
- ఐటీ కారిడార్‌లోని ప్రభుత్వ జాగాలో షెడ్లు, ఫామ్‌హౌస్ నిర్మించినట్లు గుర్తింపు
- పోలీస్ బందోబస్త్ మధ్య హైడ్రా కూల్చివేతలు.. వందల కోట్ల ప్రభుత్వ భూమికి విముక్తి
- కొత్త సర్వే నంబర్ సృష్టించి ప్రభుత్వ వ్యవస్థలను తప్పుదోవ పట్టించినట్టు నిర్ధారణ
మాదాపూర్, వెలుగు: హైదరాబాద్ఐటీ కారిడార్‌లోని రెండు ప్రాంతాల్లో ప్రభుత్వ స్థలాల్లో చేపట్టిన అక్రమ నిర్మాణాలను శనివారం హైడ్రా అధికారులు కూల్చివేశారు. వందల కోట్ల విలువైన ప్రభుత్వ భూమికి విముక్తి కల్పించారు. ప్రభుత్వ భూమిని ఆక్రమించి నిర్మాణాలు చేపట్టిన వాటిలో ఏపీలోని మైలవరం టీడీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్‌కు చెందిన ఆఫీస్, ఫామ్ హౌస్ ఉన్నాయి. భారీ పోలీస్ బందోబస్తు మధ్య హైడ్రా అధికారులు ఈ నిర్మాణాలను పూర్తిగా నేలమట్టం చేసి ప్రభుత్వ భూమిగా పేర్కొంటూ బోర్డులు ఏర్పాటు చేశారు. శేరిలింగంపల్లి మండలం హఫీజ్‌పేట్ గ్రామం సర్వే నంబర్ 79లో మొత్తం 39.2 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది.
ఈ భూమిలో ఇప్పటికే సగానికి పైగా నిర్మాణాలు వెలిశాయి. ఈ ఆక్రమణలకు సంబంధించి వివిధ కోర్టులలో కేసులు ఉన్నాయి. సర్వే నంబర్ 79లో ఉన్న ప్రభుత్వ భూమి నిషేధిత జాబితాగా రెవెన్యూ రికార్డులో నమోదైంది. ఏపీ లోని మైలవరం టీడీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్‌కు చెందిన వసంత హౌస్ నిర్మాణ సంస్థ ఈ సర్వే నంబర్‌ను 79/1గా సృష్టించి ప్రభుత్వ వ్యవస్థలను తప్పుదోవ పట్టించి అక్రమ నిర్మాణాలు చేపట్టినట్లు హైడ్రా అధికారులు గుర్తించారు. ఇదివరకే 19 ఎకరాలను కబ్జా చేసి ఇండ్లు నిర్మించి అమ్మేశారు.
ఖాళీగా ఉన్న 20 ఎకరాల ప్రభుత్వ భూమిలో అఫీస్తో పాటు భారీ షెడ్లు ఏర్పాటు చేసి వివిధ సంస్థలకు కేటాయించినట్లు హైడ్రై అధికారులు పేర్కొన్నారు. ఈ భూములపై సుప్రీం కోర్టులో కేసు పెండింగ్‌లో ఉండగా, కోర్టు ఆదేశాలను ధిక్కరిస్తూ, ఏలాంటి నిర్మాణాలు చేపట్టవద్దనే ఆదేశాలు ఉన్నా.. భారీ అక్రమ నిర్మాణాలను చేపట్టి అద్దెకు ఇచ్చారు. వీటిపై ఫిర్యాదులు అందుకున్న హైడ్రా అధికారులు శనివారం ఉదయాన్నే వసంత హౌస్ నిర్మాణ సంస్థ ప్రభుత్వ భూమిలో చేపట్టిన నిర్మాణాల వద్దకు చేరుకున్నారు.
భారీ యంత్రాలతో కూల్చివేతలు చేపట్టారు. కూల్చివేతల సమయంలో సైబరాబాద్ పోలీసులు భారీ బందోబస్తు కల్పించారు. కూల్చివేతలను అడ్డుకునే ప్రయత్నం చేసిన ఎమ్మెల్యే కుటుంబసభ్యులను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ప్రభుత్వ స్థలంగా పేర్కొంటూ హైడ్రా అధికారులు బోర్డును ఏర్పాటు చేశారు.
యువకుల ఫిర్యాదుతో...
రోజు తాము ఆడుకునే జాగాలోకి రానివ్వకుండా అడ్డుకుటున్నరని, పక్కన చెరువును కబ్జా చేస్తున్నారని స్థానికంగా రాయదుర్గం నందిహిల్స్‌లో క్రికెట్ ఆడుకునే యువకులు హైడ్రాకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన హైడ్రా అధికారులు శేరిలింగంపల్లి మండలం రాయదుర్గం నందిహిల్స్ దగ్గరలోని సర్వే నంబర్ 5/2లో క్షేత్రస్థాయిలో పరిశీలించి 39 ఎకరాల వరకు ప్రభుత్వ భూమిలో ఆక్రమణలు జరుగుతున్నట్లు నిర్ధారించారు.
నార్నే ఎస్టేట్స్ సంస్థ ఒకవైపు ల్యాండ్ గ్రాబింగ్ కేసున్నట్టు బోర్డులు పెట్టి.. మరోవైపు ప్లాట్ల అమ్మకానికి ఫోను నంబర్లతో బోర్డులు పెట్టినట్లు గుర్తించారు. అనుమతిలేని లే ఔట్‌తో రోడ్లు నిర్మిస్తూ.. ప్లాట్లు అమ్మకాలు చేపట్టిన ఆక్రమణదారులు. అక్కడ చెరువు కూడా కబ్జా చేసి ప్లాట్లుగా అమ్మకాలు చేస్తున్నట్లు నిర్ధారించారు. ఈ భూమిని ఆక్రమించి చేపట్టిన నిర్మాణాలను హైడ్రా అధికారులు శనివారం తొలగించి ప్రభుత్వ స్థలంగా పేర్కొంటూ బోర్డును ఏర్పాటు చేశారు.