హైడ్రోలాజికల్ సైకిల్ ను పునరుద్ధరిస్తున్న హైడ్రా

హైడ్రోలాజికల్ సైకిల్ ను పునరుద్ధరిస్తున్న హైడ్రా

హైడ్రోలాజికల్ సైకిల్ దీనినే ‘నీటి చక్రం’ అని కూడా పిలుస్తారు.  నీటి చక్రం ద్వారానే  వర్షాలు కురుస్తాయి. మొదట.. నీటి వనరుల నుంచి నీరు ఆవిరి అవుతుంది. అనంతరం ఆవిరి అయిన నీరు చల్లబడి మేఘాలను ఏర్పరిచి వర్షాల రూపంలో భూమిపైకి చేరతాయి. ఆ తర్వాత వర్షపు నీరు ‘రన్ఆఫ్’ రూపంలో భూమిపై  ప్రవహించి తిరిగి నీటి వనరులలో వచ్చి చేరుతుంది. ఈ విధంగా  నీటిచక్రంలో వివిధ దశలు ఒకదానితో మరొకటి అనుసంధానమై ఉంటాయి. ఈ దశలలో  ఏ దశకు అయినా మానవుని కార్యక్రమాల వల్ల  ఆటంకం కలిగిస్తే దాని ఫలితం కరువు ఏర్పడటం,  వరదలు సంభవించడం, కొండ చరియలు విరిగిపడటం మొదలైన  ప్రకృతి విపత్తులు సంభవిస్తాయి. ముఖ్యంగా హైదరాబాద్ వంటి మహానగరాలలో  నీటి వనరులను ఆక్రమించుకోవటం వలన,  రన్ఆఫ్  ప్రయాణించే  మార్గంలో నిర్మాణాలు చేపట్టడం వలన.. నీటి చక్రంలో కీలకమైన రన్ఆఫ్ దశకు ఆటంకాలు ఏర్పడి హైదరాబాద్ వంటి మహానగరాలలో అకాల వరదలు సంభవిస్తున్నాయి.  

వరద నీరు రోడ్ల మీదకు రావడం వలన ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇంటి నుంచి బయలుదేరిన వ్యక్తి తిరిగి సురక్షితంగా ఇంటికి చేరుకోవటం ఎంత శ్రేయస్కరమో, నీటి వనరుల నుంచి అవిరైన నీరు కూడా ఎటువంటి ఆటంకాలు లేకుండా తిరిగి నీటి వనరులకు వచ్చి చేరడం అంతే శ్రేయస్కరం.  ‘నీరు పల్లం ఎరుగు.. నిజం దేవుడెరుగు’ అనే సామెత చెప్పినట్లుగా నీరు ప్రకృతిపరంగా తాను  ఆపాదించుకున్న పల్లపు  నీటి మార్గంలోనే  ప్రవహిస్తుంది తప్ప, మనుషుల కోసం తాను ప్రవహించే మార్గాన్ని మార్చుకోదు.  ఎవరైనా ఆటంకం కలిగిస్తే విధ్వంసం తప్పదు. ఈ కారణం చేతనే  హైదరాబాద్ వంటి మహానగరాలలో చిన్న వర్షానికి కూడా రహదారులపై నీరు నిలిచిపోయి అకాల వరదలు సంభవిస్తున్నాయి. 

నీటి వనరుల కోసం హైడ్రా సాహసం

పర్యావరణ కోణంలో,  సమాజ శ్రేయస్సు దృష్ట్యా హైదరాబాద్ డిజాస్టర్  రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్ ఏజెన్సీ(హైడ్రా) వారు నీటి వనరులను కాపాడుట కోసం చేస్తున్న గొప్ప సాహసోపేతమైన కార్యక్రమం నిర్వహించడం ఆహ్వానించదగినది.  నీటి వనరుల ఆక్రమణల ద్వారా ప్రకృతిలో ఏర్పడిన‘అసమతుల్యతలను’  హైడ్రా తిరిగి  ‘సంతులనం’ చేస్తున్నట్లుగా భావించాలి. చెరువులు వంటి నీటి వనరులు, రన్ ఆఫ్ ఈ రెండు  నీటిచక్రంలో  కీలకమైనవి. అక్రమ నిర్మాణాలు,  ఆక్రమణల ద్వారా ఈ రెండింటికీ ఏర్పడిన అవరోధాలను  తొలగించి ప్రకృతిలో కీలక భాగమైన ‘హైడ్రోలాజికల్ సైకిల్’ ని ‘హైడ్రా’ తిరిగి పునరుద్ధరిస్తున్నది.  చెరువులను ఆక్రమించటం ద్వారా విలువైన  తాగునీటి వ్యవస్థను కోల్పోతాం.  చేపలు వంటి విలువైన జీవ సంపదను కోల్పోతాం.  వర్షం పడినప్పుడు ఏర్పడే రన్ఆఫ్ వలన అనేక ప్రయోజనాలు ఉన్నాయి.  రన్ఆఫ్  ప్రవహించే మార్గం చుట్టుపక్కల  పచ్చదనం పెరిగి వాతావరణం ఆహ్లాదకరంగా మారుతుంది.  వాతావరణంలో  వేడి తగ్గిపోతుంది. రన్ఆఫ్ తిరిగి నీటి వనరులకు వచ్చి చేరడం వలన నీటి లభ్యత పెరుగుతుంది. భూగర్భజలాలు రీఛార్జ్ అవుతాయి. రన్ఆఫ్  ప్రవహించే దూరం పెరిగినకొద్దీ నీటిలోని మలినాలు తొలగించబడి నీటి స్వచ్ఛత పెరుగుతుంది.  నీటిలో కరిగే ఆరోగ్యకరమైన మినరల్స్ పరిమాణం పెరుగుతుంది. అదేవిధంగా రన్ఆఫ్ ద్వారా వ్యవసాయ భూములకు నీరు అందుతుంది.

