ఇక మూసీలోకి హైడ్రా ఎంట్రీ?

ఇక మూసీలోకి హైడ్రా ఎంట్రీ?
  • రెవెన్యూ శాఖ సర్వేపూర్తయ్యాక  కూల్చివేతలు 
  • సున్నిత ప్రాంతాల్లోభారీ బందోబస్తు  
  • మూడ్రోజుల్లోనేపని పూర్తి చేసేలా ప్లాన్ 

హైదరాబాద్ సిటీ, వెలుగు: మూసీపై రెవెన్యూ అధికారుల సర్వే పూర్తయ్యాక కూల్చివేతలకు హైడ్రా ఎంట్రీ ఇస్తుందని తెలుస్తున్నది. ఈ బాధ్యతలను ప్రభుత్వం హైడ్రాకే అప్పగించే అవకాశం ఉన్నట్టు సమాచారం. మూసీ రివర్​బెడ్​ఏరియాలో 2,166 ఇండ్లు ఉన్నట్టు గుర్తించారు. ఇందులో ఉంటున్నవారికి అవగాహన కల్పించి, డబుల్​బెడ్​రూమ్ ఇండ్లలోకి తరలించేందుకు అధికారులు సర్వే చేస్తున్నారు. దాదాపు 80 శాతం మంది డబుల్​బెడ్​రూమ్​ ఇండ్లలోకి వెళ్లే అవకాశం ఉందని, మిగతా 20 శాతం మంది వినకపోతే ఎలాగైనా నచ్చజెప్పి పంపిస్తామని అధికారులు అంటున్నారు.

అలా కూడా వినని పక్షంలో హైడ్రా కూల్చివేతలకు వచ్చే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. రివర్​బెడ్​లో పని పూర్తయ్యాక పెద్ద టాస్క్​బఫర్​జోన్​అని, అక్కడ ఉంటున్న వారికి రెవెన్యూ శాఖ నోటీసులిచ్చి మార్కింగ్ చేశాక హైడ్రా కూల్చివేతలకు వస్తుందని పేర్కొంటున్నారు. మొత్తానికి మూసీ రివర్ బెడ్, బఫర్ జోన్ లో ఉన్న 16 వేల ఆక్రమణలను తొలగించేందుకు హైడ్రా సిద్ధమవుతున్నట్టు తెలిసింది.  

స్పెషల్​టీమ్స్​తో..  

మూసీలో కూల్చివేతల బాధ్యతలు హైడ్రాకే అప్పగించనున్న నేపథ్యంలో అందుకు అవసరమైన సామగ్రి, సిబ్బందిని హైడ్రా రెడీ చేసుకుంటోందని తెలిసింది. ఇప్పటికే హైడ్రా అధికారులతో జరిగిప పలు సమావేశాల్లో కమిషనర్ రంగనాథ్ మూసీ అంశంపై చర్చించినట్టు సమాచారం. మూసీపై ఆక్రమణలను తొలగించే సమయంలో ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతాయన్న దానిపై ఆయన డిస్కస్​చేశారు. ఏరియాలను బట్టి ప్రత్యేకంగా టీమ్స్ ఏర్పాటు చేయాలని, సున్నిత ప్రాంతాల్లో అదనపు పోలీసుల బలగాలు సమకూర్చుకుని కూల్చివేతలకు వెళ్లే అవకాశం ఉందని అంటున్నారు.  

చిన్న యంత్రాలతోనే..

ఇప్పటివరకు 27 ప్రాంతాల్లో 311  కూల్చివేతలు జరిపిన హైడ్రా.. పెద్ద పెద్ద యంత్రాలనే వాడింది. ఎందుకంటే ఇక్కడ భారీ షెడ్లు, ఐదారు అంతస్తుల భవనాలుండడంతో అనివార్యంగా భారీ యంత్రాలు ఉపయోగించాల్సి వచ్చింది. అదే మూసీ విషయానికొస్తే దాదాపు అన్నీ చిన్న చిన్న ఇండ్లే ఉన్నాయి.

వీటిని కూల్చేందుకు పెద్ద యంత్రాలు కాకుండా చిన్న యంత్రాలే సరిపోతాయని కూడా హైడ్రా భావిస్తున్నది. ఎక్కువ సంఖ్యలో చిన్న యంత్రాలు పెట్టి త్వరగా కూల్చివేయాలని ప్లాన్ చేశారని, అంతా అనుకున్నట్టు జరిగితే కూల్చివేతలు మొదలుపెట్టిన మూడు రోజుల్లోనే పని పూర్తి చేసే అవకాశం ఉందని తెలుస్తున్నది.