హైదరాబాద్: జీహెచ్ఎంసీ పరిధిలోని అక్రమ కట్టడాలపై హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (హైడ్రా) ఉక్కుపాదం మోపుతోంది. ఎఫ్టీఎల్, బఫర్ జోన్, నాలాలు, కుంటలను ఆక్రమించి నిర్మించిన అక్రమ కట్టడాలను ఎక్కడికక్కడ నేల మట్టం చేస్తోంది. ఇందులో భాగంగానే ఇవాళ (శనివారం) రామ్ నగర్లోని మణెమ్మ బస్తీలోని అక్రమ కట్టడాలపై హైడ్రా ఫోకస్ పెట్టింది. మణెమ్మ కాలనీలో నాళాను ఆక్రమించి నిర్మించిన కట్టడాల్లో హైడ్రా అధికారులు కూల్చివేతలు చేపట్టారు. ఇవాళ ఉదయం నుండి కూల్చివేతలు మొదలుపెట్టిన అధికారులు.. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
Also Read:-ఫార్మా కంపెనీలో అగ్నిప్రమాదం
నాళాపై నిర్మించిన అక్రమ కట్టడాలను జేసీబీలతో నేలమట్టం చేస్తున్నారు. అయితే, రామ్ నగర్లోని అక్రమ కట్టడాలను హైడ్రా కమిషనర్ రంగనాథ్ క్షేత్ర స్థాయిలో పర్యటించిన 24 గంటల్లోనే ఈ కూల్చివేతలు షూరు కావడం గమనార్హం. ఇదిలా ఉంటే, హైడ్రా కూల్చివేతలపై స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో అధికారులు పర్మిషన్ ఇవ్వడంతోనే ఇళ్లు కట్టుకున్నామని.. ఇప్పుడు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా ఇళ్లు కూల్చివేడయం ఏంటని హైడ్రా అధికారులు, సిబ్బందితో వాగ్వాదానికి దిగుతున్నారు. దీంతో రామ్ నగర్లో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.