HYDRAA: కూల్చివేతలపై హైడ్రా సెన్సేషనల్ రిపోర్ట్.. ఇప్పటివరకూ ఎన్నంటే..

HYDRAA: కూల్చివేతలపై హైడ్రా సెన్సేషనల్ రిపోర్ట్.. ఇప్పటివరకూ ఎన్నంటే..

హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని అక్రమ నిర్మాణాల కూల్చివేతల వివరాలను హైడ్రా కమిషనర్ రంగనాథ్ మీడియాకు వెల్లడించారు. జూన్ 27 నుంచి ఇప్పటివరకూ 262 అక్రమ నిర్మాణాలు కూల్చివేసినట్లు హైడ్రా పేర్కొంది. 111.72 ఎకరాల భూమి స్వాధీనం చేసుకున్నట్లు తెలిపింది. హైదరాబాద్ పరిధిలోని 23 ప్రాంతాల్లో అక్రమ నిర్మాణాలు కూల్చివేసినట్లు హైడ్రా వెల్లడించింది.

27.06.2024 న ఫిల్మ్ నగర్ కో ఆపరేటివ్ సొసైటీ, ప్లాట్ నంబర్.30 (లోటస్ పాండ్)తో మొదలైన అక్రమ నిర్మాణాల కూల్చివేతలు దుండిగల్ మండలం మల్లంపేట్ గ్రామంలోని 13 విల్లాల కూల్చివేతల వరకూ కొనసాగాయి. మున్ముందు మరిన్ని అక్రమ నిర్మాణాల కూల్చివేతలకు హైడ్రా సిద్ధమైంది.

జీహెచ్ఎంసీ పరిధిలోని చెరువులు, నాలాపై అక్రమ నిర్మాణాలను కూల్చేస్తున్న హైడ్రా అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం మోపుతోంది. FTL, బఫర్ జోన్లోని నాలాలు, కుంటలను ఆక్రమించి నిర్మించిన అక్రమ కట్టడాలను ఎక్కడికక్కడ నేల మట్టం చేస్తోంది. ఇందులో భాగంగా ప్రముఖుల అక్రమ నిర్మాణాలను కూడా కూల్చేసింది.

హైడ్రా పనితీరుపై ప్రజల నుంచి అనూహ్య మద్దతు లభిస్తుండటంతో హైడ్రాను మరింత బలోపేతం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. చెరువులు, నాలాలపై అక్రమ నిర్మాణాలను గుర్తించి బాధ్యులకు రెవెన్యూ, ఇరిగేషన్, మున్సిపల్ అధికారులు నోటీసులు ఇస్తున్న పరిస్థితి ఉంది.  రాబోయే రోజుల్లో అన్ని డిపార్టుమెంట్లను ఒకే గొడుగు కింద తీసుకొచ్చే యోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం.