హాలియా, వెలుగు: నాగార్జున సాగర్ డ్యామ్ వద్ద శనివారం హైడ్రామా జరిగింది. మరోసారి డ్యామ్ నిర్వహణ వివాదం తెరపైకి వచ్చింది. గత కొన్ని రోజులుగా సాగర్ డ్యామ్ కేంద్ర బలగాలైన సీఆర్పీఎఫ్ అధీనంలో ఉంది. అటు ఆంధ్రా వైపు, ఇటు తెలంగాణ వైపు సీఆర్పీఎఫ్ బలగాలు పహారా కాస్తున్నాయి. అయితే శనివారం ఉదయం తెలంగాణ వైపు ఉన్న సీఆర్పీఎఫ్ బలగాలు తమ భద్రతను ఉపసంహరించుకున్నాయి. దీంతో తెలంగాణకు చెందిన ఎస్పీఎఫ్ బలగాలు డ్యామ్‌ను తమ అధీనంలోకి తీసుకున్నాయి.
కానీ సాయంత్రానికి సీన్ రివర్స్ అయింది. మళ్లీ సీఆర్పీఎఫ్ బలగాలు వచ్చి డ్యామ్‌ను తమ అధీనంలోకి తీసుకున్నాయి. కాగా, పోయినేడాది నవంబర్29న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ టైమ్‌లో నాగార్జున సాగర్ డ్యామ్ నిర్వహణ, భద్రతపై రెండు రాష్ట్రాల మధ్య వివాదం తలెత్తింది. ఈ క్రమంలో రెండు రాష్ట్రాలతో సమావేశం నిర్వహించిన కేంద్ర జలశక్తి శాఖ.. డ్యామ్ నిర్వహణను కేఆర్ఎంబీకి అప్పగించి, భద్రతను సీఆర్పీఎఫ్ బలగాలకు అప్పగించింది.