పేట్లో నాలాను ఆక్రమించి జరిపిన మూడు నిర్మాణాలను ఈ నెల 3న కూల్చివేశారు. బోడుప్పల్ సర్వే నెంబర్ 3 ప్రభుత్వ భూమిలో జరుగుతున్న నిర్మాణాలను ఈ నెల 14న నేలమట్టం చేశారు.
చిన్న చిన్న ఇండ్లు కట్టి..!
గాజులరామారంలోని చింతల్‌చెరువు సర్వే నెంబర్ 329లో 54 ఆక్రమణల(చిన్న చిన్న ఇండ్లు)ను ఈ నెల 6న హైడ్రా కూల్చేసింది. 3.5 ఎకరాల స్థలాన్ని స్వాధీనం చేసుకుంది. ఈ ఆక్రమణల వెనుక లోకల్ బీఆర్ఎస్ లీడర్ రత్నాకర్ సాయి రాజు ఉన్నట్లు హైడ్రా తన రిపోర్టులో ప్రస్తావించింది. అయితే ఈ చిన్న చిన్న ఇండ్లను రత్నాకర్ ఒక ప్లాన్ ప్రకారం కట్టినట్లు, అక్రమాలపై ఎవరికీ అనుమానం రాకుండా పేదలను ఇందులో ఉంచినట్లు అధికారులు గుర్తించారు. ఇండ్లలో ఉండేందుకు పేదలకు సదరు లీడర్ డబ్బులు కూడా ఇచ్చినట్లు తేల్చారు.
ఎంఐఎం ఎమ్మెల్మే, ఎమ్మెల్సీ నిర్మాణాలూ నేలమట్టం
రాజేంద్రనగర్‌లోని భుమ్రుక్ దౌలా చెరువులో 45 నిర్మాణాలను ఈ నెల 10న హైడ్రా కూల్చేసి.. 12 ఎకరాల స్థలాన్ని స్వాధీనం చేసుకుంది. ఇందులో 40 కాంపౌండ్ వాల్స్ ఉండగా, జీ ప్లస్ 5 అంతస్తుల భవనాలు రెండు.. జీ ప్లస్ 2 ఫ్లోర్ల భవనం ఒకటి.. గ్రౌండ్ ఫ్లోర్ తో ఉన్న మరో భవనం ఉన్నాయి. వీటిలో ఒకటి బహదూర్ పురా ఎంఐఎం ఎమ్మెల్యే మహ్మద్ ముబీన్, మరొకటి ఎంఐఎం ఎమ్మెల్సీ మిర్జా రహెమత్ బేగ్ కు చెందినవిగా హైడ్రా తన రిపోర్టులో పేర్కొంది.
దానం అండతో సాగిన నిర్మాణాలు సైతం!
జూబ్లీహిల్స్ నందగిరిహిల్స్ లోని పార్కు స్థలంలో జరిపిన 16 టెంపరరీ నిర్మాణాలను ఈ నెల 9న హైడ్రా కూల్చేసింది. 18 గుంటల స్థలాన్ని స్వాధీనం చేసుకుంది. అయితే ఇక్కడ కబ్జాదారులకు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సపోర్టు చేస్తున్నట్లు హైడ్రా తన రిపోర్టులో పేర్కొంది. ఇదే విషయంపై అప్పట్లోనే హైడ్రా అధికారులు దానంపై కేసు కూడా నమోదు చేశారు.
అప్పట్లో ఓసీ కూడా ఇచ్చిన జీహెచ్ఎంసీ!
గాజులరామారంలోని భూదేవినగర్ పరికి చెరువు బఫర్ జోన్లో ఉన్న 5 ఆక్రమణలను జులై 23న హైడ్రా అధికారులు తొలగించారు. చందానగర్ లోని ఎర్లు చెరువులో నిర్మించిన జీ ప్లస్ 3 ఫ్లోర్ల భవనం ఒకటి.. జీ ప్లస్ 4 అంతస్తుల రెండు భవనాలను ఈ నెల 10న నేలమట్టం చేశారు. వీటికి సంబంధించి జీహెచ్ఎంసీ అధికారులు అనుమతులు ఇచ్చినట్లు హైడ్రా అధికారులు గుర్తించారు. ఒక భవనానికైతే ఏకంగా ఓసీ కూడా ఇచ్చినట్లు విచారణలో తేలింది. బాచుపల్లి, ప్రగతినగర్‌లోని ఎర్రకుంట చెరువులో నిర్మించిన జీ ప్లస్ 3 ఫ్లోర్ల ఒక బిల్డింగ్, జీ ప్లస్ 5 ఫ్లోర్ల రెండు బిల్డింగ్స్‌ను ఈ నెల 14న హైడ్రా కూల్చేసింది.
గండిపేట చెరువులో..!
ఖానాపూర్, చిల్కూర్ పరిధిలోని గండిపేట చెరువులో 24 ఆక్రమణలను ఈ నెల 18న హైడ్రా తొలగించింది. ఇందులో ఖానాపూర్ పరిధిలో 8.75 ఎకరాల్లో గ్రౌండ్ ప్లస్ 2 ఫ్లోర్ల ఒక బిల్డింగ్, గ్రౌండ్ ఫ్లోర్ తో ఉన్న మరో బిల్డింగ్, టెంపరరీ షెడ్లు 11, కాంపౌండ్ వాల్ 1 ఉన్నాయి. చిల్కూర్ పరిధిలో 6.5 ఎకరాల్లో గ్రౌండ్ ప్లస్ 2 ఫ్లోర్ల రెండు బిల్డింగ్స్, గ్రౌండ్ ప్లస్ 1 ఫ్లోర్ ఒక బిల్డింగ్, గ్రౌండ్ ఫ్లోర్ బిల్డింగ్స్ మూడు, షెడ్స్ – కాంపౌండ్ వాల్ 3 ఉన్నాయి. ఖానాపూర్, చిల్కూర్‌లో కూల్చివేసిన కట్టడాల్లో కాంగ్రెస్ నేత, కేంద్ర మాజీ మంత్రి పల్లం రాజు సోదరుడు పల్లం ఆనంద్‌కు చెందిన ఓఆర్ఓస్పోర్ట్స్ స్ట్రక్చర్, కావేరీ సీడ్స్ యజమాని భాస్కర్‌రావుకు చెందిన నిర్మాణం, సునీల్ రెడ్డి (మంథనిలో బీజేపీ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన వ్యక్తి) నిర్మాణం ఉన్నాయి. ప్రొ కబడ్డీ యజమాని అనుపమకు చెందిన కట్టడాలు కూడా ఇందులో ఉన్నట్లు హైడ్రా తన రిపోర్టులో ప్రస్తావించింది.
తమ్మడికుంటలో 4.9 ఎకరాలు స్వాధీనం
మాదాపూర్‌లోని తమ్మిడికుంట చెరువులో సినీ నటుడు నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ ఆక్రమణలను ఈ నెల 24న హైడ్రా కూల్చివేసింది. ఇందులో రెండు షెడ్లు ఉన్నాయి. ఈ కూల్చివేతలతో చెరువుకు సంబంధించి 4.9 ఎకరాల భూమిని కాపాడినట్లు హైడ్రా తన రిపోర్టులో పేర్కొంది.