- క్షణాల్లో సమాచారం తెలుసుకునేలా త్వరలో చర్యలు
హైదరాబాద్ సిటీ, వెలుగు: చెరువుల ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్లను గుర్తించేందుకు ఇరిగేషన్, రెవెన్యూ, నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ, స్టేట్ రిమోట్ సెన్సింగ్ అప్లికేషన్ సెంటర్, సర్వే ఆఫ్ ఇండియా అధికారులతో హైడ్రా కమిషనర్, లేక్ ప్రొటక్షన్ కమిటీ చైర్మన్ ఏవీ రంగనాథ్ సోమవారం సమీక్షించారు. గ్రేటర్పరిధిలోని చెరువులు, ప్రభుత్వ స్థలాలు, పార్కులు ఆక్రమణకు గురికాకుండా తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. హిమాయత్ సాగర్‌తో ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్ల గుర్తింపు ప్రారంభించాలని, అదే విధానాన్ని అన్ని చెరువుల వద్ద అమలు చేయాలని నిర్ణయించారు.
ఎక్కడ ఆక్రమణలు జరుగుతున్నా క్షణాల్లో సమాచారం తెలుసుకునేలా యాప్అందుబాటులోకి తీసుకురావాలని ప్లాన్చేశారు. ప్రజల ఫిర్యాదులతోపాటు క్షేత్రస్థాయిలో అధికారుల పరిశీలన, చర్యలను నమోదు చేయనున్నామని కమిషనర్ తెలిపారు. ఆక్రమణల డెబ్రీస్‌ను పూర్తి స్థాయిలో తొలగించాలని, మొదటి దశలో సున్నం చెరువు, అప్పా చెరువు, ఎర్రకుంట, కూకట్‌పల్లి నల్లచెరువుల వద్ద పనులు ప్రారంభించాలని చెప్పారు. 45 ఏళ్ల డేటా ఆధారంగా చెరువుల ఎఫ్‌టీఎల్, మాగ్జిమమ్ వాటర్ స్ప్రెడ్ ఏరియా గుర్తించాలని, ఇందుకు ఎన్ఆర్ఎస్ఏ, స్టేట్ రిమోట్ సెన్సింగ్ అప్లికేషన్ సెంటర్, ఇరిగేషన్ విభాగాల డేటాతో సరిపోల్చాలని నిర్ణయించారు.
విలేజ్ మ్యాప్స్, భూ వినియోగం సర్వే నంబర్లతో సహా సమచారం ఇచ్చే కాడాస్ట్రల్ మ్యాప్స్, 45 ఏళ్లలో పూర్తి స్థాయిల చెరువు నీరు విస్తరించిన తీరుపై సమాచారం సేకరణపై చర్చించారు. చెరువుల ఆక్రమణలపై 2018లో కాగ్ ఇచ్చిన నివేదిక పరిశీలించి, ఎక్కడా ఎలాంటి పొరపాట్లకు ఆస్కారం లేకుండా చెరువులను గుర్తించేందుకు కసరత్తు చేయాలని నిర్ణయించారు.