- మూడెకరాల 30 గుంటలు స్వాధీనం చేసుకున్న హైడ్రా
- చెరువుకు 25 మీటర్ల ఫుల్ ట్యాంక్ లెవల్ లో ఉన్నట్టు గుర్తింపు
- మంత్రి కోమటిరెడ్డి ఫిర్యాదు మేరకు యాక్షన్ లోకి ఆఫీసర్లు
- భారీ యంత్రాలతో నిర్మాణాల కూల్చివేత
హైదరాబాద్: సినీ నటుడు అక్కినేని నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్‌ను హైడ్రా బృందం కూల్చివేసింది. మాదాపూర్‌లోని తుమ్మిడి చెరువు ఎఫ్టీఎల్ లో నిర్మించిన భాగాన్ని భారీ బందోబస్తు మధ్య అధికారులు కూల్చివేశారు. మూడెకరాల 30 గుంటల చెరువు ఎఫ్టీఎల్ స్థలాన్ని కబ్జా చేసినట్టు మంత్రి కోమటిరెడ్డి ఫిర్యాదు చేయడంతో అధికారులు ఇవాళ ఉదయం కూల్చివేతలు చేపట్టారు. భారీ యంత్రాల సాయంతో ఎఫ్టీఎల్ ప్రాంతంలో ఉన్న భాగాన్ని నేలమట్టం చేశారు. ఇవాళ ఉదయమే పోలీసుల బలగాలతో మాదాపూర్ కు హైడ్రా అధికారులు చేరుకున్నారు. ఎన్ కన్వెన్షన్ కు వెళ్లే అన్ని దారులను పోలీసులు మూసి వేశారు. అటువైపు ఎవరూ వెళ్లకుండా భారీకేడ్లను ఏర్పాటు చేశారు. కూల్చివేతలు పూర్తయ్యే వరకు ఎవరిని అనుమతించలేదు.
వివాదం ఇదే?
హీరో నాగార్జున, నల్ల ప్రీతమ్ రెడ్డితో కలిసి మాదాపూర్‌లో ఎన్3 ఎంటర్ ప్రైజెస్ పేరుతో ఎన్ కన్వెన్షన్‌ను 2015లో నిర్మించారు. మొత్తం 10 ఎకరాల్లో ఎన్ కన్వెన్షన్ ఉంది. ఇందులో 1.30 ఎకరాలు ఎఫ్‌టీఎల్ పరిధిలో ఉన్నాయి. 2 ఎకరాలు బఫర్ జోన్‌ను ఆక్రమించి నిర్మాణాలు చేపట్టారు. ఇదే అంశంపై ప్రభుత్వానికి ఫిర్యాదులు వచ్చాయి. దాంతో హైడ్రా అధికారులు చర్యలు తీసుకున్నారు.
కీ పాయింట్స్
- ఎన్ కన్వెన్షన్ పై హైడ్రా చెప్పిన విషయాలివి..
- తుమ్మడి చెరువు మొత్తం విస్తీర్ణం 29 ఎకరాలు
- ఎన్ కన్వేన్షన్ ఆక్రమించిన జాగా 3.30 ఎకరాలు
- 2015లో ఎన్ కన్వెన్షన్ నిర్మాణం.. అప్పటి నుంచి వివాదం
- ఆక్రమణలో రెండు హాల్స్, ఇతర శాశ్వత నిర్మాణాలు
- కూల్చివేతల తర్వాత ఎన్ కన్వెన్షన్ ఆరెకరాల పది గుంటలు
- 25 మీటర్ల ఎఫ్టీఎల్ లో నిర్మాణం.. బఫర్ జోన్ కూడా ఆక్రమణలు