అధికారుల అరెస్ట్​కు రంగం సిద్ధం

  • హైడ్రా సిఫారసుతో ఆరుగురు అధికారులపై కేసులు
  • ఎఫ్​టీఎల్, బఫర్​ జోన్లలో నిర్మాణాలకుఅనుమతులు ఇచ్చినందుకు చర్యలు
  • అక్రమ నిర్మాణం చేపట్టిన ఇద్దరు ఓనర్లపైనా కేసు

హైదరాబాద్ సిటీ/మాదాపూర్/కుత్బుల్లాపూర్/అబ్దుల్లాపూర్​మెట్​, వెలుగు: హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, పరిసర ప్రాంతాల్లోని చెరువుల్లో కట్టడాలకు అనుమతులిచ్చిన అధికారులపై హైడ్రా కొరడా ఝులిపిస్తున్నది.  హైడ్రా చేసిన సిఫారసు ఆధారంగా సైబరాబాద్‌‌‌‌‌‌‌‌ పోలీసులు ఆరుగురు అధికారులపై క్రిమినల్ కేసులు నమోదు చేయగా.. వీరి అరెస్ట్‌‌‌‌‌‌‌‌కు రంగం సిద్ధమవుతున్నది. ప్రగతినగర్‌‌‌‌‌‌‌‌ ఎర్రకుంట చెరువు,ఈర్ల చెరువు ఫుల్‌‌‌‌‌‌‌‌ ట్యాంక్‌‌‌‌‌‌‌‌ లెవల్‌‌‌‌‌‌‌‌ (ఎఫ్‌‌‌‌‌‌‌‌టీఎల్‌‌‌‌‌‌‌‌)లో అక్రమ నిర్మాణాలకు అనుమతులు ఇచ్చిన నిజాంపేట మున్సిపల్‌‌‌‌‌‌‌‌ కమిషనర్‌‌‌‌‌‌‌‌ రామకృష్ణారావు, చందానగర్‌‌‌‌‌‌‌‌ జీహెచ్‌‌‌‌‌‌‌‌ఎంసీ డిప్యూటీ కమిషనర్‌‌‌‌‌‌‌‌  సుధాంశు, బాచుపల్లి తహసీల్దార్​పూల్‌‌‌‌‌‌‌‌సింగ్ చౌహాన్‌‌‌‌‌‌‌‌,  మేడ్చల్‌‌‌‌‌‌‌‌- మల్కాజ్‌‌‌‌‌‌‌‌గిరి ల్యాండ్‌‌‌‌‌‌‌‌ రికార్డ్స్‌‌‌‌‌‌‌‌ అసిస్టెంట్‌‌‌‌‌‌‌‌ డైరెక్టర్‌‌‌‌‌‌‌‌  శ్రీనివాసులు, హెచ్‌‌‌‌‌‌‌‌ఎండీఏ అసిస్టెంట్‌‌‌‌‌‌‌‌ ప్లానింగ్‌‌‌‌‌‌‌‌ ఆఫీసర్‌‌‌‌‌‌‌‌ సుధీర్‌‌‌‌‌‌‌‌ కుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, హెచ్‌‌‌‌‌‌‌‌ఎండీఏ సిటీ ప్లానర్‌‌‌‌‌‌‌‌ రాజ్‌‌‌‌‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పై  చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు సైబరాబాద్ ఎకనామిక్ అఫెన్సెస్‌‌‌‌‌‌‌‌ వింగ్‌‌‌‌‌‌‌‌ (ఈఓడబ్ల్యూ) పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.

ఎఫ్‌‌‌‌‌‌‌‌ఐఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు ఇప్పటికే రిజిస్టర్ కావడంతో నిందితులైన అధికారులకు నోటీసులు ఇవ్వనున్నారు. ఆ తర్వాత అరెస్ట్ చేసి, రిమాండ్‌‌‌‌‌‌‌‌కు తరలిస్తామని పోలీసులు వెల్లడించారు. హెడ్రా కమిషనర్ రంగనాథ్ సిఫారసు మేరకు చందానగర్, బాచుపల్లి బఫర్ జోన్లకు సంబంధించి రెండు ఎఫ్‌‌‌‌‌‌‌‌ఐఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు నమోదైన సంగతి తెలిసిందే. ఈ రెండు కేసుల్లో  ప్రజల ఆస్తుల  నష్టం, నివారణ చట్టం (పీపీపీఏ)-1984 సెక్షన్‌‌‌‌‌‌‌‌-3, భారతీయ న్యాయ సంహిత (బీఎన్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌)  59,198,201, 316(5), 329(3), 324(3), 49, 61(2), రెడ్​ విత్​3(5) బీఎన్ఎస్​ యాక్ట్​ కింద కేసు నమోదు చేశారు.

అయితే కేసుల తీవ్రతల నేపథ్యంలో సైబరాబాద్ సీపీ అవినాశ్​మహంతి ఆధ్వర్యంలో సమగ్ర దర్యాప్తు చేస్తున్నారు. బఫర్ జోన్స్‌‌‌‌‌‌‌‌లో అనుమతులకు సంబంధించిన డాక్యుమెంట్లను ఈఓడబ్ల్యూ వింగ్‌‌‌‌‌‌‌‌ సేకరిస్తున్నది. ఇందుకు సంబంధించి రెవెన్యూ, జీహెచ్‌‌‌‌‌‌‌‌ఎంసీ,ఇరిగేషన్‌‌‌‌‌‌‌‌ డిపార్ట్‌‌‌‌‌‌‌‌మెంట్స్‌‌‌‌‌‌‌‌ అధికారులను ఈఓడబ్ల్యూ అధికారులు సంప్రదించారు. ఎఫ్‌‌‌‌‌‌‌‌టీఎల్‌‌‌‌‌‌‌‌,బఫర్‌‌‌‌‌‌‌‌ జోన్‌‌‌‌‌‌‌‌లో నిర్మాణాలకు  అనుమతులిచ్చిన వారిపై విచారణ జరుపుతున్నారు. బిల్డింగ్ నిర్మాణం కోసం చేసిన అప్లికేషన్ దగ్గర్నుంచి వాటర్,ఎలక్ట్రిసిటీ,రోడ్స్‌‌‌‌‌‌‌‌ ఇలాంటి సౌకార్యాలకు అనుమతులు ఎలా ఇచ్చారు? అనే వివరాలను ఈఓడబ్ల్యూ సేకరిస్తున్నది.

