- నేతల గుండెల్లో గుబులు
- తమ పరిధిలోకి రాకముందే ఎవరికి వారే కూల్చివేతలు
- పేరు బయటకు వస్తుందనే..!
హైదరాబాద్ సిటీ /చేవెళ్ల, వెలుగు:చెరువుల ఆక్రమణపై హైడ్రా ఉక్కుపాదం మోపుతుండడంతో ఇప్పటికే కబ్జాలు చేసి నిర్మాణాలు చేసుకున్న నేతల గుండెల్లో గుబులు మొదలైంది. చెరువులోని ఫుల్‌ట్యాంక్‌లెవెల్(ఎఫ్టీఎల్), బఫర్జోన్లలో ఆక్రమణలను ఎవరికివారే కూల్చివేసుకునేందుకు సిద్ధమవుతున్నారు. హైడ్రా వస్తే తమ పేరు బయటకు వస్తుందని, దీనివల్ల ప్రజల్లో తమ పేరు దెబ్బతింటుందనే ఉద్దేశంతో కొందరు నేతలు కూల్చివేతలు జరుపుతున్నారు.
జంట జలాశయాల పరిధిలోని (ఉస్మాన్‌సాగర్,హిమాయత్‌సాగర్) ప్రాంతాల్లో ఉన్న అక్రమ కట్టడాలను గుర్తించిన అధికారులు కొన్నింటిని కూల్చేశారు. రెండు రోజులుగా హిమాయత్‌సాగర్ పరిధిలో హైడ్రా అధికారులు ఆక్రమణలను పరిశీలించారు. తమకుతామే కూల్చివేతలు జరపాలని కొందరికి సమయం ఇచ్చారు. దీంతో పలు ప్రాంతాల్లో అక్రమంగా నిర్మించుకున్న కొన్ని భవనాలను, ప్రహారీ గోడలను ఎవ్వరికి వారే నేలమట్టం చేశారు. జంట జలాశయాల పరిధిలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కు చెందిన నేతలకు చెందిన ఫౌంహౌస్‌లు ఉన్నాయి. ఇందులో ఏపీకి చెందిన ఓ నాయకుడు నిర్మించిన షెడ్లను వారం క్రితం తొలగించిన్నట్లు తెలుస్తోంది.
ఫాంహౌస్‌లు ఇక్కడే ఎక్కువ
రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం అజీజ్ నగర్ గ్రామ పంచాయతీ పరిధిలో ప్రముఖుల ఫాంహౌస్‌లు ఎక్కువగా ఉన్నాయి. హిమాయత్ సాగర్ నది పరివాహక ప్రాంతం ఎక్కువగా ఈ గ్రామంలోనే ఉంది. హైడ్రాకు భయపడి కొందరు హిమాయత్ సాగర్ పరిధిలో కట్టడాలను కూల్చివేసుకున్నారు. కొందరు నేతలు హైడ్రా వచ్చి కూల్చేంత వరకు ఎందుకని హైడ్రాకు భయపడి ఈ కూల్చివేతలు చేపట్టినట్లు స్థానికంగా చర్చ జరుగుతోంది.
హైడ్రా అధికారులకు భయపడి ఒకరిద్దరూ నేతలు రేకుల షెడ్ కూల్చివేయగా, మరొకరు కాంపౌండ్ వాల్ బేస్మెంట్ కూల్చి వేయించారు. బఫర్ జోన్ లో ఉన్న వారి నిర్మాణాలను వారంతట వారే కూల్చివేస్తున్నట్లుగా గ్రామస్తులు చెబుతున్నారు. ఇందులో గత ప్రభుత్వంలో కీలక నేత, మాజీ మంత్రికి సంబంధించినదిగా తెలుస్తోంది. కొన్ని రోజులుగా హైడ్రా చెరువులు, కుంటలు, నాలల పరిరక్షణ కోసం ఎఫ్ టీ ఎల్, బఫర్ జోన్ల పరిధిలో కట్టడాలను కూల్చివేస్తున్న నేపథ్యంలో హిమాయత్ సాగర్ నదీ పరివాహక ప్రాంతంలో అజీజ్ నగర్ గ్రామ రెవెన్యూలోని శ్రీనిధి స్కూల్ వెనక సైడ్ లో ఉన్న ఫాం హౌస్ యజమానులు భయపడుతునట్లు సమాచారం.
మరింత విస్తరిస్తదేమోనని..
హైడ్రాను మరింత విస్తరించేందుకు రంగం సిద్ధమవుతోంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధి వరకు ఉన్న హైడ్రా ను హెచ్ఎండీఏ వరకు విస్తరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ వ్యవస్థ ను మూడు జోన్లుగా విభజించి వాటి బాధ్యతలను ఎస్పీ స్థాయి అధికారులకు అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో హెచ్ఎండీఏ పరిధిలో ఉన్న అక్రమ కట్టడాలు కూడా నేలమట్టం కానున్నాయి. చేవెళ్ల అసెంబ్లీ నియోజకవర్గం పూర్తిగా ఈ పరిధిలోకి వస్తుంది. హైడ్రా పరిధి విస్తరిస్తుందేమోనని కూడా కొందరు ఇప్పటి నుంచే సర్దుకునే ప్రయత్నాలు చేస్తున్నారు.