‘హైదరాబాద్ మనది.. హైడ్రా మనందరిదీ’

‘హైదరాబాద్ మనది.. హైడ్రా మనందరిదీ’

హైదరాబాద్/గండిపేట, వెలుగు: చెరువులను కబ్జా చేసి నిర్మించిన కట్టడాలను నేలమట్టం చేస్తున్న హైడ్రాకు ప్రజలు పెద్ద ఎత్తున మద్దతు పలుకుతున్నారు. హైడ్రాకు మద్దతుగా గండిపేట చెరువు వద్ద ఆదివారం ఉదయం గండిపేట్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ‘హైడ్రా సపోర్ట్ వాక్’ నిర్వహించారు. కార్యక్రమంలో ప్రకృతి ప్రియులు, సీబీఐటీ స్టూడెంట్లతో పాటు స్థానికులు దాదాపు 500 మంది పాల్గొన్నారు. చెరువుల్లో ఆక్రమణలను తొలగిస్తున్న హైడ్రాకు అందరూ మద్దతు ఇవ్వాలన్నారు. సేవ్ లేక్స్.. సేవ్ లైఫ్, హైడ్రాకు మద్దతిద్దాం–హైదరాబాద్‎ను కాపాడుకుందాం, హైదరాబాద్ మనది హైడ్రా మనందరిదీ.. అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సొసైటీ ప్రెసిడెంట్ వేణు మాట్లాడుతూ.. అసోసియేషన్‎ను ప్రారంభించి 9 ఏండ్లు అవుతోందని, అప్పటి నుంచి ప్రతి వీకెండ్‎లో గండిపేట, హిమాయత్ సాగర్ లేక్స్ పరిసర ప్రాంతాలు క్లీన్ చేస్తున్నామని వెల్లడించారు. టన్నుల కొద్ది ప్లాస్టిక్, మెడికల్ వేస్టేజీని తొలగించి ప్రాసెసింగ్ కు పంపుతున్నామన్నారు. 

కానీ ఎన్నిసార్లు క్లీన్ చేసినా ప్రయోజనం ఉండటంలేదని తెలిపారు. చుట్టూ ఆక్రమణలు కొనసాగుతున్నాయని, వాటిలో చేపట్టే కమర్షియల్ నిర్మాణాల నుంచి మురికి నీరు వచ్చి చెరువులో చేరుతోందన్నారు. హైడ్రా ఏర్పాటుతో కొంత ఊరట లభించిందని, ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. సొసైటీ  ఫౌండర్ మెంబర్ రాజశ్రీ మాట్లాడుతూ.. గండిపేట చెరువుకు పూర్వవైభవం రావాలని, లేక్‎లో ఉన్న ప్లాస్టిక్‎ని తొలగించాలని కోరారు. చెరువులను కాపాడే విషయంలో వెనక్కి తగ్గొద్దన్నారు. హైదరాబాద్‎లో చెరువులను కాపాడకపోతే ఎండాకాలం బెంగళూరులో ఏర్పడినట్టే కరువు బారిన పడే పరిస్థితి వస్తుందన్నారు. సొసైటీ మెంబర్ అరవింద్ రెడ్డి మాట్లాడుతూ.. జంట జలాశయాలను కాపాడేందుకు గతంలో111 జీవో తీసుకొచ్చారని, కానీ ఫిరంగి నాలాను కబ్జా చెర నుంచి విడిపించకపోవడంతో జలాశయాల్లోకి నీరు రావడం లేదన్నారు.