గండిపేట, హిమాయత్‌‌‌‌‌‌‌‌ సాగర్​లో కబ్జాలపై ఫిర్యాదులు

గండిపేట, హిమాయత్ సాగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎఫ్‌‌‌‌‌‌‌‌టీఎల్​లో ఆక్రమణలపై కూడా పోలీసులకు ఫిర్యాదులు అందుతున్నాయి. అక్రమ నిర్మాణాలకు సంబంధించిన పూర్తి ఆధారాలతో కేసులు నమోదు చేస్తున్నామని పోలీసులు స్పష్టం చేశారు. హైడ్రా, రెవెన్యూ అధికారుల ఫిర్యాదుల ఆధారంగా సంబంధిత అధికారులపై క్రిమినల్‌‌‌‌‌‌‌‌ కేసులు నమోదు చేస్తున్నారు. గండిపేట, హిమాయత్‌‌‌‌‌‌‌‌సాగర్‌‌‌‌‌‌‌‌ జలాశయల పరిధిలో అక్రమంగా నిర్మాణాలు జరిగినప్పటికీ పట్టించుకోని సీనియర్‌‌‌‌‌‌‌‌ ఇంజినీర్ల చిట్టాను హైడ్రా సేకరించినట్టు తెలిసింది.

ఇప్పటికే ఓ ఇంజినీర్​పై క్రమశిక్షణ చర్యలకు హెడ్రా సిఫారసు చేయగా.. మరింత మందిపై చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నట్టు సమాచారం. ఈ క్రమంలోనే  గండిపేట జలాశయం సూపరింటెండెంట్‌‌‌‌‌‌‌‌ ఇంజినీర్​పై కూడా క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని హైడ్రా సిఫారసు చేసింది.

అక్రమంగా బిల్డింగ్​ కట్టిన ఓనర్లపైనా కేసు

చెరువుల పరిధిలోని ఎఫ్టీఎల్, బఫర్​జోన్లలో అక్రమ నిర్మాణాలకు అనుమతులు ఇచ్చిన అధికారులతోపాటు అక్రమంగా బిల్డింగులు కట్టిన ఓనర్లపై కూడా కేసులు నమోదవుతున్నాయి. శేరిలింగంపల్లి మండలం మదీనగూడ వైశాలీనగర్​లోని సర్వే నంబర్​25లో ఈర్ల చెరువు ఉండగా, దీని బఫర్​జోన్​లో వెలసిన 148,149,150 ప్లాట్లలో అక్రమ కట్టడాలను ఆగస్టు 10న హైడ్రా నేలమట్టం చేసింది. ఈ ప్లాట్ల ఓనర్లయిన డి.స్వర్ణలత, డి.కృష్ణకిశోర్ పై ఇరిగేషన్​నార్త్​ట్యాంక్​డివిజన్​ ఏఈఈ పావని.. మియాపూర్​పోలీసులకు అప్పుడే ఫిర్యాదు చేశారు. దీంతో ఇద్దరిపై 326(ఏ),329(3), బీఎన్​ఎస్​3 పీడీపీపీఏ యాక్ట్​ కింద కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తు చేపట్టారు.

అలాగే, నిజాంపేట్ ఎర్రకుంట చెరువులో అక్రమ నిర్మాణాలు చేపట్టిన మ్యాప్స్ ఇన్​ఫ్రా ఎండీ సుధాకర్ రెడ్డి పై బాచుపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. ఇరిగేషన్ అధికారులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది. ఇటీవల ఎర్రకుంట చెరువులో నిర్మాణాలు కూల్చివేసిన అనంతరం అధికారులు సుధాకర్ రెడ్డి పై కేసు నమోదు చేశారు.  

ఏస్ వెంచర్స్‌‌పై కేసు 

రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ మండలం  తట్టి అన్నారం గోధులకుంటలోని ఎఫ్​టీఎల్​, బఫర్​జోన్​లో అక్రమ నిర్మాణం చేపట్టిన ఏస్ వెంచర్స్ పై ఇరిగేషన్ అధికారుల ఫిర్యాదు మేరకు నాగోల్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ మేరకు దర్యాప్తు చేస్తున్నారు.  ఇక్కడ ఏస్ వెంచర్స్ విల్లాలు నిర్మిస్తున్నది. వెంచర్స్ నిర్వాహకులు అక్రమంగా ఆర్సీసీ కాంపౌండ్ వాల్, బేస్​మెంట్​ నిర్మించిన విషయం తెలుసుకున్న ఇరిగేషన్ అధికారులు నాగోల్​పోలీస్ స్టేషన్​లో శుక్రవారం ఫిర్యాదు చేశారు. ఈ మేరకు నీటిపారుదల చట్టం –1957 ఎఫ్ ప్రకారం ఏస్ వెంచర్స్ ఇండియా ప్రైవేట్ నిర్వాహకులపై కేసు నమోదైంది.