- నదిలోనే 12 వేలకు పైగా నిర్మాణాలు
- పలుచోట్ల ఏకంగా వెలసిన కాలనీలు
- నిర్వాసితులతో మంత్రి పొన్నం భేటీ
- పిల్లిగుడిసె,వనస్థలిపురంలో పర్యటన
- డబుల్ బెడ్రూం ఇండ్లు ఇస్తామని ప్రతిపాదన
హైదరాబాద్: మూసీ ప్రక్షాళనకు తొలి అడుగు పడింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మూసీ నది అభివృద్ది పనులు ఊపందుకోనున్నాయి. మూసీ రివర్ ఫ్రంట్ డెవల్‌పమెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ సన్నాహాలు చేస్తోంది. ఈ తొలగింపులో సర్వం కోల్పోయే కుటుంబాలకు డబుల్ బెడ్రూం ఇండ్లు ఇవ్వనున్నట్టు సీఎం రేవంత్ రెడ్డి గతంలోనే ప్రకటించారు. మూసీ అభివృద్ధి ప్రాజెక్టు పనులు ప్రారంభమవాలంటే ముందుగా అక్రమణలన్నీ తొలగించాల్సి ఉంటుంది. ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్‌లోని షెడ్లు, గోదాంల కూల్చివేతనూ చేపట్టనున్నారు. మూడు నెలలుగా హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాల రెవెన్యూ, సర్వే, ఎంఆర్‌డీసీఎల్‌తో పాటు వివిధ శాఖల అధికారులతో పశ్చిమాన ఔటర్ రింగ్ రోడ్డు నుంచి తూర్పున కొర్రేముల వద్ద ఉన్న ఔటర్ వరకు సర్వేను పూర్తి చేశారు. నార్సింగ్ నుంచి నాగోల్ బ్రిడ్జి వరకు దాదాపు 25 కిలోమీటర్ల మేర ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్‌లో 12 వేలకు పైగా అక్రమణలు ఉన్నట్లు గుర్తించారు.
వీటిలో హైదరాబాద్ జిల్లాలోని ఆసిఫ్‌నగర్, అంబర్‌పేట, బహదూర్‌పురా, చార్మినార్, గోల్కొండ, హిమాయత్‌నగర్, నాంపల్లి, సైదాబాద్‌ల పరిధిలో పెద్దఎత్తున అక్రమణలు జరిగినట్టు తేల్చారు. బహదూర్‌పురా, సైదాబాద్, అంబర్‌పేట మండలాల పరిధిలో అధికంగా నిర్మాణాలు ఉన్నాయి. చాలావరకు మూసీ నదిలోనే కాలనీలు సైతం ఏర్పడ్డాయి. 30, 40, 60 గజాల్లోనే ఇండ్లు కట్టుకున్నారు. మధ్యలో 10 అడుగుల దారి కూడా లేకుండా నిర్మించుకున్నారు. రంగారెడ్డి జిల్లా గండిపేట, రాజేంద్రనగర్, సరూర్‌నగర్, మేడ్చల్ జిల్లా ఉప్పల్ మండల పరిధి రామంతాపూర్, భగాయత్ తదితర ప్రాంతాల్లో ఏకంగా కాలనీలే ఉన్నాయి. కొందరు గోదాములు, షెడ్‌లు ఏర్పాటు చేసి పెద్దఎత్తున వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. త్వరలోనే వీటిని తొలగించే ప్రక్రియను ప్రారంభించనున్నారు.
ALSO READ ; జమిలి ఎన్నికలతో.. బీజేపీ దేశాన్ని కబళించాలని చూస్తోంది : సీఎం రేవంత్ రెడ్డి
నిర్వాసితులకు డబుల్ బెడ్రూం
మూసీ ప్రక్షాళన నేపథ్యంలో ఆక్రమణలను తొలగించేందుకు మూసీ రివర్ ఫ్రంట్ అథారిటీ హైడ్రా సహకారం తీసుకోనుందని తెలుస్తోంది. నిర్వాసితులకు డబుల్ బెడ్రూం ఇండ్లు ఇచ్చేలా ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ఇందులో భాగంగా ఇవాళ మంత్రి పొన్నం ప్రభాకర్ పిల్లిగుడిసె,వనస్థలిపురంలో పర్యటించారు. మూసీలో ఇండ్లు నిర్మించుకున్న వారితో మాట్లాడారు. డబుల్ బెడ్రూం ఇండ్లు కేటాయిస్తామని భరోసా ఇచ్చారు.