- రివర్ బెడ్లోని ఇండ్ల సర్వేకు 25 స్పెషల్ టీమ్స్
- ఒక్కో టీమ్‌లో తహసీల్దార్‌తోపాటు ఐదుగురు ఆఫీసర్లు
- రివర్ బెడ్లో 2,166 ఇండ్లు ఉన్నట్లు గుర్తింపు
- అక్కడి వారిని కలిసి ఖాళీ చేసేందుకు ఒప్పించనున్న టీమ్స్
- రివర్ బెడ్లోని వాళ్లకు డబుల్ బెడ్రూం ఇండ్లు
- బఫర్‌లోని వాళ్లకు నష్ట పరిహారంతోపాటు ఇండ్ల కేటాయింపు
హైదరాబాద్ సిటీ, వెలుగు: మూసీ నదిని ఆక్రమణల చెర నుంచి విడిపించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. పరివాహక ప్రాంతంలోని పేదలకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా చర్యలు చేపడ్తున్నది. అక్కడి వారికి సర్కార్ నుంచి అందే సాయం గురించి చెప్పి, ఒప్పించి.. ఆయా ఏరియాలను ఖాళీ చేయించాలని నిర్ణయించింది. మొదట రివర్ బెడ్ (నదీగర్భం)లోని ఇండ్లను ఖాళీ చేయించనుంది. ఆ తర్వాత బఫర్ జోన్ ఏరియాపై ఫోకస్ పెట్టనుంది. ఇందులో భాగంగా హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల కలెక్టర్లు 25 టీమ్స్‌ను ఏర్పాటు చేశారు. మూసీ రివర్ బెడ్లో కట్టిన ఇండ్లను ఈ టీమ్స్ సర్వే చేస్తాయి. ఒక్కో టీమ్‌లో తహసీల్దార్‌తో పాటు ఆర్ఐ, సర్వేయర్, జీహెచ్ఎంసీ ఆఫీసర్, పోలీస్, ఆఫీస్ సబార్డినేట్ఉంటారు.
వీరంతా గురువారం నుంచి మూసీ రివర్ బెడ్ ప్రాంతాల్లో పర్యటించి అక్కడ నివసిస్తున్నవాళ్లను కలిసి ప్రాథమిక సమాచారం తీసుకుంటారు. ప్రభుత్వం అందజేసే డబుల్ బెడ్రూం ఇండ్ల గురించి వివరించి.. ఖాళీ చేయించేందుకు ఒప్పిస్తారు. మూసీ రివర్ బెడ్లో 2,166 ఇండ్లు ఉన్నట్టు ఇప్పటికే చేపట్టిన సర్వేలో తేలింది. ఇందులో హైదరాబాద్ జిల్లాలో 1,595 ఇండ్లు.. రంగారెడ్డి జిల్లాలో 332 ఇండ్లు, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో 239 ఇండ్లు ఉన్నాయి.
మూసీ రివర్ బెడ్ ప్రాంతంలో పర్యటించనున్న అధికారులు.. ‘‘ఇంట్లో ఉంటుంది యజమానా, కిరాయిదారా.. ఎంత రెంట్ చెల్లిస్తున్నారు? ఆధార్‌కార్డు ఉందా? వయస్సు ఎంత? కరెంట్ బిల్లు వస్తున్నదా? ఇంటి పేపర్లు ఏమైనా ఉన్నాయా?’’ వంటి ప్రాథమిక వివరాలు తెలుసుకోనున్నారు. మూసీ నదిలో ఇండ్లుంటే భవిష్యత్‌లో వరదలతో ముప్పు తప్పదని వారికి అర్థమయ్యేలా వివరించి మంచి ప్రదేశంలో డబుల్బెడ్రూం ఇండ్లు ఇస్తామని ఒప్పించనున్నారు. డబుల్బెడ్రూం ఇండ్ల కేటాయింపు డ్రాను కూడా వారితోనే తీయిస్తామని చెప్పి, ఖాళీ చేస్తే సామాన్లు షిఫ్ట్చేయడానికి ఖర్చులను కూడా భరిస్తామని, సహకరించాలని వివరించనున్నారు.
