
- హైడ్రా చర్యలతో మాకు న్యాయం జరిగింది
- మా భూములు మాకు దక్కాయి
- కబ్జాకోరులే హైడ్రాపై తప్పుడు ప్రచారం చేస్తున్నరు
- కోహెడ, ముత్తంగి, బడంగ్‌పేట, యాప్రాల్, అమీన్పూర్ వాసులు
ఖైరతాబాద్, వెలుగు : ఎన్నో ఏండ్లుగా కబ్జాదారుల చేతుల్లో ఉన్న తమ భూములు హైడ్రా రాకతో తమకు దక్కాయని సిటీకి చెందిన పలువురు ఆనందం వ్యక్తం చేశారు. హైడ్రా సేవలను అన్ని జిల్లాలకు విస్తరించాలని కోరారు. ఘట్కేసర్మండలం నారపల్లిలోని దివ్యనగర్ నల్ల మల్లారెడ్డి వద్ద ప్లాట్లు కొనుగోలు చేసినవారు, కోహెడ, ముత్తంగి, బడంగ్‌పేట, యాప్రాల్, అమీన్పూర్ వాసులు బుధవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ప్రెస్‌మీట్‌పెట్టి మాట్లాడారు. నల్ల మల్లారెడ్డి వద్ద1990–-95లో సింగరేణి ఉద్యోగులమంతా కలిసి 1,800 ప్లాట్లు కొనుగోలు చేశామని సింగరేణి మాజీ ఉద్యోగి వై.నాగేశ్వరావు తెలిపారు.
మొత్తం 2,450 ప్లాట్లు వేస్తే, అందులో తాము 1,800 ప్లాట్లు తీసుకున్నామన్నారు. గజానికి రూ.425 చొప్పున 10 కోట్ల 26లక్షల 35వేల595 చెల్లించామన్నారు. అయితే ఇచ్చిన మాట ప్రకారం డెవలప్చేయకుండా చుట్టూ గోడ కట్టేశారన్నారు. ప్రశ్నించిన వారిపై దాడులకు పాల్పడ్డారని తెలిపారు. రెవెన్యూ, టౌన్ ప్లానింగ్, ఇరిగేషన్, మున్సిపల్‌శాఖ అధికారులు అండగా ఉండడంతో ఇన్నేండ్లు అన్యాయానికి గురయ్యామని, రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీసుకొచ్చిన హైడ్రాతో న్యాయం జరిగిందని తెలిపారు.
అలాగే పలువురు మాట్లాడుతూ తమ భూములు, ప్లాట్ల సమస్యను హైడ్రా కమిషనర్ రంగనాథ్ పరిష్కరించారని చెప్పారు. హైడ్రాపై జరుగుతున్న అసత్య ప్రచారం వెనుక కబ్జాకోరులే ఉన్నారన్నారు. హైడ్రాతో లబ్ధిపొందిన నవీన్, తనూజ, గాయిత్రి, సునీత, చంద్రశేఖర్ మాట్లాడారు.