హైడ్రా అవినీతికి పాల్పడితే ఏసీబీ, విజిలెన్స్ దృష్టికి తీసుకుపోవచ్చు

హైడ్రా అవినీతికి పాల్పడితే ఏసీబీ, విజిలెన్స్ దృష్టికి తీసుకుపోవచ్చు
  • పోలీసులు, ప్రభుత్వానికి ఫిర్యాదు చేయొచ్చు  
  • అవకతవకలు చేసినట్టు నా దృష్టికి తెస్తే సస్పెండ్​చేస్తా 
  • ఎమ్మెల్యే అనిరుధ్​రెడ్డి ఆరోపణలపై స్పందించిన కమిషనర్ రంగనాథ్​

హైదరాబాద్ సిటీ, వెలుగు: అసెంబ్లీ లాబీ చిట్​చాట్​లో జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్​రెడ్డి చేసిన ఆరోపణలపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పందించారు. నోటీసులు ఇచ్చి హైడ్రా లావాదేవీలు జరిపినట్లు ఫిర్యాదులుంటే త‌మ దృష్టికి కానీ, ఏసీబీ, విజిలెన్స్, పోలీసుల‌ దృష్టికి కానీ తీసుకురావాలన్నారు. అవ‌క‌త‌వ‌క‌లకు పాల్పడినట్లు తేలితే హైడ్రా ఉద్యోగులను స‌స్పెండ్ చేసి ఇతర చర్యలు కూడా తీసుకుంటామన్నారు. హైడ్రా పేరు చెప్పి వసూళ్లకు పాల్పడే వారిపై ఇప్పటికే కేసులు పెట్టామ‌న్నారు.  

‘వంశీరామ్’పై ఎమ్మెల్యే ఫిర్యాదు అంద‌లేదు 

గతేడాది ఆగస్టు 18న , డిసెంబర్ 21వ తేదీల్లో ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి నుంచి హైడ్రాకు రెండు ఫిర్యాదులు అందాయని, అందులో ఖాజాగూడ‌లోని తౌతానికుంటలో నీరు నిలిచిపోవ‌డంతో గ్రీన్‌ గ్రేస్ అపార్టు మెంట్ సెల్లార్‌లోకి నీరు చేరుతోంద‌ని, తౌతానికుంట నిండిన త‌ర్వాత వ‌ర‌ద నీరు భ‌గీర‌థ‌మ్మ చెరువుకు వెళ్లడం లేద‌ని మరొకటి వచ్చిందన్నారు. వీటిపై నేరుగా తానే ఫీల్డ్​కు వెళ్లి విజిట్​చేశానన్నారు. భ‌గీర‌థ‌మ్మ చెరువులో గ‌తేడాది డిసెంబ‌ర్ చివ‌రి వారంలో ఆక్రమ‌ణ‌లు తొలగించామన్నారు. 

వంశీరామ్​మ్యాన్‌ హ‌ట్టన్ ప్రాజెక్టుపై ఎమ్మెల్యే నుంచి ఎలాంటి ఫిర్యాదు అంద‌లేదన్నారు. వారి వ‌ద్ద ఏమైనా ఫిర్యాదు ఉంటే వాట్సాప్‌లో పంపితే ప‌రిశీలిస్తామన్నారు. గ‌తంలో ఎమ్మెల్యే వాట్సాప్‌లో స‌మ‌స్యను చెబితే స్పందించామన్నారు. ప్రతి సోమ‌వారం నిర్వహించే ప్రజావాణిలోనే కాకుండా ప‌ని దినాల్లో మ‌ధ్యాహ్నం 1 గంటల నుంచి 3 గంట‌ల వ‌ర‌కు ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీక‌రిస్తున్నట్టు తెలిపారు. ఇలా ఇప్పటివరకు 9,800 ఫిర్యాదులు వచ్చాయన్నారు. వీటిలో చాలా వ‌ర‌కు ప‌రిష్కారమ‌య్యాయన్నారు.