HYDRAA: కబ్జా స్థలాలకు లోన్లు ఇవ్వొద్దు.. బ్యాంకర్లతో హైడ్రా

HYDRAA: కబ్జా స్థలాలకు లోన్లు ఇవ్వొద్దు.. బ్యాంకర్లతో హైడ్రా

జీహెచ్ఎంసీ పరిధిలోని చెరువులు, నాలాలపై అక్రమ నిర్మాణాలను కూల్చేస్తున్న హైడ్రా మరో ముందడుగు వేసింది. FTL, బఫర్ జోన్లోని నాలాలు, కుంటలను ఆక్రమించి నిర్మించిన అక్రమ కట్టడాలను ఎక్కడికక్కడ నేల మట్టం చేస్తున్న హైడ్రా త్వరలో బ్యాంకర్లతో సమావేశం కానున్నట్లు సమాచారం. ప్రభుత్వ స్థలాల్లో ఆక్రమణలు, అక్రమ నిర్మాణాలకు లోన్లు ఇవ్వకుండా చర్యలు తీసుకోవడంలో భాగంగా ఈ సమావేశం నిర్వహించాలని హైడ్రా నిర్ణయించింది. లోన్లు రాకపోతే ఇటువంటి నిర్మాణాలకు అడ్డుకట్ట వేయొచ్చని హైడ్రా భావిస్తోంది. ఇప్పటికే కూల్చిన నిర్మాణాల్లో చాలా వాటికి బ్యాంకర్లు లోన్లు ఇస్తే కట్టినవేనని హైడ్రా తేల్చింది. అందుకే అటు నుంచి నరుక్కు రావాలని హైడ్రా డిసైడ్ అయింది.

27.06.2024 న ఫిల్మ్ నగర్ కో ఆపరేటివ్ సొసైటీ, ప్లాట్ నంబర్.30 (లోటస్ పాండ్)తో అక్రమ నిర్మాణాల కూల్చివేతలను హైడ్రా మొదలుపెట్టింది. కావూరి హిల్స్ పార్కు స్థలంలో నిర్మించిన స్పోర్ట్స్ అకాడమీ షెడ్లను అధికారులు సోమవారం నాడు (సెప్టెంబర్ 23, 2024) నేలమట్టం చేశారు. కావూరి హిల్స్ అసోసియేషన్ ఫిర్యాదు మేరకు హైడ్రా రంగంలోకి దిగింది. అకాడమీ నిర్మాణాలను కూల్చేశారు. అనంతరం అక్కడ కావూరి హిల్స్‌ పార్కు అని బోర్డు ఏర్పాటు చేశారు.

ALSO READ | కావూరి హిల్స్‎లోకి హైడ్రా ఎంట్రీ..!

కూకట్​పల్లిలోని నల్ల చెరువు, సంగారెడ్డి జిల్లా అమీన్​పూర్​లోని అక్రమ నిర్మాణాలను హైడ్రా అధికారులు ఆదివారం (సెప్టెంబర్ 22, 2024) కూల్చేశారు. మొత్తం 44 నిర్మాణాలను నేలమట్టం చేశారు. నల్ల చెరువు ఎఫ్​టీఎల్, బఫర్ జోన్​లో ఉన్న 16 షెడ్లను హైడ్రా అధికారులు కూల్చేశారు. నల్ల చెరువు 27 ఎకరాల్లో విస్తరించి ఉండగా.. ఎఫ్​టీఎల్, బఫర్​జోన్​లోని ఏడు ఎకరాల భూమి కబ్జాకు గురైనట్టు అధికారులు తేల్చారు. అదేవిధంగా.. పటేల్​గూడ, కిష్టారెడ్డిపేట ప్రాంతాల్లోని 28 అక్రమ నిర్మాణాలను హైడ్రా అధికారులు నేలమట్టం చేశారు. వీటిలో 25 విల్లాలు, మూడు అపార్ట్మెంట్లు ఉన్నాయి. కూల్చివేతలను అడ్డుకునేందుకు ప్రయత్నించిన వారిని పోలీసులు పక్కకు తీసుకెళ్లారు.