అక్రమ నిర్మాణాలపై హైడ్రా కొరడా

అక్రమ నిర్మాణాలపై హైడ్రా కొరడా
  • హైదరాబాద్ ఎర్రకుంట చెరువులో ఆక్రమణలు తొలగింపు
  • మూడు ఐదంతస్తుల భవనాలు కూల్చివేత
  • స్థానికుల ఫిర్యాదుతో చర్యలు 

హైదరాబాద్/జీడిమెట్ల, వెలుగు : అక్రమ నిర్మాణాలపై హైడ్రా కొరడా ఝులిపిస్తున్నది. హైదరాబాద్ నిజాంపేట్ పరిధిలోని ఎర్రకుంట చెరువులో వెలిసిన అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేసింది. ప్రగతినగర్​లోని సర్వే నంబర్​ 134లో ఉన్న ఎర్రకుంట చెరువులో ఐదంతస్తుల చొప్పున నిర్మించిన మూడు భారీ భవనాలను హైడ్రా అధికారులు కూల్చివేశారు.

బుధవారం అర్ధరాత్రి నుంచి కూల్చివేత పనులు మొదలుపెట్టి, గురువారం రాత్రి కల్లా మూడు భవనాలను నేలమట్టం చేశారు. మూడెకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ చెరువులో కొన్నేండ్లుగా అక్రమ నిర్మాణాలు వెలిశాయి. దీనిపై స్థానిక నేతలు వివిధ శాఖల ఉన్నతాధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండా పోయింది. దీంతో ఇటీవల హైడ్రా కమిషనర్ రంగనాథ్ ను కలిసి చెరువులో వెలుస్తున్న అక్రమ నిర్మాణాలపై ఫిర్యాదు చేశారు.

ఆయన వెంటనే స్పందించి ఇరిగేషన్, మున్సిపల్, రెవెన్యూ తదితర విభాగాల అధికారులతో కలిసి బుధవారం ఎర్రకుంట చెరువును పరిశీలించారు. అక్కడే విచారణ చేపట్టగా, అవి అక్రమ నిర్మాణలు అని తేలింది. దీంతో వెంటనే కూల్చివేత పనులు మొదలుపెట్టారు. ఈ సందర్భంగా పరిసర ప్రాంతాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ‘‘అక్రమ నిర్మాణాలపై స్థానికుల నుంచి ఫిర్యాదు వచ్చింది. విచారించగా అవి అక్రమ నిర్మాణాలేనని తేలింది. అందుకే కూల్చివేశాం. వీటిని నిర్మించినోళ్లపై కేసు నమోదు చేస్తాం’’ అని హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు. 

సీఎంకు స్థానికుల కృతజ్ఞతలు.. 

ఎన్నికల్లో ఇచ్చిన హమీ మేరకు చర్యలు తీసుకుంటున్నందుకు సీఎం రేవంత్ రెడ్డికి స్థానికులు కృతజ్ఞతలు తెలిపారు. ‘‘అక్రమ నిర్మాణాలపై ఏండ్ల తరబడి ఎంత మంది ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు.  ప్రభుత్వం ఏర్పాటు చేసిన హైడ్రా కమిషనర్​రంగనాథ్​వెంటనే స్పందించి కేవలం గంటల వ్యవధిలోనే ఆక్రమణలు కూల్చివేశారు.

రాజకీయాలు, ప్రలోభాలు, ఒత్తిళ్లకు లొంగకుండా హైడ్రా ఆధ్వర్యంలో హైదరాబాద్ నగరం చుట్టుపక్కల ఉన్న చెరువుల పరిరక్షణ కొసాగాలి. చెరువుల పరిరక్షణకు పూనుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు” అని స్థానిక బీజేపీ నాయకుడు ఆకుల సతీశ్ చెప్పారు.