హైడ్రాకు చట్టబద్ధత : ఆర్డినెన్స్​పై గెజిట్ విడుదల చేసిన ప్రభుత్వం

హైడ్రాకు చట్టబద్ధత : ఆర్డినెన్స్​పై గెజిట్ విడుదల చేసిన ప్రభుత్వం

హైదరాబాద్ , వెలుగు: హైడ్రాకు ప్రభుత్వం ఆర్డినెన్స్ ద్వారా చట్టబద్ధత కల్పించింది. జీహెచ్ఎంసీ చట్టం 1955ను సవరిస్తూ తెచ్చిన ఆర్డినెన్స్ కు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆమోదముద్ర వేయడంతో ప్రభుత్వం శనివారం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. జీహెచ్ఎంసీ చట్టంలో కొత్తగా 374(బి) సెక్షన్ ను చేర్చినట్టు అందులో పేర్కొన్నారు. ఆ సెక్షన్ ద్వారా గ్రేటర్ హైదరాబాద్ లోని ప్రభుత్వ ఆస్తులు, నీటి వనరులు, పార్కులు, రహదారుల పరిరక్షణ కోసం అధికారిని లేదా సంస్థను ఏర్పాటు చేసే అధికారాన్ని ప్రభుత్వానికి కట్టబెట్టారు. 

ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు లేనందున గవర్నర్ తక్షణ ఆమోదం కోసం రాజ్యంగంలోని ఆర్టికల్ 213 క్లాజ్ 1 ద్వారా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఆర్డినెన్స్ -2024ను ప్రభుత్వం ఆయనకు పంపింది. ప్రధాన చట్టంలోని సెక్షన్ 374-ఏ తర్వాత కొత్త సెక్షన్ గా ప్రభుత్వ ఆస్తులను రక్షించే అధికారం కల్పిస్తూ సెక్షన్ 374 బీని చేర్చారు. ఈ సెక్షన్ కింద ఏజెన్సీకి అధికారం ఇవ్వడానికి ప్రభుత్వానికి పవర్స్ ఇచ్చారు. జీహెచ్ఎంసీ పరిధిలోని రహదారులు, నీటి వనరులు, ప్రభుత్వ స్థలాలు, పార్క్ ల రక్షణ కోసం ఈ ఆర్డినెన్స్ తీసుకొచ్చారు.