ఒకరోజు ముందే ప్రాథమిక పరిశీలనకు
హైదరాబాద్, మేడ్చల్‌మల్కాజ్‌గిరి, రంగారెడ్డి జిల్లాల కలెక్టర్లు బుధవారం రెవెన్యూ, పోలీసు, ఇతర శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగానే మూసీ రివర్ బెడ్లో చేయాల్సిన సర్వే గురించి వివరించి టీమ్స్‌ను ఏర్పాటు చేశారు. అయితే, గురువారం నుంచి సర్వే ఉండగా.. ప్రాథమిక పరిశీలన కోసం బుధవారమే చాలా మంది అధికారులు మూసీ పరీవాహక ప్రాంతాలకు వెళ్లారు.
గండిపేట్, రాజేంద్ర నగర్ మండలాల పరిధిలో రాజేంద్రనగర్ సర్కిల్ డిప్యూటీ కమీషనర్ రవికుమార్, ఆర్డీవో వెంకట్ రెడ్డి, నార్సింగి మున్సిపల్ కమిషనర్ కృష్ణ మోహన్ రెడ్డి, బండ్లగూడ జాగీరు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ శరత్‌చంద్ర, గండిపేట, రాజేంద్రనగర్ తహసీల్దార్లు, రాజేంద్రనగర్ ఏసీపీ శ్రీనివాస్‌రెడ్డి పర్యటించారు. కాగా, ఉప్పల్‌లోని వినాయకనగర్‌కు వెళ్లిన అధికారులను స్థానికులు హైడ్రా నుంచి వచ్చారనుకుని, తమ ఇండ్లను ఇప్పుడే కూల్చేస్తారేమోనని భావించి ఆందోళన చెందారు. అయితే, డబుల్ బెడ్రూం ఇండ్లు కేటాయించడానికి సర్వేకు వచ్చామని అధికారులు సర్దిచెప్పారు.
పునరావాసం తర్వాతే కూల్చివేతలు
మూసీ సుందరీకరణలో భాగంగా మూసీ రివర్ బెడ్ లోని 2,166 నిర్మాణాలు గుర్తించామని, వీటిని తొలగించడానికి మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా ఒక కార్యాచరణను రూపొందించినట్లు కార్పొరేషన్ ఎండీ దానకిశోర్ తెలిపారు. సీఎం ఆదేశాల మేరకు నిర్వాసితులకు డబుల్ బెడ్రూం ఇండ్లు మంజూరు చేసి పునరావాసం కల్పిస్తామన్నారు. రివర్ బెడ్, బఫర్ జోన్ ఏరియాల్లోని వారి కోసం దాదాపు 15 వేల డబుల్ బెడ్రూం ఇండ్లను ప్రభుత్వం కేటాయించిందని చెప్పారు.
రివర్ బెడ్లోని వారికి పునరావాసం కల్పించాకే అక్కడి నిర్మాణాల తొలగింపు మొదలవుతుందని తెలిపారు. బఫర్ జోన్‌లోని వాళ్లకు పునరావాస చట్టం ప్రకారం నష్ట పరిహారం చెల్లిస్తామని, దీనిపై ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు వివరించారు. ప్రభుత్వం నుంచి పర్మిషన్రాగానే నష్టపరిహారం చెల్లించి.. ఆ తర్వాతే అక్కడ భూసేకరణ చేపడతామన్నారు. మూసీ పరిధిలోని వాళ్లు అనవసరమైన అపోహలకు లోనుకావొద్దని, అర్హులందరికీ పునరావాసం కల్పిస్తామని స్పష్టం చేశారు.
మూడు జిల్లాల్లోని ఏరియాల వారీగామూసీ రివర్ బెడ్లో ఉన్న ఇండ్లు
జిల్లా: హైదరాబాద్
- అంబర్పేట్ 64
- ఆసిఫ్‌నగర్ 14
- బహదూర్‌పుర 527
- చార్మినార్ 03
- గోల్కొండ 50
- హిమాయత్‌నగర్ 263
- నాంపల్లి 604
- సైదాబాద్ 70
- మొత్తం 1595
రంగారెడ్డి
- అబ్దుల్లాపూర్‌మెట్ 00
- గండిపేట 32
- రాజేంద్రనగర్ 300
- మొత్తం 332
మేడ్చల్ మల్కాజ్గిరి
- ఘట్కేసర్ 02
- మేడిపల్లి 01
- ఉప్పల్ 236
- మొత్తం 239