చెరువులను కబ్జా చేస్తే క్రిమినల్​ కేసులే... హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ హెచ్చరిక

చెరువులను కబ్జా చేస్తే క్రిమినల్​ కేసులే... హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ హెచ్చరిక

ఎల్బీనగర్/ఉప్పల్, వెలుగు: చెరువులు, కుంటలను కబ్జా చేస్తే క్రిమినల్ కేసులు నమోదు చేసి, కఠిన చర్యలు తీసుకుంటామని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ హెచ్చరించారు. మంగళవారం వనస్థలిపురం పరిధిలోని సాహెబ్ నగర్ కలాన్, మన్సూరాబాబాద్ డివిజన్ లోని హత్తిగూడ చెరువును పరిశీలించారు. సాహెబ్ నగర్ కలాన్ ఆఫీసర్స్ కాలనీ సంఘం అధ్యక్షుడు బాలాజీ, స్థానిక నాయకులు ల్యాండ్​డాక్యుమెంట్లు చూపించారు. కొందరు 39, 40 ప్లాట్లను కబ్జా చేసి బెదిరింపులకు పాల్పడుతున్నారని చెప్పారు.

డాక్యుమెంట్లను పరిశీలించి, తగిన నిర్ణయం తీసుకుంటామని రంగనాథ్​వారికి చెప్పారు. హత్తిగూడ చెరువును కొందరు కబ్జా చేస్తున్నారని స్థానిక కార్పొరేటర్ కొప్పుల నర్సింహారెడ్డి ఫిర్యాదు చేశారు. బాధ్యులపై చర్యలు తీసుకుంటామని రంగనాథ్ తెలిపారు. అలాగే ఉప్పల్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్​చార్జ్ మందుముల పరమేశ్వర్ రెడ్డి ఫిర్యాదుతో కమిషనర్​రంగనాథ్​మంగళవారం ఉప్పల్ నల్లచెరువును పరిశీలించారు. ఎమ్మెల్సీ తీన్మార్​మల్లన్న, కాంగ్రెస్​నాయకులతో మాట్లాడారు. అక్కడి పరిస్థితిని తెలుసుకున్నారు. ఎవరైనా చెరువును ఆక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.