సూర్యాపేట, వెలుగు : హైడ్రాను హైదరాబాద్ కే పరిమితం చేయకుండా తెలంగాణ వ్యాప్తంగా విస్తరింపజేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు జూలకంటి రంగారెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. మంగళవారం సూర్యాపేటలో నిర్వహించిన సీపీఎం జిల్లా విస్తృతసాయి సమావేశానికి ముఖ్యఅతిథిగా ఆయన హాజరై మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా అనేక గ్రామాల్లో చెరువులు, కుంటలు ఆక్రమణకు గురయ్యాయని, వాటిని వెలికితీసేందుకు అన్ని గ్రామాల్లో హైడ్రా దాడులు నిర్వహించాలన్నారు. సెప్టెంబర్ 10 నుంచి 17 వరకు రాష్ట్రవ్యాప్తంగా తెలంగాణ సాయుధం పోరాట వార్షికోత్సవ సభలు నిర్వహించనున్నట్లు తెలిపారు.
తెలంగాణ సాయుధ పోరాటానికి నిజమైన వారసులు కమ్యూనిస్టు లేనన్నారు. తెలంగాణ సాయుధ పోరాటాన్ని ముస్లిం వ్యతిరేక పోరాటంగా బీజేపీ చిత్రీకరించడం బాధాకరమన్నారు. బీజేపీ కుట్రలను ప్రజలు తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో వరద బాధితులను ఆదుకోవడానికి పార్టీ శ్రేణులు వెంటనే సహాయక చర్యల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ప్రజలను ఆదుకోవడానికి ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు మల్లు లక్ష్మి, జిల్లా కార్యవర్గ సభ్యుడు పాండు, జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జునరెడ్డి, జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు నెమ్మాది వెంకటేశ్వర్లు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.