ఎఫ్టీఎల్, బఫర్ జోన్​లపై సాధారణ ప్రజలకు అవగాహన కల్పించాలి

మనిషి ఆలోచనలకు అనుగుణంగానే  ప్రకృతిపై  మనిషి  ప్రవర్తించే తీరు ఆధారపడి ఉంటుంది.  విద్యార్థులలో ప్రకృతి విపత్తులు,  పర్యావరణంపై అవగాహన కల్పించటం  కోసం భారత సర్వోన్నత న్యాయస్థానం ఒక ప్రత్యేకమైన పాఠ్యాంశాన్ని విద్యా సంస్థలలో అమలు చేసింది.  విద్యార్థులకు ప్రకృతి విపత్తులు, పర్యావరణంపై పాఠాలు బోధించే  విద్యాసంస్థలు సైతం నీటి వనరులను కబ్జా చేసి భవనాలను నిర్మించి..భావి భారత పౌరులకు ఎటువంటి సందేశానిస్తున్నాయో ఆలోచించుకోవాలి.  సాధారణ ప్రజలకు స్థలం లేక ఇల్లు కొనేటప్పుడు ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్(ఈసీ), లింక్ డాక్యుమెంట్స్ మాత్రమే చూసుకోవాలని తెలుసు.  కానీ,  ఎఫ్టీఎల్,  బఫర్ జోన్  వంటి అంశాల ప్రాముఖ్యత సాధారణ  ప్రజలకు తెలియదు.  హైడ్రా చేపట్టిన కార్యక్రమాల వలన సాధారణ ప్రజలకు సైతం వీటి ప్రాముఖ్యత తెలియవచ్చింది.  గతంలో  అవగాహన లేక ఇండ్లు,  స్థలాలు కొన్న సాధారణ ప్రజల విషయంలో ప్రభుత్వం న్యాయం జరిగేటట్లుగా  చూస్తే మంచిది.

ALSO READ :కొరవడుతున్న క్రీడాస్ఫూర్తి.. ఇవాళ జాతీయ క్రీడా దినోత్సవం


ప్రకృతిని రియల్ ​ఎస్టేట్​గా మార్చుతున్నారు

చెరువులు వంటి నీటి వనరులు ఉన్నచోట  సహజంగా పచ్చదనంగా ఉండి పక్షులు,  వివిధ జంతుజాలాలతో పరిసర ప్రాంతాలు అందంగా, ఆహ్లాదకరంగా మారుతాయి.  ప్రకృతి మన సమాజానికి ఉచితంగా ఇచ్చిన అందమైన, ఆహ్లాదకరమైన వాతావరణాన్ని సమాజంలోని ప్రజలందరూ ఆస్వాదించాలి.  కానీ,  దురదృష్టవశాత్తు కొందరు ఈ ప్రకృతి అందాన్ని రియల్ ఎస్టేట్ వ్యాపారం పేరిట అమ్ముకొని  కోట్లకొలది రూపాయలు దండుకొని  ప్రకృతి వినాశనానికి పాల్పడుతున్నారు.  ఇలా నాశనం చేస్తూ పోతే రాబోయే తరాలు అందమైన ప్రదేశాలను కేవలం చిత్రపటాలలోనే చూసి ఆనందించ వలసి ఉంటుంది.  అత్యాధునిక సాంకేతికను ఉపయోగించి చెరువులు వంటి నీటి వనరులను కప్పివేసి నిర్మాణాలు చేపట్టి తాత్కాలికంగా లాభాలు పొందినప్పటికీ ఏదో ఒక రోజు వరదలకు  ఈ నిర్మాణాలు గురై అనంతరం భారీగా  ప్రాణ,  ఆస్తి నష్టం సంభవించక తప్పదు. 

- డా. శ్రీదరాల రాము,
ఫ్యాకల్టీ ఆఫ్ కెమిస్ట్రీ అండ్ ఎన్విరాన్మెంటల్ సైన్సెస్, హైదరాబాద్