హైదరాబాద్ సిటీ/శంషాబాద్, వెలుగు: చెరువులు, కుంటల్లోని ఎఫ్టీఎల్, బఫర్జోన్లలో వెలిసిన అక్రమ నిర్మాణాల కూల్చివేతలో హైడ్రా దూకుడు పెంచింది. హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్ సర్కిల్ గగన్ పహాడ్ అప్పా చెరువు ఎఫ్ టీఎల్ పరిధిలో అక్రమంగా నిర్మించిన 14 షెడ్లను హైడ్రా అధికారులు శనివారం కూల్చివేశారు. ఇందులో 4 షెడ్లు గ్రేటర్హైదరాబాద్51వ డివిజన్ కార్పొరేటర్తోకల శ్రీనివాస్‌రెడ్డి (బీజేపీ)వి.
35 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ చెరువులో అక్రమ నిర్మాణాలు జరుగుతున్నట్టు హైడ్రాకు ఫిర్యాదులు వచ్చాయి. స్పందించిన హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ విచారణకు ఆదేశించారు. క్షేత్రస్థాయిలో విచారణ జరిపిన హైడ్రా అధికారులు.. అప్పా చెరువులో 3 ఎకరాల పరిధిలో అక్రమంగా14 షెడ్లను నిర్మించినట్టు నివేదిక ఇచ్చారు. హైడ్రా కమిషనర్ ఆదేశాల మేరకు స్థానిక పోలీసులు, రెవెన్యూ, ఇరిగేషన్, మున్సిపల్ విభాగాల ఆధ్వర్యంలో శనివారం ఆక్రమణలను జేసీబీలతో తొలగించారు.
ఈ షెడ్లలో యజమానులు చిన్నచిన్న పరిశ్రలను ఏర్పాటు చేసుకొని, వ్యాపారాలను కొనసాగిస్తున్నారు. కాటన్ప్యాకింగ్, వాటర్ బాటిల్ ప్యాకింగ్, ఇతర వ్యాపారాలు చేస్తున్నారు. కూల్చివేతల సందర్భంగా భారీ పోలీసు భద్రత ఏర్పాటు చేశారు. షెడ్లకు సంబంధించిన వారు అడ్డుకునే ప్రయత్నం చేయగా.. పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తమ షెడ్లను కూల్చవద్దంటూ అధికారులను వ్యాపారులు వేడుకున్నారు.
ఒక మహిళ యజమాని ఏకంగా హైడ్రా అధికారి కాళ్లపై పడి, వేడుకునేందుకు ప్రయత్నించింది. తమ షెడ్డు కూల్చివేయవద్దని ఆత్మహత్య చేసుకుంటానంటూ షెడ్ లోపలికి వెళ్లేందుకు మరో యజమాని యత్నించాడు. వెంటనే వారిని అడ్డుకున్న పోలీసులు అక్కడి నుంచి తరలించారు. కూల్చివేతలపై అధికారులు ఎలాంటి ముందస్తు నోటీసు ఇవ్వలేదని, నేరుగా కూల్చివేతలు చేపట్టారని ఆరోపించారు.
కనీసం అందులో మెషినరీ షిఫ్ట్ చేసుకునేందుకు కూడా సమయం ఇవ్వకుండా కూల్చివేయడంపై పరిశ్రమల యజమానులు ఆవేదన వ్యక్తం చేశారు. తాము కిరాయికి తీసుకుని పరిశ్రమలను నడుపుకుంటున్నామని, ముందుగా సమాచారం ఇవ్వకుండానే కూల్చివేయడం వల్ల లక్షల రూపాయలు నష్టపోతున్నామని వాపోయారు. విషయం తెలుసుకొని అక్కడికి వచ్చిన కార్పొరేటర్శ్రీనివాస్రెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వం కక్షపూరితంగానే షెడ్లను కూల్చివేస్తున్నదని అన్నారు.