అబ్దుల్లాపూర్ మెట్, వెలుగు : అబ్దుల్లాపూర్ మెట్మండలం కుంట్లూరు పెద్ద చెరువును ఆక్రమించి స్థానిక ప్రజాప్రతినిధి చామ విజయశేఖర్ రెడ్డి తన వ్యవసాయ క్షేత్రానికి రోడ్డు వేస్తున్నాడని గ్రామస్తుడు కళ్లెం వెంకట్ రెడ్డి ఇటీవల హైడ్రా కమిషనర్ రంగనాథ్ కు ఫిర్యాదు చేశారు. కమిషనర్ఆదేశాలతో మంగళవారం ఉదయం హైడ్రా తహసీల్దార్ హేమమాలిని, స్థానిక తహసీల్దార్ సుదర్శన్‌రెడ్డి, ఇరిగేషన్ ఏఈ వంశీ సర్వే నిర్వహించారు. బుధవారం క్షేత్రస్థాయిలో పర్యటించి రంగనాథ్ చెరువును పరిశీలించనున్నారు. అయితే సర్వే జరుగుతున్న టైంలో హైడ్రా అధికారులకు, రోడ్డు వేసిన వారికి మధ్య వాగ్వాదం జరిగింది.
స్థానికంగా ఉండే ఓ ప్రైవేట్ సర్వేయర్ హైడ్రా అధికారులతో కలిసి సర్వేలో పాల్గొనడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రభుత్వ సర్వేయర్ కు సర్వే చేయడం రాదన్నారు. దీంతో హైడ్రా ఇన్స్పెక్టర్ఆదిత్య ప్రైవేట్ సర్వేయర్ ను అక్కడి నుంచి పంపించారు. అనంతరం పోలీస్ బందోబస్తు మధ్య సర్వేను కొనసాగించారు. అధికారుల సర్వేపై తనకు నమ్మకం లేదని డీఐతో సర్వే చేయించాలని విజయశేఖర్‌రెడ్డి డిమాండ్ చేశారు.