అమీన్‌పూర్‌లో హైడ్రా స‌ర్వే.. ఎవ‌రి లే-ఔట్‌లోకి ఎవ‌రు చొర‌బ‌డ్డార‌నేది తేల్చేందుకే..

అమీన్‌పూర్‌లో హైడ్రా స‌ర్వే.. ఎవ‌రి లే-ఔట్‌లోకి ఎవ‌రు చొర‌బ‌డ్డార‌నేది తేల్చేందుకే..

హైదరాబాద్: అమీన్‌పూర్‌లో హైడ్రా స‌ర్వే చేసింది. పార్కులు, ర‌హ‌దారులు క‌బ్జాకు గురైన‌ట్టు ఫిర్యాదులు రావ‌డంతో హైడ్రా క‌మిష‌న‌ర్ రంగ‌నాథ్‌ ఆదేశాల‌తో హైడ్రా అధికారులు స‌ర్వే చేశారు. స‌ర్వేలో హైడ్రా, హెచ్ఎండీఏ, మున్సిపాలిటీ,  రెవెన్యూ శాఖ‌ల అధికారులు పాల్గొన్నారు. 

ఎక‌రాకు పైగా ఉన్న పార్కు స్థలంతో పాటు.. ర‌హ‌దారుల‌ను గోల్డెన్ కీ వెంచ‌ర్ వాళ్లు  క‌బ్జా చేశారంటూ వెంక‌ట‌ర‌మ‌ణ కాల‌నీ వాసులు హైడ్రాకి ఫిర్యాదు చేశారు. ఇరు ప‌క్షాలు కోర్టును ఆశ్రయించ‌డంతో హైకోర్టు ఆదేశాల మేర‌కు హైడ్రా స‌ర్వే జ‌రిపించింది. మొత్తం 5 స‌ర్వే నంబర్లలోని 150 ఎక‌రాలకు పైగా ఉన్న స్థలాన్ని  హైడ్రా అధికారులు సర్వే చేశారు.

వెంక‌ట‌ర‌మ‌ణ కాల‌నీ,  చ‌క్రపురి కాల‌నీ వాసులు, గోల్డెన్ కీ వెంచ‌ర్ నిర్వాహ‌కుల‌తో పాటు.. ప‌రిస‌ర కాల‌నీ వాసులు, గ్రామ‌స్తుల స‌మ‌క్షంలో స‌ర్వే జరిగింది. లే ఔట్లను ప‌రిశీలించి.. స‌ర్వే నంబ‌ర్ల ఆధారంగా.. పార్కు స్థలాలతో పాటు.. ర‌హ‌దారుల‌ను కాపాడే ప‌నిలో హైడ్రా తలమునకలైంది. సర్వే నంబ‌ర్లు, హ‌ద్దు రాళ్ల ఆధారంగా భూముల స‌రిహ‌ద్దుల‌ను నిర్ధారించి.. ఎవ‌రి లే ఔట్‌లోకి ఎవ‌రు చొర‌బ‌డ్డార‌నేది తేల్చేందుకు హైడ్రా అధికారుల క‌స‌ర‌త్తు ముమ్మరం చేశారు.